పరబ్రహ్మ యందు భేదములు
విధిహరిహర భేదమప్యఖండే బత విరచయ్య బుధానపి ప్రకామం
భ్రమయతి హరిహర విభేదభావః నఘటిత ఘటనా పటీయసి మాయా ||
నిర్వికారము, నిర్గుణము, సర్వ వ్యాపకము, అద్వితీయము, నిరంజనము, నిష్క్రియము అయిన పరబ్రహ్మలో, మనం ఉపాసన కోసం నామ-రూప భేదము కల్పిస్తున్నాము. కానీ "న తే రూపం నచాకారః న ఆయుధాని నచాస్పదం".
హరిహరులకు అభేదము అంటే జనసామాన్యముగా ఉన్న నానుడి ఏమిటంటే వైకుంఠములో విష్ణువు, కైలాసము లో శివుడు అని ఇద్దరు ఉన్నారు. వారిద్దరు సమానులే. శివస్య హృదయం విష్ణుః, విష్ణుస్య హృదయం శివః. ఈయన మనసు లో ఆయన, ఆయన హృదయములో ఈయన ఉన్నారు అని. వీరివురు కాకుండా సత్యలోకములో బ్రహ్మ అని ఒకరు ఉన్నారు. ఆయన సృష్టి కర్త. ఆయనని పరమశివుడు శపించాడు, కాబట్టి ఆయనకి పూజార్హత లేదు. ఈ విధముగా సాగుతుంది సంభాషణ.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే మూడు రూపాలు లేవు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ, పరమాత్మ. అందుకే హరిహరులకు అభేదము. అఖండమయిన పరబ్రహ్మనే మన ఉపాసనా సౌలభ్యము కోసం వేరు వేరు రూపములుగా, ఆ రూపములకు ఆస్థానాలుగా వేరు వేరు లోకాలు, వారికి పరివారాలు, వాహనాలు కల్పించుకున్నాము. ఈ వివిధ రూపగుణాలకు వివిధ ఉపాసనా పద్దతులు కూడా ఏర్పరుచుకున్నాము. వైష్ణవము, శైవము, గాణపత్యము, శాక్తేయము, సౌరము వంటివి అలా పుట్టిన భేదములే. విచిత్రం ఏంటంటే ఈ వివిధ భేదాల చక్రంలో ఇరుక్కొని, పరబ్రహ్మను గుర్తించలేకపోతున్నాము.
ఇంకా విచిత్రము – ఇటువంటి మూల మతాలే కాకుండా గురువుల పేరున, మఠముల పేరున ఇంకా విడిపోయి ఒక అయోమయ స్థితి లో భ్రమిస్తూ ఉండిపోతున్నాము.
“ఉపాసకామాన్
కార్యార్థం బ్రహ్మణో రూప కల్పనామ్”
ఉపాసన ఉపాస్యము.
ఉపాసింప బడుతున్నది ఉపాస్యము, అంటే ఆ దైవము. దైవము అఖండం. అఖండమునకు నామ రూపములు
ఉండవు. అఖండము అంటే అద్వైతము – రెండవది లేదు. ఇంకొక వస్తువు లేనప్పుడు ఇంకా నామ
రూప విభజన ఉండదు.
కానీ ఉపాసన చేసేటప్పుడు, ఈ ఉపాస్యమునకు ఒక నామము, రూపము కలుగచేసి, దానిని ఉపాసిస్తాం. అలా చేస్తూ నిజమైన పర బ్రహ్మను మరుస్తున్నాం. ‘విష్ణు సర్వ వ్యాపకుడు’ అంటూనే ఆయనని వైకుంఠవాసిగా చూస్తాం.
ఇది ఒక వ్యామోహము. ఈ వ్యామోహము 'బుధానాపి' - పండితులను కూడా వదలక పోగా, వారిచే ఈ సంఘములో ఇంకా ప్రజ్వలింపజేయబడుతోంది. ఇది "అఘటిత ఘటనా పటీయసి మాయా!" ఇది మాయ యొక్క ప్రభావము కాక ఇంకేమీ కాదు.
ఇది మాయా పంచకము.
ఉపసంహారము
ఆహా! ఇటువంటి అఘటిత ఘటనలను ఘటిలలేటట్లు
చేసే మాయ యొక్క శక్తి ఇంతటిది అయితే, ఈ మాయ నుండి బయట పడడం సాధ్యమేనా?
"దైవీ
హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
మామేవ
యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే
అని గీతాచార్యుని బోధ. ‘దైవ సంబంధమయినది, త్రిగుణములతో కూడుకున్నది అయి నేను కల్పించిన మాయ దాటుట అతి కష్టము. కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని దాటగలరు.’
ప్రపత్తి అంటే సర్వ శరణాగతి. నిష్కామ భక్తి. అన్నింటికీ ఆ పరబ్రహ్మనే శరణువేడడం. ఏది జరిగినా అది కేవలం పరమాత్మ యొక్క ప్రసాదము అని గ్రహించడం. "నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్ " అన్న గజేంద్రుని స్థితి లో ఎల్లవేళలా ఉండటం. ఈ సర్వ శరణాగతి ఎంతవరకు మనము చేయగలము? ఎటు వంటి సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు ఎదురయినా, వాటిని పరమాత్మ యొక్క అనుగ్రహముగా స్వీకరించగలమా? ప్రతికూల పరిస్థితులలో కూడా ఆ శరణాగతి వదలకుండా, అనుకూల పరిస్థితులలో పరమాత్మ మీద ఉన్న ధ్యానం వదలకుండా ఉండగలమా?
సజ్జన సాంగత్యము, ఆత్మ విచారము, నిరంతర సాధన తో ఇది సాధ్యము అవుతుంది. ఆ సాధన తో, ఆ విచారముతో నిష్కామ కర్మ సాధ్యం అవుతుంది. కర్మ ఫలాలను త్యజిస్తే, కోరికలు శమిస్తాయి. కోరికలు లేనప్పుడు, బంధాలు ముడి విడుతాయి. మరి, అటు వంటి సాధన ఎలా సాధ్యము?
ఆత్మానాత్మ వివేకము, నిత్యానిత్య వివేకము, సత్-అసత్ వివేకము - ఏది ఆత్మ, ఏది అనాత్మ , ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము ఏది అసత్యము అన్న విచక్షణ కలగడం మొదటి అడుగు గా భావించవచ్చు.
వివేకము కలుగుతున్న కొద్దీ అనిత్యమైన, అనాత్మ అయిన, అసత్తు అయిన విషయముల మీద ఆసక్తి తగ్గుతుంది. అదే వైరాగ్యము. కర్మలు మానుట వైరాగ్యము కాదు. కర్మ ఫలముల మీద అనాపేక్ష. సంసారమును వదలడం కాదు. దాని మీద ఆసక్తి, ఆపేక్ష వదలాలి. తామరాకు మీద నీటి బొట్టు లా ఉండగలగాలి.
వివేక వైరాగ్యాలు పెరుగుతున్న కొలదీ, ఒక రకమయిన శాంతి, పరిపూర్ణత్వము గోచరమవుతూ ఉంటుంది. అదే శమము.
జ్ఞాన, కర్మేంద్రియాలు పై పట్టు పెరుగుతుంది. అదే దమము.
బాహ్య విషయాసక్తి తగ్గి, తనలో తానూ చరిస్తూ, రమిస్తాడు - ఉపరతి.
క్షమ, సహనము పెరుగుతాయి - తితీక్ష.
తానూ ఎంచుకున్న మార్గం పై విశ్వాసము, పూనిక కలిగి అచలుడై ఉంటాడు - శ్రద్ధ.
ఈ సత్యాన్వేషణమును, ప్రయాణమును ఏకాగ్ర చిత్తము తో సాగించడం సమాధానము.
శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనే ఈ ఆరు షట్ సంపత్తులు.
వీటి వలన కలిగేది జననమరణాతీత స్థితి అయినా ముక్తి లేదా మోక్షము పై తీవ్రమయిన ధ్యాస. మోక్షము అనగా భవ బంధముల నుండి ముక్తి. దీనినే ముముక్షత్త్వము అంటారు.
వివేకము, విరాగము, షట్ సంపత్తి, ముముక్షత్వం – ఈ నాలుగింటిని సాధనా చతుష్టయము అంటారు. నిరంతర అభ్యాసముల ద్వారా సాధన సాగించి వీటిని పొందాలి.
సాధన ఎలా చెయ్యాలి అంటే –
(శ్రవణము) వేదాంత బోధలు , మహా వాక్యాలు, వివిధ భాష్యములు వినడము
(మననము) వాటిని స్మరిస్తూ అర్థము, అన్వయము చేసుకోవడము
(నిధిధ్యాసన) ఆ అన్వయమును ఆలవాలముగా చేసుకొని ఆత్మా జ్ఞానానికై ధ్యానించడం.
శ్రవణ మననములలో బుద్ధి యొక్క అష్టాంగములు పాటించాలి. అవి గ్రహణము, ధారణము, స్మరణము, ప్రతిపాదనము, ఊహాపోహ, అర్థ విజ్ఞానము, తత్వ జ్ఞానము.
నిధిధ్యాసన / ధ్యానము చేయుటకు యమ, నియమములు సహకరిస్తాయి. అహింస, సత్యము, అస్తేయము (చౌర్యము చేయకుండుట) , బ్రహ్మచర్యము, అపరిగ్రహము - ఇవి యమములు. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నియమములు.
చీకటి గది లో ఒక దీపం వెలిగించి గానే, మనకి వెనువెంటనే ఆ గదిలో వస్తువులు కనిపించవు. ఆ వెలుతురుకి మన కనులు నెమ్మదిగా అలవాటు పడుతూండగా, నెమ్మది నెమ్మది గా వస్తు విశేషాలు గోచరమవుతాయి. అలాగే సాధన చేస్తున్న కొలదీ ఈ గుణముల పరిపక్వత కలుగుతుంది. ఆ పరిపక్వత జ్ఞానమును కలిగిస్తుంది. ఆ జ్ఞానము తో మాయ అనే తెర తొలగుతుంది.
ఇప్పుడు 'ఇవి అన్నీ చెయ్యడం సాధ్యమేనా?' అన్న ప్రశ్న కలగడం ఆశ్చర్యమయిన విషయము కాదు. సాధ్యమే అని చెబుతాయి వేద వేదాంగ పురాణేతిహాసాలు. లౌకిక విద్యా సాధన చెయ్యగలిగినప్పుడు, మనం పూనుకుంటే, సరి అయిన మార్గదర్శి ఉంటే ఈ ఆధ్యాత్మిక సాధన ఎందుకు వీలు పడదు?
ఓం
శాంతి శాంతి శాంతిః
స్వస్తి
No comments:
Post a Comment