Friday, April 28, 2023

మాయా పంచకం - 5 : పరబ్రహ్మ యందు భేదములు & ఉపసంహారము

 పరబ్రహ్మ యందు భేదములు    

విధిహరిహర  భేదమప్యఖండే బత  విరచయ్య  బుధానపి  ప్రకామం

భ్రమయతి  హరిహర విభేదభావః నఘటిత ఘటనా పటీయసి  మాయా || 

నిర్వికారమునిర్గుణము, సర్వ వ్యాపకము, అద్వితీయము, నిరంజనము, నిష్క్రియము అయిన పరబ్రహ్మలో, మనం ఉపాసన కోసం నామ-రూప భేదము కల్పిస్తున్నాము. కానీ "న తే రూపం నచాకారః న ఆయుధాని  నచాస్పదం".

హరిహరులకు అభేదము అంటే జనసామాన్యముగా ఉన్న నానుడి ఏమిటంటే వైకుంఠములో విష్ణువు, కైలాసము లో శివుడు అని ఇద్దరు ఉన్నారు. వారిద్దరు సమానులే. శివస్య హృదయం విష్ణుః, విష్ణుస్య హృదయం శివః. ఈయన మనసు లో ఆయన, ఆయన హృదయములో ఈయన ఉన్నారు అని.  వీరివురు కాకుండా సత్యలోకములో బ్రహ్మ అని ఒకరు ఉన్నారు. ఆయన సృష్టి కర్త. ఆయనని పరమశివుడు శపించాడు, కాబట్టి ఆయనకి పూజార్హత లేదు. ఈ విధముగా సాగుతుంది సంభాషణ. 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే మూడు రూపాలు లేవు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ, పరమాత్మ. అందుకే హరిహరులకు అభేదము. అఖండమయిన పరబ్రహ్మనే మన ఉపాసనా సౌలభ్యము కోసం వేరు వేరు రూపములుగా, ఆ రూపములకు ఆస్థానాలుగా వేరు వేరు లోకాలు, వారికి పరివారాలు, వాహనాలు కల్పించుకున్నాము.  ఈ వివిధ రూపగుణాలకు వివిధ ఉపాసనా పద్దతులు కూడా ఏర్పరుచుకున్నాము. వైష్ణవము, శైవము, గాణపత్యము, శాక్తేయము, సౌరము వంటివి అలా పుట్టిన భేదములే. విచిత్రం ఏంటంటే ఈ వివిధ భేదాల చక్రంలో ఇరుక్కొని, పరబ్రహ్మను గుర్తించలేకపోతున్నాము. 

ఇంకా విచిత్రము – ఇటువంటి మూల మతాలే కాకుండా గురువుల పేరున, మఠముల పేరున ఇంకా విడిపోయి ఒక అయోమయ స్థితి లో  భ్రమిస్తూ ఉండిపోతున్నాము. 

“ఉపాసకామాన్ కార్యార్థం బ్రహ్మణో రూప కల్పనామ్”

ఉపాసన ఉపాస్యము. ఉపాసింప బడుతున్నది ఉపాస్యము, అంటే ఆ దైవము. దైవము అఖండం. అఖండమునకు నామ రూపములు ఉండవు. అఖండము అంటే అద్వైతము – రెండవది లేదు. ఇంకొక వస్తువు లేనప్పుడు ఇంకా నామ రూప విభజన ఉండదు.

కానీ ఉపాసన చేసేటప్పుడు, ఈ ఉపాస్యమునకు ఒక నామము, రూపము కలుగచేసి, దానిని ఉపాసిస్తాం. అలా చేస్తూ నిజమైన పర బ్రహ్మను మరుస్తున్నాం. ‘విష్ణు సర్వ వ్యాపకుడు’ అంటూనే ఆయనని వైకుంఠవాసిగా చూస్తాం.

ఇది ఒక వ్యామోహము. ఈ వ్యామోహము 'బుధానాపి' - పండితులను కూడా వదలక పోగా, వారిచే ఈ సంఘములో ఇంకా ప్రజ్వలింపజేయబడుతోంది. ఇది "అఘటిత ఘటనా పటీయసి మాయా!" ఇది మాయ యొక్క ప్రభావము కాక ఇంకేమీ కాదు. 

ఇది మాయా పంచకము. 

ఉపసంహారము

ఆహా! ఇటువంటి అఘటిత ఘటనలను ఘటిలలేటట్లు చేసే మాయ యొక్క శక్తి ఇంతటిది అయితే, ఈ మాయ నుండి బయట పడడం సాధ్యమేనా?

"దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా

మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే

అని గీతాచార్యుని బోధ. ‘దైవ సంబంధమయినది, త్రిగుణములతో కూడుకున్నది అయి నేను కల్పించిన మాయ దాటుట అతి కష్టము. కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని దాటగలరు.’

ప్రపత్తి అంటే సర్వ శరణాగతి. నిష్కామ భక్తి. అన్నింటికీ ఆ పరబ్రహ్మనే శరణువేడడం. ఏది జరిగినా అది కేవలం పరమాత్మ యొక్క ప్రసాదము అని గ్రహించడం. "నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్ " అన్న గజేంద్రుని స్థితి లో ఎల్లవేళలా ఉండటం. ఈ సర్వ శరణాగతి ఎంతవరకు మనము చేయగలము? ఎటు వంటి సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు ఎదురయినా, వాటిని పరమాత్మ యొక్క అనుగ్రహముగా స్వీకరించగలమా? ప్రతికూల పరిస్థితులలో కూడా ఆ శరణాగతి వదలకుండా, అనుకూల పరిస్థితులలో పరమాత్మ మీద ఉన్న ధ్యానం వదలకుండా ఉండగలమా? 

సజ్జన సాంగత్యము, ఆత్మ విచారము, నిరంతర సాధన తో ఇది సాధ్యము అవుతుంది. ఆ సాధన తో, ఆ విచారముతో నిష్కామ కర్మ సాధ్యం అవుతుంది. కర్మ ఫలాలను త్యజిస్తే, కోరికలు శమిస్తాయి. కోరికలు లేనప్పుడు, బంధాలు ముడి విడుతాయి. మరి,  అటు వంటి సాధన ఎలా సాధ్యము? 

ఆత్మానాత్మ వివేకము, నిత్యానిత్య వివేకము, సత్-అసత్ వివేకము - ఏది ఆత్మ, ఏది అనాత్మ , ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము ఏది అసత్యము అన్న విచక్షణ కలగడం మొదటి అడుగు గా భావించవచ్చు. 

వివేకము కలుగుతున్న కొద్దీ అనిత్యమైన, అనాత్మ అయిన, అసత్తు అయిన విషయముల మీద ఆసక్తి తగ్గుతుంది. అదే వైరాగ్యము. కర్మలు మానుట వైరాగ్యము కాదు. కర్మ ఫలముల మీద అనాపేక్ష. సంసారమును వదలడం కాదు. దాని మీద ఆసక్తి, ఆపేక్ష వదలాలి. తామరాకు మీద నీటి బొట్టు లా ఉండగలగాలి. 

వివేక వైరాగ్యాలు పెరుగుతున్న కొలదీ, ఒక రకమయిన శాంతి, పరిపూర్ణత్వము గోచరమవుతూ ఉంటుంది. అదే శమము.

జ్ఞాన, కర్మేంద్రియాలు పై పట్టు పెరుగుతుంది. అదే దమము.

బాహ్య విషయాసక్తి తగ్గి, తనలో తానూ చరిస్తూ, రమిస్తాడు - ఉపరతి.

క్షమ, సహనము పెరుగుతాయి - తితీక్ష

తానూ ఎంచుకున్న మార్గం పై విశ్వాసము, పూనిక కలిగి అచలుడై ఉంటాడు - శ్రద్ధ.

ఈ సత్యాన్వేషణమునుప్రయాణమును ఏకాగ్ర చిత్తము తో సాగించడం సమాధానము.

శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనే ఈ ఆరు షట్ సంపత్తులు. 

వీటి వలన కలిగేది జననమరణాతీత స్థితి అయినా ముక్తి లేదా మోక్షము పై తీవ్రమయిన ధ్యాస. మోక్షము అనగా భవ బంధముల నుండి ముక్తి. దీనినే ముముక్షత్త్వము అంటారు.

వివేకము, విరాగము, షట్ సంపత్తి, ముముక్షత్వం – ఈ నాలుగింటిని సాధనా చతుష్టయము అంటారు. నిరంతర అభ్యాసముల ద్వారా సాధన సాగించి వీటిని పొందాలి.

సాధన ఎలా చెయ్యాలి అంటే –

(శ్రవణము) వేదాంత బోధలు , మహా వాక్యాలు, వివిధ భాష్యములు వినడము

(మననము) వాటిని స్మరిస్తూ అర్థము, అన్వయము చేసుకోవడము

(నిధిధ్యాసన) ఆ అన్వయమును ఆలవాలముగా చేసుకొని ఆత్మా జ్ఞానానికై ధ్యానించడం.

శ్రవణ మననములలో బుద్ధి యొక్క అష్టాంగములు పాటించాలి. అవి  గ్రహణము, ధారణము, స్మరణము, ప్రతిపాదనము, ఊహాపోహ, అర్థ విజ్ఞానము, తత్వ జ్ఞానము. 

నిధిధ్యాసన / ధ్యానము చేయుటకు యమ, నియమములు సహకరిస్తాయి. అహింస, సత్యము, అస్తేయము (చౌర్యము చేయకుండుట) , బ్రహ్మచర్యము, అపరిగ్రహము - ఇవి యమములు. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నియమములు. 

చీకటి గది లో ఒక దీపం వెలిగించి గానే, మనకి వెనువెంటనే ఆ గదిలో వస్తువులు కనిపించవు. ఆ వెలుతురుకి మన కనులు నెమ్మదిగా అలవాటు పడుతూండగా, నెమ్మది నెమ్మది గా వస్తు విశేషాలు గోచరమవుతాయి. అలాగే సాధన చేస్తున్న కొలదీ ఈ గుణముల పరిపక్వత కలుగుతుంది. ఆ పరిపక్వత జ్ఞానమును కలిగిస్తుంది. ఆ జ్ఞానము తో మాయ అనే తెర తొలగుతుంది.

ఇప్పుడు 'ఇవి అన్నీ చెయ్యడం సాధ్యమేనా?' అన్న ప్రశ్న కలగడం ఆశ్చర్యమయిన విషయము కాదు. సాధ్యమే అని చెబుతాయి వేద వేదాంగ పురాణేతిహాసాలు. లౌకిక విద్యా సాధన చెయ్యగలిగినప్పుడు, మనం పూనుకుంటే, సరి అయిన మార్గదర్శి ఉంటే ఈ ఆధ్యాత్మిక సాధన ఎందుకు వీలు పడదు? 

ఓం శాంతి శాంతి శాంతిః

స్వస్తి

మాయా పంచకం - 4: సుత దార గేహ మోహము

 సుత దార గేహ మోహము 

అపగత గుణవర్ణ  జాతిభేదే సుఖచితి  విప్రవిడాద్యహంకృతిం చ

స్ఫూటయతి  సుత  దార  గేహే  మోహం త్వఘటిత  ఘటనాపటీయసీ మాయా ||

‘నేను’ (ఆత్మ) ఎవరు? ఈ ప్రశ్న కి సమాధానం - ‘నేను’ ఒక సచ్చిదానంద స్వరూపము. కానీ ఈ మాంస మయ దేహమే ‘నేను’ అన్న భ్రమ లో ఉంటాం. ఈ భ్రమ కేవలం మన దేహము నందు మాత్రమే కాదు, పరబ్రహ్మ నందు కూడా చూస్తున్నాము. అలా మనం ఆరాధిస్తున్న వివిధ విగ్రహాలు ఈ భేదాన్ని మరింత ఎట్టి చూపుతున్నాయి. కానీ దేవతా స్వరూపము మృణ్మయమో, దారుమయమో కాదు. ఆ విగ్రహం కేవలం ఒక ప్రతినిధి మాత్రమే. కొమ్మని చూపి, చంద్రుణ్ణి చూపించినట్లు, విగ్రహాలు ఆ కొమ్మ. పరమాత్మ చంద్రుడు.

ఆ పరబ్రహ్మ తత్వం తెలిసిన తరవాత ‘న మృత్ శిలా మయా దేవతాః న ఆపోమయం తీర్థం’. పుణ్య తీర్థాల్లో ఉండేవి కేవలం జలం కాదు. అలా అయితే మన ఇంట్లో ఉన్న నీటికి కూడా ఆ పుణ్య శక్తి ఉండాలి. 

అలాగే ఈ దేహ స్వరూపం ‘నేను’ కాదు – ‘నేను’ చిన్మయ స్వరూపుడను. ఆనంద స్వరూపుడను. అటు వంటి ‘నాలో’  - అపగత గుణ వర్ణ  జాతి భేదే! 

సత్త్వ , రజస్, తమో గుణాలు మూడు. ఈ గుణములలో భేదం ఉంటుంది. ఈ గుణములను అంటి పెట్టుకున్న వస్తువులకు, ఆయా గుణములు కలుగుతాయి.

వర్ణ భేదం కలదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు గలవు. కులము వేరు. వర్ణము వేరు. జన్మతః కలిగేది వర్ణము. చేయు కార్యముల వలన కలిగేది కులము. (గోకులము అంటే గోవులను సాకే వారు అందరూ ఉన్న కూటమి. ఈ గో కులము లో వర్ణ భేదములు ఉండవచ్చు. ఈ రెండిటినీ కలిపి ఒక్కటిగా చూడటము తప్పు. కానీ ఇది జన సామాన్య విషయమయిపోయినది.) 

జాతి భేదం కూడా కలదు. దేవ దానవ కిన్నెర కింపురుష, మానవ సమస్త జంతు జాలము వివిధ జాతులుకు చెందినవి. అలాగే ప్రతీ జాతిలోనూ పలు విజాతులు కలవు.

అయితే ఈ గుణ, వర్ణ, జాతి భేదాలు అన్నీ ఈ దేహానివే తప్పా, ‘చిత్’ స్వరూపము నందు లేవు. కానీ మనం ఈ భేదాలు అన్నీ ఆపాదించుకొని, సస్వరూపమయిన ఆనంద , చిన్మయత్వానికి దూరం అవుతున్నాం. 

స్ఫూటయతి  సుత  దార  గేహే  మోహం 

పిల్లలు, భార్య, స్వగృహము పై మోహము, అహం/నేను, మమ/నాది అనే భావన. వీటి పైనే మానవ సమాజం ఆధారపడి ఉందేమో అనిపిస్తుంది. నేను, నాది అన్నవి ఏమీ లేకపోతే మనిషి కి అస్తిత్వం లేదు. కేవలం శూన్య స్థితి లో ఉంది పోతాడు మనిషి ఈ సమాజం లో.  నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా గృహము, నా ధనము, నా స్థలము – వీటితోనే మనిషి గుర్తింపబడుతున్నాడు. వీటి ద్వారా మనిషి తనకు తాను ఒక పూర్ణత్వం ఆపాదించుకుంటున్నాడు.  ఈ సమాజం వీటిని ఒక వ్యక్తి యొక్క గుర్తింపుగా, జీవితం లో ముఖ్య వస్తువులుగా చూస్తుంది.

ధర్మార్థకామమోక్షములు చతుర్విధ పురుషార్థములు. సూత, దార, గేహములు ఇందులోని అర్థకామములను సూచిస్తాయి కదా.  మరి ఇవి ఉండటం వలన నష్టం ఏమిటి? 

వీటి వలన నష్టం ఏమీ లేదు. నిక్షేపముగా ఉండవచ్చు. సప్తర్షులకు సంసారములు ఉన్నాయి కదా?  ఉన్న సమస్య అంతా కూడా వీటి యందు మోహము, మమకారము ఉండటం వల్లనే. వీటి యందు బంధములు పెంచుకొని, ఆ బంధముల ద్వారా సుఖము కలగాలి అని చూస్తాము. ఆ బాహ్య వస్తువు నందు సుఖము కొరకు శ్రమ, తపన. అవి దొరకకపోతే దుఃఖం. 

‘నా భర్త ఈ విధం గా నాడుచుకుంటే నాకు ఆనందం. నా భార్య ఈ విధం గా వంట చేస్తే చాలా బాగుంటుంది. నా కూతురు పెద్ద వైద్యురాలు కావాలి. నా కొడుకు పెద్ద వాహనము లో తిరగాలి. నా ఇంటి ముందు పెద్ద తోట, ఆ తోట లో మామిడి చెట్టు, ఆ చెట్టు మీద పక్షి గూళ్ళు, దానికి కాసే తియ్యని ఫలాలు, వాటిని నా మనవడు తినాలి..’ ఈ విధంగా సూత దార గేహాలపై కోరికల పరంపర నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. 

ఇవి ఎప్పటికీ తరగని సముద్ర తరంగాలు. వీటిని సాధిస్తే ఆనందం. సాధించలేకపోతే దుఃఖం. ఎక్కడి సుఖ మయ, చిద్రూప, ఆనంద, అఖండ స్వరూపం. ఎక్కడ ఈ లౌకికమైన కోరికలు. ఏమైనా పొంతన ఉన్నదా? 

వీటికి అడ్డు కట్ట వేయడం చాలా కష్టం. ఒక శూన్య వ్యక్తి గా మనలేని మన దౌర్బల్యం, ఒక మనిషికి ఈ సమాజం ఏర్పరచిన ప్రమాణాలు అంత సుళువుగా పై కోరికలు లేని జీవితాన్ని గడపనియ్యవు. మనం కూడా ఈ అసహజపు ప్రమాణాలు అందుకోవాలని బాహ్య వస్తువుల వెంట, ఒకదాని వెంట మరొకటిగా పరుగెడుతూనే ఉంటాం. వాటి లోనే మన ఆనందాన్ని, జీవిత పరమార్ధాన్ని అన్వేషిస్తాం. 

ఇది స్థితి తప్పించాలి అంటే, సూత దార గేహాలు కల్పించుకో. కానీ వాటి యందు మమకారం వీడు. వారి యొక్క ప్రవర్తన పై కానీ, వ్యవహారాలపై కానీ మోహము పొందకు. బాహ్య వస్తువుల ప్రాప్తి ద్వారా నీ ఉనికిని , ఆనందాన్ని పొందకు. నిజమే. జీవితం సాగాలి అంటే ఇల్లు కావాలి. భుక్తి కావాలి. తిరగడానికి ఏదో ఒక వాహనం కావాలి. వాటిని సాధించు. సాధించి వదిలెయ్. అంతకన్నా వాటి యందు రమించకు.

ఇది జరగాలి అంటే నిరంతరముగా మన ప్రవర్తనని మనమే విశ్లేషించుకోవాలి. ఒక వ్యక్తి లేదా వస్తువు పై విపరీతమయిన స్పందన కలిగిన వెంటనే, ఆ ఆలోచనను అక్కడే ఆపేసి ఆ స్పందన ఎందుకు కలిగింది అనే విషయము పై ఆలోచన చేయాలి. నీ ఆనందము యొక్క మూలము నీలో ఉన్నదా, లేదా బాహ్య వస్తువు పై ఉన్నదా?

అలా విశ్లేషించగా కలిగేది ‘నా ఆనందానికి మూల బిందువు నాలోనే ఉన్నది. దాని కేంద్ర స్థానం ‘నేను’. ’ అనే వివేకము. ఇది ఎన్నో ఒడిదుడుకులతో సాగే ఒక పరిణామ క్రమము. ఈ పరిణామమే దుఃఖానుభవముగా భావించే ఈ సంసారంలో, మనల్ని సత్ చిత్ ఆనంద స్వరూపులుగా నిలబెడుతుంది.

చిన్మయము, చిద్రూపము అయిన ఈ ఆత్మ యందు గుణ వర్ణ జాతి భేదములు, వాటి నందు గల వివిధ వ్యాపారాదుల ద్వారా జనియించే అహంకార ప్రవృత్తులు కలిగించి, ఆశాశ్వతములు అయిన సుత దార గేహముల పై మోహము కలుగతున్నది. ఏమి ఈ మాయా జనితమయిన అఘటిత ఘటన! అఘటిత ఘటనా పటీయసి మాయ!

మాయా పంచకం - 3: భవ సాగర భ్రమణం

భవ సాగర భ్రమణం

సుఖచిదఖండబోధ  మద్వితీయం వియదనలాది  వినిర్మితే  నియోజ్య

భ్రమయతి  భవసాగరే  నితాంతం త్వఘటిత  ఘటనాపటీయసీ మాయా ||

సత్, చిత్, ఆనందమయము, అఖండము, అద్వితీయము అయిన ఆత్మ ను, అది పంచ భూతాత్మకమయిన శరీరముగా భావింపచేసి, నిరంతరము ఈ భవ సాగరములో తిరగడమనే ఈ అఘటిత ఘటన మాయ యొక్క బలీయమయిన శక్తి! 

సుఖచిదఖండబోధ  మద్వితీయం

‘నేను’ (ఆత్మ) యొక్క స్వరూప వివరణము సత్, చిత్, ఆనంద స్వరూపము.

ఈ ‘నేను’ నిత్యము (సత్). ఇది ఆనంద స్థితిలో ఉంటుంది. అంటే నిరంతర సుఖ స్థితి లో ఉంటుంది. కానీ ఇది దుఃఖ స్థితిలో ఎందుకు చూస్తున్నాము? బాహ్య వస్తువుల వలన. అది ఎలా?

బాహ్య వస్తువు యొక్క ఉనికి చేత మనకి దుఃఖము కలుగదు. ఆ వస్తువును కావాలనుకోవడం, దాని యందు సుఖాన్ని చూడటం, ఆ వస్తువు అలభ్యమయినప్పుడు బాధ పడటం, అది వేరొకరికి దొరికినప్పుడు వారి యందు ఈర్ష్య భావము ఇత్యాది వికారముల వలన దుఃఖము కలుగుతున్నది. వీటినే రాగా ద్వేషములుగా చెప్పవచ్చు.

అంటే నిరంతర సుఖ స్థితి లో ఉండే  ‘నేను’, ఆ సుఖము యొక్క అన్వేషణ ‘నా’ లో చేయకుండా, దానిని బాహ్య వస్తువులకు ఆపాదించి, వాటి యందు మమేకమయి, ‘నా’ లోని సుఖమును మరిచి, దాని కొరకు వేరొక దానిపై ఆధారపడుతున్నాను.

ఆ ‘నా’ లోని సుఖ స్వరూప అన్వేషణమే  ఆత్మ విచారము. ఈ రాగ ద్వేషములు, బాహ్య ప్రపంచము లేనప్పుడు ఈ ‘నేను’ యొక్క స్వరూపము ఏమిటి అన్నదే ఆత్మ విచారము.

కో అహం!

ఎటువంటి ఆలోచనల చలనం లేకుండా, బాహ్య వస్తువుల అస్తిత్వ భావన లేకుండా, ఒక ప్రశాంతమయిన స్థితి కలిగినప్పుడు ఉన్నదే ఈ ‘నేను’. ఆ ఆలోచనల స్తంభనయే సంసార విముక్తి. ఆ ఆలోచనల స్తంభన ప్రక్రియయే ధ్యానం.  అటు వంటి స్థితి లో భావనయే  ‘అహమస్మి ’. ‘నేను’ తప్ప వేరొకటి లేదు. ‘నేను’ మాత్రమే ఉన్నాను. అలా ‘నేను’ మాత్రమే ఉన్నాను అన్నదే ‘నా’ (ఆత్మ) యొక్క నిజ స్థితి – సుఖ, ఆనంద స్థితి.

‘నా’ నిజ స్థితి సుఖ, ఆనందమయితే, మరి దుఃఖమయముగా ఎందుకు అనుభవము అవుతున్నది? అదే మాయా ప్రభావము!

చిత్

చిత్ అంటే స్పృహ, ఎరుక, జ్ఞానము. “నేను ఉన్నాను. నేను చూడగలను. వినగలను. నడవగలను. రుచి చూడగలను. నాలో ఆలోచనల పరంపర ఉంది. సుఖదుఃఖానుభవము ఉంది.” ఇటువంటివి ఉన్నాయి అన్న స్పృహ ఎక్కడ ఉన్నది? మనస్సు లో ఉన్నది. ఆ ‘స్పృహ’ యే ‘నేను’. అదే చిత్.

“నేను ఇక్కడ ఉన్నాను. అక్కడ లేను” అని అన్నప్పుడు, ఆ విషయము నీకు ఎలా తెలిసినది? క్షేత్రములో (లేదా అంతరము లో),  ఒక శరీరము ఆక్రమించిన స్థలము యొక్క జ్ఞానము నీ యందు కలుగుటచే తెలిసినది.

అది ఎలా తెలిసినది ? ఆ శరీరము నీవు కాదు కాబట్టి. ఆ శరీరమే నీవైనచో, దాని యొక్క బిందుస్థానములు నీకు తెలిసే అవకాశము లేదు.  స్థలకాలాదుల పరిమితులలో ఆ శరీరము యొక్క ఉనికిని తెలుసుకున్నది ఏదైతే ఉందో అది నీవు. అదే నీ యొక్క స్పృహ, ఎరుక, -  చిత్.

ఆ చిత్ అపరిమతము, సర్వవ్యాపకము. ఎందువలన? క్షేత్రాగణితము లో ఒక క్షేత్రము తీసుకున్నప్పుడు, అందులో స్థిర స్థానము నుండి బిందుస్థానములు నిర్ణయించడం కేవలం ఆ క్షేత్రానికి అభిన్నముగా ఉన్నప్పుడే సాధ్యము. నీకు ఈ ప్రపంచములో నీ శరీరము యొక్క స్థితి తెలియుచున్నది అంటే, నువ్వు ఆ శరీరానికి, ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచం ఉన్న సృష్టి కి అభిన్నముగా ఉన్నావు. అది కేవలం ‘నువ్వు’ (చిత్) అపరిమితమయి, సర్వ వ్యాపాకము ఐనప్పుడే సాధ్యము. 

అఖండమద్వితీయం

‘నేను’ అఖండము. ఆత్మస్వరూపము సుఖ, చిత్ స్వరూపము అని పైన తెలుసుకున్నాము. సుఖము ఉన్నది – దుఃఖము లేదు. అంతటా ‘నీవే’ ఉన్నావు. అన్నీ ఒకే వస్తువు అయినప్పుడు, ఆ వస్తువును విభాగించడం జరగదు. దానిని ఖండ ఖండాలుగా చూడలేము. అందుకే ‘నేను’ అఖండము. ‘నేను’ అద్వితీయం.

తెలుసుకుంటున్నవాడు జ్ఞాత, తెలియబడుతున్న విషయము జ్ఞేయము. ఇవి రెండూ జ్ఞానము నుండి పుడతాయి. చూచుచున్నవాడు వాడు ద్రష్ట, చూడబడుచున్నది దృశ్యము. ఇది దర్శనము వలనే సాధ్యము. ‘నువ్వు’ జ్ఞాతవా? ద్రష్టవా? రెండూ కాదు. ‘ద్రష్ట’ అని ఒకడు లేనప్పుడు, ‘జ్ఞాత’ అని ఒక పదవి లేనప్పుడు కూడా ‘నువ్వు’ కలవు. దర్శనము లో ‘నువ్వు’ లేవు. జ్ఞేయము లో కూడా ‘నువ్వు’  లేవు.  జ్ఞేయదృశ్యవిహితముగా ‘నువ్వు’ గలవు. కాబట్టి ఆ ‘నువ్వే’  జ్ఞానము, దర్శనము.

‘నా’ నిజ రూపము సుఖచిదఖండమయినప్పటికీ పెరిగిన, మసులుతున్న  ఈ ప్రపంచం ఆ భావన కలుగనివ్వదు. ప్రతీదాని యందు రాగమో, ద్వేషమో ఉండాలని పెరుగుతాం. ఒక వస్తువును అభావముగా చూడడం చాలా అరుదు. ఈ భావన చాలా అలవోకగా ‘చిట్టీ! నీకు నాన్న ఇష్టమా? అమ్మ ఇష్టమా?’ లాంటి చిన్న అమాయకపు ప్రశ్న దగ్గర మొదలవుతుంది. 

రాగద్వేషాలే కాదు, బయటి వారు లేదా వస్తువులు మనల్ని ఏదో చేస్తారనే భయముతో ఉంటాం.  ఈ రాగద్వేషాలు, భీతి, నామ రూప విభేదాలు పరమాత్మ రూపాలుగా మనం భావించి పూజించే విగ్రహాల దగ్గర నుండి, ఖగోళ గ్రహాల వరకు, చివరికి నిర్గుణుడు అయిన ఆ పరబ్రహ్మకి కూడా ఆపాదిస్తాం. ఫలానా గ్రహానికి శాంతి చేయాలి, ఫలానా దేవుడికి అభిషేకం చేయాలి, ఫలానా చోట ఉన్న గుడికి ప్రదక్షిణలు చేస్తే ఏదో మంచి జరుగుతుంది, అలా చేయక పోతే కీడు జరుగుతుంది అని వివిధ వ్యవహారాలు నడుపుతూ, ప్రతీ దానికి భయపడే స్థితిలో జీవిస్తున్నాం. 

వీటికి ఊర్ధ్వముగా ఎదగడానికి ప్రయత్నించాలి.  ‘నేను’ సుఖచిదఖండస్వరూపము అన్న జ్ఞానము మనకు ఆ స్థితి ని కల్పిస్తుంది. 

ఈ సుఖచిదఖండ అద్వితీయమైన స్వరూపమును మనం మాయ యొక్క ప్రభావము చేత మరచి, ఏమవుతున్నాము? 

వియదనలాది  వినిర్మితే  నియోజ్య భ్రమయతి  భవసాగరే  నితాంతం

దేహాధ్యాస, దేహధర్మాధ్యాస చాలా లోతుగా మనలో పాతుకొని ఉంటాయి. ‘ఈ దేహమే నేను. ఈ దేహము యొక్క గుణ ధర్మములు నావి’ అన్న ఆలోచన నిజం కాదు అని మనం అస్సలు అంగీకరించలేము. మనం పాటించే వీధి విధానాలు, ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి అటు వంటివి.

ఒక ఉదాహరణ .

మనం పాటించే దైనందిన కర్మలలో ఈ దేహం శుచి అయితే, ‘నేను’ కూడా శుచి. దేహం అశుచి అయితే, ‘నేను’ కూడా అశుచి. ఇక్కడ ‘నేను’ (ఆత్మ) శుచిగా ఉందా లేదా అన్న ప్రసక్తి ఉండదు. దూర ప్రదేశాలలో సంభవించిన జ్ఞాతుల మరణ వార్త వలన కూడా ఈ దేహానికి అశుచి ఏర్పడుతుంది. అలా కర్మ కాండ అంతా దేహము చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ఇది దేహాధ్యాస ను దూరంగా ఎలా ఉంచుతుంది?

మరొక ఉదాహరణ.

ఒక వ్యక్తి యొక్క ఛాయాచిత్రం ఒకటి తీయించి, ఆ చిత్రం లోని రూపాన్ని ఆ వ్యక్తికి ఆపాదిస్తాం. అంతెందుకు మన ఛాయాచిత్రం తీసుకొని, ‘ ఈ చిత్రం లో నేను బాగున్నాను. ఇందులో నేను కనబడటం లేదు. ఇందులో నీనెక్కడో చూస్తున్నాను.’ అని అంటాం. ఆ చిత్రం లో ఉన్నది నిజంగా మనమేనా? మనం ‘దృశ్యం’ కాదు కదా? అయినా సరే దేహాధ్యాస మనలని వేరే విధంగా ఆలోచించనివ్వదు. 

మన కన్నులతో ఒక చైతన్య స్వరూపాన్ని జడము లో చూస్తూ, మనస్సు, బుద్ధుల సంయోగముతో ఆ జడముకు ఒక రూపాన్ని కల్పించి, చైతన్యవస్తువు గా భ్రమించి, మన తలపుల్లో బంధిస్తాం. రోజూ మార్పు చెందుతున్న దేహం, మనస్సులో బంధించిన రూపం ఒకటి కాదు. ఈ భ్రమ మనం తీసే ప్రతీ ఛాయాచిత్రంతోనూ పెరుగుతూనే ఉంటుంది.

చివరి ఉదాహరణ.

ఈ మధ్య హోమములు, యజ్ఞములు చేయడం చూస్తున్నాము. అలా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న అగ్నికి ఛాయా చిత్రం తీసి,  ఆ అగ్ని కీలలలో ఏదో దేవతా స్వరూపమనో, ఆ హోమ ధూమములో గురు స్వరూపమనో ప్రచారం చేయడం చూస్తున్నాము. అలా మనకు మనమే ఒక భ్రమ కలిగించుకుంటున్నాం.

ధూమంలో కనిపించే రూపం మరుక్షణంలో మాయమవుతుంది. ఛాయా చిత్రం లోని రూపం కొన్ని రోజులకి మాయమవుతుంది. అలాగే మన దేహం కూడా ఎప్పుడో ఒకప్పుడు లయమవుతుంది. కానీ మాయ ప్రభావం ఎంతటిది అంటే సుఖచిదఖండమద్వితీయమయిన ఈ ‘ఆత్మ’ ని, పంచ భూతముల కలయిక అయి ఆశాశ్వతమయిన ఈ దేహము గా భావిస్తున్నాం. 

ఒక మనిషి మరణించినప్పుడు మనం నిజంగా ఆ మనిషిని కోల్పోతున్నామా?

అమ్మ వెళ్లిపోయినది.  ఆలోచించగా పోయినది కేవలం అమ్మ రూపము, దేహము అనే అనిపిస్తుంది. తన చైతన్యం నిత్యచైతన్యమయిన పరమాత్మ యందు కలిసింది, ఘటాకాశం మహాకాశం లో లయమయినట్లు. తన ఆలోచనలు, భావనలు నాలోనే ఉన్నాయి.

నిజంగా తనను కోల్పోతే, తాను ఇంక లేదు అంటే, మరి నేను శ్రాద్ధ కర్మ ఎవరికి చేస్తున్నట్టు? మరణించిన వ్యక్తి ఉండేది పక్షి రూపము లోనో, జంతు స్వరూపము లోనో కాదు. పితృ దేవతారూపములో ఆరాధన చేస్తున్నప్పుడు, నేను ఆ లయమయిన చైతన్యాన్ని ఆరాధిస్తున్నాను. ఆ చైతన్యము నిత్యము, సత్యము. కనుక అమ్మని నేను కోల్పోలేదు. ఆ రూపాన్ని, ఆ రూపము పంచి ఇచ్చే ఆనంతమయిన ప్రేమని కోల్పోయాను.

నేను కోల్పోయినది నిరంతరము మార్పు చెందినదయి, జీర్ణమవుతున్న ఒక అనిత్య శరీరాన్ని. ఈ శరీర పతనం మన చుట్టూ ఉన్న మనుషులకు, మనకు కూడా జరుగుతున్నదే. కాలం క్షణముల రూపములో మన జీవితాన్ని హరిస్తోంది. తీసే ప్రతే ఊపిరి చివరి ఊపిరికి మనల్ని దగ్గరకి చేరుస్తోంది. ఏనాటికైనా ఈ శరీరం పతనం కావాలసినదే. కానీ మనం ఈ రూపం, దేహము నిత్యములు అన్న అసత్య భావన, భ్రమలో  ఉంటాం. ఆ భ్రమ లో బ్రతుకుతున్నప్పుడు, ఈ సత్యం ఎప్పుడో ఒకప్పుడు మనల్ని తట్టిలేపుతుంది. అప్పుడు ఆ సత్యాన్ని భరించడం కష్టం. అందుకే ఈ  భ్రమ దుఃఖ హేతువు.

సరే!  ఈ దేహము స్థిరం అనుకోవడమే భ్రమ. ఈ భ్రమ వలన 'భ్రమయతి  భవసాగరే  నితాంతం'.

స్వతహాగా సుఖ, చిద్ , ఆనంద రూపమైన ఈ ఆత్మని కాదని, మనం ఆ సుఖాన్ని, ఆనందాన్ని బయట ప్రపంచం లో వెతుకుంటాం. ఆ వెతుకులాట లో ఎన్నో సంబంధాలు , రాగ ద్వేషాలు , కామ క్రోధ లోభ మొహాలకు గురి అవుతాం. ఆ భ్రమయే , ఆ తిరగడమే మనం 'బాగోవడం' వెతుక్కుంటూ ఈ సంసారం లో పాడుతాం. ఈ అజ్ఞానం మనల్ని తిప్పుతోంది. భ్రమయతి. ఎక్కడ తిప్పుతోంది? సంసార చక్రం లో. ఈ చక్రం లో ఏముంది. సుఖదుఃఖాల సమాహారం ఈ సంసారం. దేహం నిత్యము అనుకోవడం వలన ఈ తిరుగుడు తప్పదు.

బాహ్య వస్తువును చూడటం ఒక ఎత్తు ఐతే, ఆ వస్తువు తో మమేకం చెందడం, ఆ వస్తువు మీద ఇష్టాఇష్టాలను ఆపాదించుకోవడం వలన భ్రమయతి, తిరుగుడు. ఆ వస్తువును కేవలం ఒక నిమిత్తంగా చూడగలిగితే, ఆ దృష్టి తో  సమస్త లౌకిక ప్రపంచాన్ని చూడగలిగితే  తామరాకు మీద నీటి బొట్టు లా బతకడం సాధ్యమవుతుంది. 

ఈ భావనని ఇంకా కొంచం పైకి తీసుకొని వెళ్దాం. 

‘ఇది నేను. ఇది నేను కాదు’. ‘ఇది నాది. ఇది నాది కాదు.’

ఈ భావనలు మనలోని అహం ని సూచిస్తాయి. అస్సలు నేను అన్న భావనే లేకపోతే? నాదీ అన్న అనుబంధమే లేకపోతే? అంటే పూర్తిగా ఈ ప్రపంచానికి, మనకి ఉన్న సంబంధాలు త్రెంచుకోమని కాదు. మనిషి సంఘ జీవి. సంఘంలో బ్రతుకుతున్న మనిషి కి కొన్ని కట్టుబాట్లు తప్పవు. కొన్ని బాధ్యతలు తప్పవు. అయితే ఆ బంధాలు, బాధ్యతలను కేవలం నిమిత్తంగా చూడలేమా?

కర్మలు చేస్తున్నప్పుడు, వాటి ఫలాపేక్షను వదలలేమా? అలా వదిలి ఉండలేకపోతున్నాము కాబట్టే ఈ భవ సాగరం లో నిరంతరము, జన్మ జన్మలుగా పరిభ్రమిస్తున్నాము. భ్రమయతి భావసాగరే నితాంతం!  

ఎందువలన?

అఘటిత ఘటనా పటీయసి మాయ!

Tuesday, April 25, 2023

మాయా పంచకం - 2: పండితులందు ధనాది విషయ మోహము

పండితులందు ధనాది విషయ మోహము  

ఒక విషయము, వస్తువు యొక్క సత్యాసత్య నిర్ధారణ చేయుటకు పలు విధములయిన ప్రమాణములు గలవు.


ప్రత్యక్షము - ఇంద్రియాలకి కలిగిన అనుభవముల వలన కలిగిన జ్ఞానము ప్రత్యక్ష ప్రమాణము. నేను నా జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకున్నాను కావున దానిని అంగీకరిస్తున్నాను అనడం ప్రత్యక్ష ప్రమాణము.

అనుమానము - అనుభవయిన ఒక వస్తువు బట్టి, వేఱొక వస్తువు యొక్క జ్ఞానం కలగడం అనుమాన ప్రమాణం. యత్ర  యత్ర  ధూమః  తత్రాగ్ని: -  పొగ కనబడిన ప్రతీ చోట నిప్పు ఉండడంతో, పొగ ఎక్కడ ఉన్నా, అక్కడ నిప్పు ఉంది అని అనుకోవడం.

ఉపమానము – ఒక వస్తువు యొక్క పోలిక  గురించిన జ్ఞానం తో, ఆ వస్తువు ని గుర్తించడం లేదా  అనుభవంలోకి తెచ్చు కోవడం.

శబ్దము - ఆప్తులు, మనం నమ్మినవారు, మనం గౌరవించేవారు చెప్పిన మాటను యదార్ధం అని నమ్మడమే శబ్ద ప్రమాణం. వేదాలు శబ్ద ప్రమాణాలు.

అర్థాపత్తి - తెలియని ఒక విషయాన్ని, తెలిసిన మరొక విషయం బట్టి తెలుసుకోవడం. ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం కానీ అనుమాన ప్రమాణం కానీ  ఉండవు. Circumstantial proof.

అనుపలబ్ధి  - ఒక వస్తువు యొక్క అభావం బట్టి తెలుసుకున్న జ్ఞానం. "ఘటము లేదు; కనబడం లేదు కదా " - అంటే ఘటం ఉంటే అది కనబడేది - అనుపలబ్ధి  ప్రమాణం లేక అభావ ప్రమాణం.


వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ ఒక వస్తువు పై వెలుగు పడేసరికి, ఆ వస్తువు యొక్క నీడ కల్పింపబడుతోంది కదా. మరి నీడ అంటే చీకటే కదా. వెలుగు వలన చీకటి ఎలా ఉత్పన్నమవుతున్నదో, మాయా శక్తి మనలో అవిద్య, అజ్ఞానము కల్పించుచున్నది.

అజ్ఞానము అంటే ఏమిటి? లేనిది, ఉన్నట్లు భావించడము లేదా చెప్పడము అజ్ఞానము. ఉన్న దానిని తెలుకోలేకపోవుట అవిద్య.

లౌకిక పరిభాషలో 2 x 2 = 10 అని అనడము అజ్ఞానము. 2 x 2 = 4 అని తెలుసుకోలేకపోవుట అవిద్య.  చంద్రుడు నల్లగా ఉన్నాడు అనడము అజ్ఞానము.

అటులనే అనిత్యమయిన ఈ ప్రపంచము నిత్యమని భావిస్తూ, ఇందు గల విషయములపై భోగాసక్తి పెంచుకొని, వాటి యందు రమించడమును కూడా అజ్ఞానము అని చెప్పవచ్చు కదా? ఇది ఎండమావి యందు గల నీటిని తాగబూనుకోవడం వంటి విషయమే కదా?

ఒక విషయము సంభవించినది, ఒక వస్తువు అక్కడ ఉన్నది. కానీ ప్రత్యక్ష, అనుమాన, శబ్ధ ప్రమాణముల చేత మనము దాని నిర్ధారణ చేయలేకపోవుచున్నాము.

ప్రత్యక్షము గా కానీ, అనుమానము తో కానీ, కనీసం శబ్ధ ప్రమాణము కానీ లేకుండా, ఒక ఘటన ఎలా ఘటిల్లగలదు? అదే అఘటిత ఘటన.

మాయా ప్రభావము!

శృతి శత నిగమాంత శోధకనపి అహహ ధనాదినిదర్శనేన   సద్యః

కలుషయతి  చతుష్పదాద్యభిన్నాన్ అఘటిత ఘటనా పటీయసి  మాయా!

శృతులు, నిగమములు, వేద వేదాంతములను శోధించి, వాటి సారము అంతా గ్రహించిన విజ్ఞానులు కూడా, ధనము, కీర్తి, యశస్సు వంటి వాటిని చూసిన వెంటనే చతుష్పదముల (పశువుల) కన్నా అభిన్నముగా లేకుండా, వాటి వలనే కలుషత్వమును పొంది ప్రవర్తించుచున్నారే!ఆహాహా! ఈ అఘటిత ఘటన మాయ యొక్క ప్రభావము.

ఒక విషయము పై, లేదా వస్తువు పై జ్ఞానము కలిగినది అంటే దాని పై అజ్ఞానము పోయినది అని అర్థము. ఏ విషయము యొక్క పూర్వాపరములు, సత్యాసత్యాములు, సంభవాసంభవాములు, నియములు, దాని పరిమితులు కూలంకుషముగా తెలిసియుండటమే జ్ఞానము.

‘నాకు ఈత కొట్టడము తెలుసు, కానీ ఈదలేను’ అని ఒక గజ ఈతగాడు చెప్పగలడా? అలా చెబితేవాడు ఆ విషయములో అజ్ఞాని అని కదా అర్థము. కానీ వాడి గజ ఈతగాడు అంటున్నారే!

శృతి శత నిగమాంత శోధకాన్

శాస్త్రజ్ఞానము గలవాడు, పండితుడు అయిన వాడు దానిని ఆచరించి చూపవలెను.  అలా కానీ పక్షములో అటు వంటివానికి ఆ శాస్త్ర సారము తెలియలేదు అని అర్థము. లేదు సారము తెలిసినది కానీ దానిని ఆచరించుటలేదు అని అర్థము. అటువంటప్పుడు ఆ పాండిత్యానికి అర్థం ఉంటుందా? దాని కన్నా శాస్త్ర విషయముల సాధన గొప్పది కాదా? ఖచ్చితముగా సాధనే ముఖ్యము. కేవలము శాస్త్ర విషయములు వల్లె వేయడం వలన వనగూరేది ఏమీ లేదు. వాటిని ఆచరించాలి. అదే ‘నహి నహి రక్షతి డుకృణ్ కరణే!

జ్ఞానము గొప్పా?లేదా కర్మ, భక్తి గొప్పవా? ఈ మూడిటి లోనూ ఏది శ్రేష్టము?

నదిని దాటటానికి మూడు పడవలు ఉన్నాయి. ఆవలి ఒడ్డుకు చేరడానికి ఏదో ఒక పడవ ఎక్కితే సరిపోతుంది. మూడు పడవలలో ఏది గొప్పది అన్న ఆలోచనలో కాలయాపన చేస్తే ఈవలి గట్టునే ఉండిపోతాము. మరి ఇది సంసార సాగరము. దీని దాటటానికి  కర్మ, భక్తి, జ్ఞానములనే పడవలలో ఏదో ఒక్క పడవని పట్టుకొని ప్రయాణము చేయాలి. ఆ ప్రయాణములో ఒడిదుడుకుల నుండి నేర్చుకోవాలి. చేసిన తప్పులను నుండి పాఠములు గ్రహించి, వాటిని మరలా చేయకుండా పడవని నడపాలి. అదే సాధన.

కానీ ఈ ప్రపంచములో ఈ  ‘శృతి శత నిగమాంత శోధకాన్’ ఎలా ప్రవర్తించడం చూస్తున్నాము?

ధనాదినిదర్శనేన చతుష్పదాద్యభిన్నాన్ సద్యః కలుషయతి 

వేదాంతము - ‘దేహము నువ్వు కాదు. దేహము వేరు. ‘నేను’ (ఆత్మ) వేరు. దేహము నిత్యము కాదు. దేహము ఉన్న ఈ ప్రపంచము కూడా నిత్యము కాదు. ఈ ప్రపంచములో ఉన్న మిగిలిన దేహాములు కూడా నిత్యములు కాదు. చైతన్యములయిన దేహములే నిత్యములు కానప్పుడు, అచేతనములు అయిన వస్తువులు నిత్యములు కానేరవు. అనిత్యములు సత్యములు కాలేదు.  కాబట్టి అట్టి అనిత్య, అసత్య వస్తువుల పై ఏ విధమయిన ఆపేక్ష అయినా దుఃఖహేతువే. కాబట్టి వాటిని నిమిత్తములుగా మాత్రమే చూసి జీవించు’ ఇత్యాది బోధలు పరిపరి విధములుగా చేస్తుంది. జ్ఞానము గలవారికి అందరికీ ఈ వాక్యములు చిర పరిచతములే. మనము కూడా ఈ విషయములు పలు మార్లు విని ఉంటాము.

ఈ దేహమే ‘నేను’ (ఆత్మ) అనుకోవడమే దేహాధ్యాస. ఈ అధ్యాస అక్కడ ఆగదు. ఈ దేహానికి గుణ ధర్మములు కల్పించి, వాటిని ఈ ‘నేను’ కి ఆపాదిస్తాం. ‘నేను పొట్టివాడిని’,’నేను పొడుగు వాడిని’ ,’నేను వంటవాడిని’,’నేను పురుషుడుని’, ‘నేను స్త్రీ ని’ లాంటివి. ఇది దేహధర్మాధ్యాస.   

ఈ గుణ, రూప విశేణములు ఈ శరీరానికి సంబంధించినవే కానీ, ‘నేను’ కి వీటికీ ఎటువంటి సంబంధము లేదు. ‘ఆ నల్ల రంగులో ఉన్నది నా కలము’ అని అంటున్నప్పుడు మనం ఆ కలము యొక్క రూప విశేషము చెబుతున్నామే  కానీ, మన విశేషణము కాదు కదా!

ఈ దేహాధ్యాస చాలా గడుసయినది. ఈ దేహమే ‘నేను’ అన్న భ్రాంతి నమలో చాలా లోతుకి పాతుకుని ఉంటుంది. ఎందుకంటే పుట్టినప్పటి నుండి, మన చుట్టూ ఉన్నా ప్రపంచము మనతో అలా ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి. అటువంటి అజ్ఞాన స్థితిలో ఎటు వంటి మార్పు లేకుండా  జ్ఞానము కలుగలేదు.

ఒక ఆవుకి ఇంత గడ్డి వేస్తే, ఆ వేసిన వాడిపై దానికి కొంత నమ్మకం, క్రమముగా మమకారం పెంచుకుంటుంది. ఒక శునకాన్ని  చేరదీస్తే, అది ఆ చేరదీసిన వాడిపై విశ్వాసముగా ఉంటుంది. కర్ర తో అదిలిస్తే, కొడితే అదే జంతువు క్రోధముతో తిరగబడుతుంది. ఈ పశువుల రాగద్వేషాలు, ప్రవర్తన అంతా బయట ప్రపంచం వాటి పై చూపించే వస్తువులపై ఆధారపడి ఉంటుంది. శాస్త్ర విజ్ఞానులు కూడా ధనాది భోగ విషయముల పై, వాటిని కల్పించే వారిపై,  ఈ పశువుల వలనే రాగద్వేషముల చూపించుచున్నారు. ఈ జ్ఞానుల ప్రవర్తన అజ్ఞానమయముగా ఉండటం అఘటిత ఘటనే కదా! ఈ ఘటన మాయ యొక్క బలీయమయిన శక్తి వల్లనే కదా!

వేదవిహితములయిన కర్మాచారణము భగవంతుని పై నిరంతర ధ్యాస కలుగుతుంది. అదియే  భక్తి. ఆ భక్తి ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ పై సర్వస్వ శరణాగతిగా మారుతుందో అదే జ్ఞానము.


ఒక వ్యక్తి యందు సాధన లేని జ్ఞానము ఒక గోడ లా నిలబడి, సత్యము తెలియలేకుండా చేస్తుంది. జ్ఞానము గలవారు మౌనముగా ఉండటం అరుదుగా చూస్తాము. ఆ జ్ఞాన్ని బహిర్గతము చేయాలనే అభిలాష ఉంటుంది. ఆ ప్రవర్తన వారిని ఆత్మావలోకనము నుండి, లోపలి శాంతి భావన నుండి దూరము చేస్తుంది. ఎప్పుడైతే ఆ శాంతి  స్థితి ఉండదో, వారిలో జ్ఞాన సారము క్షయమవుతుంది. వారి జ్ఞానమే వారికి అవరోధముగా నిలుస్తుంది. అందుకే మౌనము, ధ్యానము అలవాటు చేసుకోవాలి.  సర్వ విద్యలకు నిధి అయిన ఆ దక్షిణామూర్తి కూడా చేసేది మౌన వ్యాఖ్యే కదా. 

మాయా పంచకం - 1: చిద్రూపము నందు జగదీశ జీవ భేదం

చిద్రూపము నందు జగదీశ జీవ భేదం

నిరుపమ నిత్య  నిరంశకప్య ఖండే మయి  చితి  సర్వ వికల్పనాది  శూన్యే |

ఘటయతి   జగదీశ  జీవభేదం త్వఘటిత  ఘటనాపటీయసీ మాయా ||

వేఱొక దానితో పోలిక లేనిదై, నిత్యమై, అఖండమై,  ఎటు వంటి వికల్పములు లేనిది అయినట్టి నా చిద్రూపము నందు, జీవ, జగదీశ భేదము కలుగుతున్నది. ఇది  త్వఘటిత  ఘటనాపటీయసీ మాయా!

మయి చితి

నా (ఈ ఆత్మ) యొక్క స్వరూపము చిద్. నేను చిద్రూపుడను. నీవెవరు అనే ప్రశ్నకి ఇదే సరైన సమాధానము. ఇది కాకుండా ఇంక ఏదీ కూడా సమాధానము కాదు. సత్యము కాలేదు. ‘నేను ఒకరి తండ్రిని, పుత్రుడుని, భర్తని ..’ – ఇవి ఏవీ కూడా నిజాలు కాదు. అహం అస్మి – అనునది ఒక్కటే సత్యము.

కానీ మన యొక్క ఈ చిన్మయ స్వరూపాన్ని అంత సులువు గా అంగీకరించలేము. మన యొక్క అస్తిత్వం, ఆనందం వేఱొకరిపై, లేదా వేఱు వస్తువు పై ఆధారభూతమయి ఉన్నాయి అని జీవిస్తూ ఉంటాము. నామ, రూపములకు అతీతముగా మనల్ని మనం ఆలోచించలేము. అంతెందుకు! భగవంతుని పూజిస్తున్నప్పుడు కూడా, ఏదో ఒక నామ, రూపములపై ధ్యాస ఉంచుతున్నాము తప్పా , వాటిని దాటుకొని, నికారామయిన పరబ్రహ్మ తత్వాన్ని గూర్చి ధ్యానించలేకపోతున్నాము.

నిరుపమ నిత్య  నిరంశకప్యఖండే.

సరే, మయి చితి! ఈ చిన్మయ స్వరూపం ఎటువంటిది?

‘నేను’ అనేది ఈ జీవి యొక్క అనుభవము. ఈ ‘నేను’ అనే అనుభవమును ఒక్కటిగానే మనకి స్ఫురిస్తుంది.దానిని ఒక్కటి గానే మనము చెప్పగలము.

ఈ దేహము లో వివిధ అంగాలు ఉన్నాయి. అవి చేసే క్రియాల బట్టి వాటికి పేర్లు, అవి ఉన్న  స్థలాల బట్టి వాటి లో ఇంకొన్ని అంతరాలు ఉన్నాయి. కొన్నింటికి మనం ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాం. మఱి కొన్నింటికి కొంచం తక్కువ ప్రాధాన్యత. కానీ ఈ దేహానుభవము మాత్రము ‘నేను’ అని ఒక్కటి గానే చెబుతాం. దేహము లో భాగాలు, విభాగాలు ఉండవచ్చు. ‘నేను’ లో అటువంటి భాగాలు ఉండవు.

ఈ దేహము ‘నేను’ కాదు కనుక, ‘నేను’ అను దానిని అలా విభాగించి చెప్పలేము. ఎటు వంటి అంశములు కల్పింప చేయలేము, కాబట్టి ఇది ‘నిరంశకము’.

ఈ ‘నేను’ ని ఖండించలేము. ఇది ఎటువంటి భాగములు లేనిది. కాబట్టి ఈ ‘నేను’ అఖండము.  ఈ ‘నేను’ ఎల్లప్పుడూ ఏకము మాత్రమే. ఇందులో వేఱొక భాగము లేదు. ఉన్నది అది ఒక్కటే. భగవంతుడు ఉన్నాడు, ఈ ‘నేను’ ఉన్నది. కావున ఈ ‘నేను’, ఆ భగవంతుని కన్నా అభేదము కాదు. ‘అహం బ్రహ్మస్మి’!   

ఈ ‘నేను’ ‘నిరుపమము’. ఒక దానిని ఇంకొక దానితో పోల్చి చెప్పడమే ఉపమానము. ఇక్కడ ఉన్నది ఒక్కటి మాత్రమే. రెండవ వస్తువు ఇంకేమీ లేదు. రెండవది లేనప్పుడు, ఇంక పోల్చి చూడడం జరగని పని. కాబట్టి ఇది నిరుపమము.

ఈ ‘నేను’ నిత్యము. ఏంటి? ఎలా? ఈ జన్మించి, పెరిగి, తిరుగాడి, మరణించే ఈ దేహము ‘నేను’ కాదు. ఈ దేహము  ఒక ప్రక్రియ. అది క్షణక్షణానికి  మార్పు చెందుతూ ఉంటుంది. కానీ మనం ఈ దేహమే నేను అనే అధ్యాస లో ఉంటాం. అందుకే ‘నేను <> సంవత్సరము లో పుట్టాను. నేను ఫలానా వారి బిడ్డని. నేను ఫలానా వారి దగ్గర పని చేస్తూ ఉంటాను. ..’ అని అంటూ ఉంటాము. ఇది నిజానికి వివిధ దేశ కాలాదుల పరిస్థితులలో ఈ దేహము యొక్క స్థితి మాత్రమే. పది సంవత్సరముల వయస్సులో ఉన్న ‘నేను’, ఇప్పుడు ఉన్న ‘నేను’ ఒక్కటే కదా? మార్పు చెందినది దేహమే కానీ ఈ  ‘నేను’ కాదు. సత్యమయిన ‘నేను’ శాశ్వతము. నిత్యము. కాలాతీతము.

సర్వ వికల్పనాది  శూన్యే

కల్పన అంటే భ్రాంతి. ఒక చలన చిత్రములో జరిగే సంఘటనలు కల్పనలు. అవి ఏవీ కూడా నిజం గా జరిగినవి కాదు.

మనిషి యొక్క జీవితాన్ని మనం కొన్ని చిత్రపటాల సమాహారం గా చూస్తూ ఉంటాము. ‘ఇది నేను పుట్టినప్పటిది అండి. ఇది నా చిన్నతనం లో తిరుపతి వెళ్ళినప్పటిది. ఇది నా స్నేహితులతో పాటు విహార యాత్ర కి వెళ్ళినది. ఇది నా వివాహము లో కాశీ యాత్ర. వీరు నా తల్లి తండ్రులు. వీరు నా భార్యా పిల్లలు. అప్పుడు నేను చాలా ఆనందము గా ఉన్నాను. ఇది నాకు ఒక ప్రమాదం జరిగినప్పటిది. అప్పుడు నేను విచారము లో ఉన్నాను.’  ఇటువంటి వాక్యాలతో మనం ఆ చిత్ర పటాలని తిరగవేస్తూ ఉంటాము.

ఈ ఘటనలు, బంధములు కేవలము మన మనస్సు, బుద్ధి కల్పించినవి. ఇవి కల్పనలు. మన మనస్సు చాలా అందమైన కల్పనలూ చేస్తుంది. భయానకమయిన ఆలోచనలూ కల్పిస్తుంది. ఆనందం కలిగించేది మనలోని మనస్సే. దుఃఖము కలిగించేది కూడా ఆ మనస్సే. ఈ ఘటనలు  అన్నింటిలో మారని ఏదైనా ఉన్నదా? ఉన్నది. అదే ‘నేను’. వీటి లో ‘నేను’ ఉన్నాను. కానీ ఘటనలు కాలానికి బందీ అయిఉన్నాయి. కాలాతీతమయిన ఈ ‘నేను’ లో లేవు. ఈ వికల్పన శూన్యమయినది ‘నేను’.

అందుకే ఈ ‘నేను’ ఏమిటో తెలుసుకోవడానికి నిరంతర సాధన, అన్వేషణ అవసరం. కా తే కాంతా కస్తే పుత్రః! మనం ఈ జగత్తు లో దేనినీ సృష్టించడం లేదు. కేవలం ఒక సాధనముగా ఉంది, ఏవో కొన్ని కార్యాలు చేస్తున్నాము.

ఘటయతి జగదీశ  జీవభేదం 

‘నేను’ అహంకార భావన కాదు. ‘అహం అస్మి!’ , ‘నేను ఉన్నాను’ అన్నది ఒక్కటే. దానికి ముందు, వెనుక పదాలు ఇంకేమీ లేవు. ఈ ‘నేను’, ‘పరమాత్మ’ వేరు కాదు. రెండూ ఒక్కటే.

ఘటః అస్తి – కుండ ఉంది. ఆకాశః అస్తి - ఆకాశం ఉంది. ఘటము వేఱు, ఘటాకాశం వేఱు , మహాకాశం వేఱు గాను చూస్తున్నారు. ఆ ఘటము, ఘటాకాశము యొక్క ఆస్తిత్వము మనలో నుండి వచ్చినవి. చూసే మనము, ఈ ఘటము, ఆకాశము ఒక సృష్టికర్త వలన జనించినవి. ఎవరు ఆ సృష్టికర్త? అదే ‘నేను’ (ఆత్మ).

పరబ్రహ్మ నిత్య శాశ్వతుడు – సత్, చిత్, ఆనంద స్వరూపుడు. ‘నేను’ (ఆత్మ / జీవాత్మ) పరబ్రహ్మ కన్నా భిన్నము కాదు కాబట్టి ఈ ‘నేను’ కూడా ఆ సచ్చిదానంద రూపమే. దేనితో గూడి పరబ్రహ్మ ఈ ప్రపంచమును సృష్టిస్తున్నాడో, ఆ మాయ కూడా నిత్యమే. ‘జాయతే, గచ్ఛతే, ఇతి జగత్’ – పుట్టేది (సృజించబడినది), వెళ్లిపోయేది ఈ జగత్తు. అది ఆశాశ్వతము.   

ఈ నేను (ఆత్మ) నిరుపమానము, నిత్యము, నిరంశకము, అఖండము, సర్వ వికల్పనాది శూన్యము అయిన చిత్ స్వరూపము. అయినప్పటికీ, దీని యందు జీవుడు వేరు, జగదీశుడు వేరు అను భావన పుడుతున్నది (ఘటయతి జగదీశ  జీవభేదం). ఈ అఘటిత ఘటన మాయ యొక్క శక్తి కాక మరి ఇంకేమిటి!

Monday, April 24, 2023

మాయా పంచకము - పరిచయము

మాయా పంచకము

హరిః ఓం!

మాయ అనునది త్రిగుణాత్మకమై (సత్వ, రజస్, తమో గుణాలతో కూడినది అయి) ఉంటుంది. భగవదస్వరూపము, ఆత్మ స్వరూపము అనునవి వేరు అని, మనము అనుభవించుచున్న ప్రపంచము నిత్యము, సత్యము, భగవంతుని కన్నా అభేదము అన్న అజ్ఞానమును కలిగించినదే మాయ.

ఈ మాయ అతి బలమయినది. దీనిని తెలుకోవడం అంతా సులువయిన పని కాదు. ఒక వస్తువును తెలుసుకోవాలి అంటే, అది ప్రత్యక్షముగా ఉండాలి. ‘న విద్యతే యా సా మాయా విద్యావిద్యా ...’ (మాయా దర్శనము) మరియు ‘యా మా సా మాయా’ వాక్యాల ద్వారా  – ఏది లేనిదో అది మాయ, ఏది తెలియబడదో అది ఆవిద్య అన్న అర్థం దొరుకుతోంది. అంటే మాయ, అవిద్య అనే రెండూ కూడా లేని వస్తువులను సూచిస్తున్నాయి. లేని వస్తువునకు నిర్వచనము చెప్పలేము. అందుకే అవి అనిర్వచనీయాలు.

ఆకాశం లో అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి, దాని పక్కన ఉన్న పెద్ద నక్షత్రాన్ని చూపిస్తాము. ఆ చూసే వారు, ముందు ఆ పెద్ద నక్షత్రాన్ని చూసి, దాని బట్టి ఆ పక్కన ఉన్నది అరుంధతి నక్షత్రం అని గ్రహిస్తారు. ఆకాశము లో ఉన్న చంద్రుణ్ణి పిల్లవానికి చూపడం కోసం, చెట్టు కొమ్మ వెనక ఉన్నాడు అని మన చేతి వేళ్ళతో చూపిస్తాము. అప్పుడు ఆ పిల్లవాడు, ముందు మన చేతి వేళ్ళని, వాటి నుండి చెట్టు కొమ్మని, దాని నుండి చంద్రుని చూసి తెలుసుకుంటాడు.

అలాగే  ఈ మాయ యొక్క స్వరూప, గుణాలను అధ్యారోప, అపవాదముల యొక్క సహాయము తో తెలుసుకోవచ్చు. రజ్జువు నందు సర్పారోపము కలిగించి, రజ్జువును సర్పముగా మనకు అజ్ఞానము కలిగించినదే మాయ. పరమాత్మ స్వరూపమయిన ఈ జగత్తు నందు  సంసారమును చూపించునదే మాయ. దీపము యొక్క వెలుతురుచే, చీకటిలో సర్పము అని భావించిన రజ్జువు యొక్క నిజ స్వరూపము తెలియునట్లు, జ్ఞానముచే ఈ మాయ తొలగిపోవుచున్నది.

ఘటాకాశము, మహాకాశములని రెండు ఆకాశములు ఉన్నాయి అన్న భావన మనకు కలిగించినదే మాయ. ఘటః అస్తి - ఘటము అని ఒకటి ఉన్నది అన్న భావన వలన ఇవి రెండు అని అనుకుంటున్నాము. ఆ ఘటమే లేకపోతే, ‘ఆకాశములు రెండు’ అన్న సూచనయే  ఉండదు.

అలాగే ‘నేను’ అనేది ఈ శరీరము. ఈ శరీరము లో  ఆవరించిన ఆత్మ వేరు, పరమాత్మ వేరు అన్న భావన కలిగించినది మాయ. ఈ జగత్తు అంతా భగవద్ సృష్టి. ఆ పరమాత్మ నుండి పుట్టి, అందులోనే లయిస్తుంది. అందులో నుండి పుట్టినది కాబట్టి, ఈ జగత్తు, పరమాత్మ వేరు కాదు అన్న జ్ఞానమును మనలో కలగకుండా, కలిగినా స్థిరపడకుండా ఉండనీయనిదే మాయ.    

మాయ మన జీవితం లో ఒక భాగం. ఇది మన అస్తిత్వం, అనుభావాల యొక్క సారం. ప్రతీ అనుభవాన్ని, బంధాన్ని, భావనని తరచి తరచి ప్రశ్నిస్తూ పోతే దొరికే సమాధానం ఈ మాయ. ఏది నిజము, ఏది నిత్యము అన్న వైపు ఆ విచ్ఛేదనం సాగితే దొరికే సమాధానం ‘న ఇతి న ఇతి’ – ఇది కాదు , ఇది కాదు, ఇది నిజం కాదు, ఇది నిత్యం కాదు. ఇది మానవ జీవన సత్యం.

ఈ సంసారం లో ఏదీ నిత్యం కాదు అని ఎలా అంటాము? నిత్యమయినవి ఏమీ లేవా?  ప్రతి దినము చూసే జనన మరణాలు నిత్యములు  కావా?

ప్రతీ రోజు ఏక కణ జీవుల నుండి తిమింగాల వరకు ఎన్నో వేల జీవాలు పుడుతున్నాయి. అలాగే వీటి జీవనానికి ఆవలంబముగా ఈ ప్రపంచములో ఎన్నో వస్తువులు ఉన్నాయి కదా. పుచ్చిన కట్టె నుండి కూడా పుట్ట గొడుగులు పుట్టడం లేదా? సాగర గర్భములో ఉన్న అగ్ని పర్వత బిలాలలో వద్ద కూడా శాస్త్రజ్ఞులు జీవులను కనుగున్నారు కదా!  అవి నిజం కాదా?  పసివారి దగ్గరనుండి పండు ముసలివారు వరకు ఎందరో రోజూ మరణించడం చూస్తున్నాము. ఆ మరణాలు నిజం కాదా?

ఈ జనన మరణాలు నిజం అనుకుంటే, జనన మరణాలు రెండూ ఏక కాలం లో ఒకే వస్తువు నందు ఉండవు. జీవం ఉన్నది – మరణం లేదు. మరణం కలిగినది – జీవం లేదు. సత్యమయిన వస్తువు లేదా విషయము దేశ కాలాలకు అతీతముగా, ఎల్లప్పుడూ ఉండాలి. అంటే జన్మించిన వస్తువు ఎల్లప్పుడూ ఉండాలి.  మరి ఇక్కడ అలా లేదు కదా. అంటే, జనన మరణాలు సత్యం కాదు. అవి మాయ.

పోనీ ఈ జగత్తు నందు సుఖము నిత్యమా? దుఃఖము నిత్యమా?

ఆనందావస్తా లో ఉన్న వ్యక్తి కి ఈ జగత్తు నందు అంతటా సుఖమే కనుపడుతున్నది. అదే సమయము లో, అదే జగత్తు నందు దుఃఖము నందు ఉన్న వ్యక్తి కి బాధామయముగా అనిపిస్తున్నది. అంటే ఒకే సమయం లో, ఒకే వస్తువు (జగత్తు), వేరు వేరు మనుష్యులకి, వారి వారి మానసిక స్థితి బట్టి సుఖభరితము గాను, దుఃఖపూరితము గాను అనుభవమవుతున్నది. సుఖ, దుఃఖాలు రెండూ పరస్పర విరుద్ధ భావాములు కదా!

సుఖము ఉన్నది – దుఃఖము లేదు. దుఃఖము ఉన్నది – సుఖము లేదు. మరి ఈ రెండూ ఏక సమయము లో, ఒకే జగత్తు నందు ఎలా ఉన్నవి? ఎండమావి లో నీరు ఉన్నదా? లేదు, ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవి కూడా అలానే. కానీ వాటి యొక్క నిత్యానుభవము, సత్యారోపము – మిథ్య, మాయ!

రజ్జువు నందు సర్పము ను చూసినప్పుడు, ఆ సర్పము ఎక్కడ ఉన్నది?

ఆ చూసిన వ్యక్తి యొక్క మనస్సు లో మాత్రమే ఉన్నది. మనస్సు లో ఉన్న సర్పాన్ని, ఆ మనిషి ఆ రజ్జువు నందు చూశాడు. ఆ సర్పము నిజము కాదు, కేవలము మాయ.

అలాగే ఈ జగత్తు, మనిషి మనస్సు లోనుండి పుట్టినది. మనిషి లయించిన తరవాత ఆతని జగత్తు కూడా లయమవుతుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనపై చేసే యుక్తి మనం నిత్యమని చూసే ఈ జగత్తు.  అందుకే జగత్తు అనిత్యము.

మకుటము

ఈ పంచకము లో మకుటము – ‘అఘటిత ఘటనా పటీయసి మాయ!

ఏ సంఘటన అయితే జరుగలేదో, ఏదైతే సంభవము కాదో, ఏది ఘటిల్లలేదో అది అఘటితము. అఘటితము సంభవించే దేశ, కాల, స్థల పరిస్థితులు ఉండవు.  అటువంటి అఘటితాన్ని, ఘటించినట్లు, జరిగినట్లు, ఉన్నట్టు చూపగల శక్తి కలది మాయ.

తెర మీద చలన చిత్రము కనిపించుచున్నది. యందు ఒక మనిషి ఆకాశమంత ఎత్తు పెరిగాడు లేదా చీమ అంతా చిన్న వాడు అయ్యాడు. అందులో కనిపించే విషయాములు ఏవీ కూడా సత్యములు కాదు. కానీ దానిని చూస్తున్నంతసేపూ దాని యందు మనం మమేకమయి, ఆ తెర పై కనిపిస్తున్న జగత్తుపై మామతానురాగములు, సుఖ దుఃఖములు కలిగించుకుంటున్నాము. ఆ తెర, చలన చిత్ర యంత్రము రెండూ కూడా జడములు, ప్రాణములు లేనివి. జడము నుండి చైతన్యాయాత్మకమయిన జగత్తు పుట్టడం సాధ్యము కాదు.  మన మనస్సు, చెవులు, కళ్ళు కల్పించిన మాయ ఈ తెర మీద ఉన్న జగత్తు.  ఈ మూడిటిలో ఏ ఒక్క దానిని మనం మూసేసినా ఆ మాయా  జగత్తు లో ఆ లక్షణము మరుగవుతుంది.

సర్పము అక్కడ ఉండే అవకాశం లేదు. అక్కడ ఉన్నది రజ్జువు ఒక్కటే కాబట్టి.  కానీ సర్పం అక్కడ ఉన్నట్టు ఆ మనిషికి కనిపించింది. అది ఎలా సాధ్యము? అదే మాయ.

ఎండమావి అని తెలిసిన తరవాత, దాని లో నీటిని మనం తాగాలని అనుకుంటామా? ‘ఆహా! ఇది మాయ రా! ఇది కాదు మనకి కావలసినది’ అనుకుంటాం. అందుకే మనము మాయను తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అన్న నిరంతర తపన ఉన్నవాడే సాధకుడు. సాధకుడు ఈ మాయ యొక్క ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపడతాడు. ఆ ఆశ్చర్యము, ఆ సాధన అతనిని మిథ్యా స్వరూపమయిన ఈ జగత్తు నుండి దూరముగాను, నిత్యమయిన పరమాత్మ కి దగ్గరగాను తీసుకొని వెళ్తుంది. ఆ మాయాతీత స్థితి, మాయను తెలుసుకోవడము వల్లనే సాధ్యము. ఒక్కసారి మాయని తెలుసుకున్న తరవాత, ఇంక అక్కడ మాయ ఉండదు. అఘటిత ఘటనలు జరుగవు.

ఏమిటా అఘటిత ఘటనలు? అవే ఈ పంచకము లోని శ్లోకాలు సూచించే ఘటనలు.

Sunday, April 23, 2023

మాయా పంచకం - ఉపోద్ఘాతము

 హరిః ఓం

మాతృ దేవో భవ! పితృ దేవో భవ! ఆచార్య దేవో భవ!


జ్ఞానానంద మాయం దేవం నిర్మల స్ఫటికాకృతిం

ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ||


సదాశివ సమారమ్భామ్ శంకరాచార్య మధ్యమాం

అస్మదాచార్య పర్యంతాం వందే  గురు పరంపరామ్ ||


గురవే సర్వ లోకానాం భిషజే భవరోగినాం

నిధయే సర్వ విద్యానాం దక్షిణా మూర్తయే నమః ||

2021 సంవత్సరారంభంలో జగద్గురు శ్రీ ఆదిశంకరుల విరచితములు ఒకటి రెండయినా చదివి అర్థం చేసుకోవాలి అని అనుకున్నాను. శ్రీ శంకరుల భగవద్గీతా భాష్యం, బ్రహ్మ సూత్ర భాష్యం, వివేకా చూడామణి వంటి గ్రంధాలు కానీ, లేదా  సౌందర్యలహరి, శివానందలహరి, దక్షిణామూర్తి స్తోత్రం వంటి స్తోత్రాలు కానీ ఆద్యంతము చదివి, ప్రతిపదార్థం తెలుసుకోవాలి అన్నది నా ఆలోచన.

వేదాంత సంబంధ పదాల అర్థం కానీ, వాటి అన్వయం కానీ, సంస్కృత భాష పై పట్టు కానీ లేకుండా ఈ అధ్యయనం ఎంత దుష్కరమో, శ్రీ ఆచార్య శ్రీ పుల్లెల రామచంద్రుడు గారి వివేక చూడామణి పరిచయం పుటలు చదివిన తరవాత కానీ నాకు అర్థం కాలేదు. అక్షరాలు రాని వాడు మహద్ గ్రంధాలు ఎలా చదవగలడు? అవి చదవే లేనప్పుడు, ఇంక వాటి భావార్థలు తెలుసుకోవడం ఎలా?

పోనీ వేద వాఙ్మయం ఏమైనా చిన్నదా?

    నాలుగు వేదాలు. వాటి వాటి సంహిత, బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తులు.  

    శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యములు అనే వేదాంగములు.

    న్యాయ, మీమాంస, తర్క, ధర్మ శాస్త్రాలు, బహు పురాణాలు.

వాస్తు, నాట్యము, ధర్మము, శిల్పము, సంగీతము, న్యాయము వంటి విషయాలను అత్యంత లోతుగా అధ్యయనము చేయుటకు వాటి వాటి ప్రత్యేక శాస్త్రాలు.


సూత్ర, ప్రకరణములు

ఏదైనా ఒక విషయము, తత్త్వము, లేదా శాస్త్ర విధిని సూచించేవి సూత్రాలు. ఈ సూత్రాలు ఒకటి రెండు శ్లోకాలు కలిగినవి అయినా కావొచ్చు, లేదా అతి విస్తృతమైన గ్రంధాలు కూడా కావొచ్చు. ఉదాహరణకి బ్రహ్మ సూత్రాలు, సాంఖ్య సూత్రాలు, యోగ సూత్రాలు, నారద భక్తి సూత్రాలు, గృహ్య సూత్రాలు, సుల్బ  సూత్రాలు వంటివి కొన్ని.

ఈ సూత్రాలలో కొన్ని వేదాలకి అనుసంధానం గా ఉంటాయి. ఋగ్వేదానికి ఆశ్వాలాయన, సాంఖ్య, శౌనక సూత్రాలు. సామ వేదానికి పుష్ప, నిధన, అనుస్తోత్ర సూత్రాలు. యజుర్వేదానికి వైఖానస, వరాహమైత్ర సూత్రాలు. అధర్వణ వేదానికి కుశిక సూత్రము వంటివి. ‘ఆశ్వాలాయన సూత్రః  ఋగ్ శాఖాధ్యాయీ వంశీ కృష్ణ శర్మాణాం అహం భో అభివాదయే!’ లోని సూత్ర సూచన ఇవే.  

ఒక శాస్త్రము లోని ప్రత్యేక విషయము చర్చించేవి ప్రకరణ గ్రంధాలు

ఈ ప్రకరణలు ఏదైనా ఒక ప్రత్యేక పదము పై కానీ, లేదా ఒక విషయము పై కానీ చేసే విచారణ. ఇవి ఏక, పంచ, దశ, శత శ్లోక నిర్మితములై కానీ లేదా ఇంకా విస్తృతమయిన వివేకా చూడామణి, ఉపదేశ సహస్రి, ఆత్మ బోధ, తత్త్వ బోధ వంటి గ్రంధాలు అయి ఉంటాయి.

ఏదైనా ఒక విషయాన్ని ఐదు శ్లోకాలలో వివరించడం పంచ శ్లోకీ ప్రయోగం. కేవలం పంచ శ్లోకాలలో వివరించాలి కాబట్టి, ఎంచుకున్న విషయ సారాన్ని సూటిగా, టూకీగా చెప్పేవి ఇవి. సాధన పంచకం, కాశీ పంచకం, కౌపీన పంచకం, మనీషా పంచకం, మాయ పంచకం వంటివి పంచ శ్లోక ప్రకరణ  ఉదాహరణలు.

ఈ విస్తృత వేద వాఙ్మయ అధ్యయనం ఎక్కడ మొదలు పెట్టాలి?

అధ్యయనం పద్దతిగా ఎలా చేయాలి?

అధ్యయనం  చేసేటప్పుడు కలిగే అనుమానాల నివృత్తి ఎలా?

నేర్చుకున్నవి పాటించడం ఎలా?

అందుకే గురు ముఖతః నేర్చుకోవాలి. గురు పాదాల వద్ద నేర్చుకోవాలి. గురువు యొక్క దిశానిర్దేశం పాటించాలి. గురు శుశ్రూష లేకుండా వేదాధ్యయనం సాధ్యము కాదు. ఆధ్యాత్మిక యాత్రలో మార్గదర్శిగా ఒక గురువు ఉండాలి. ఆ గురువు సద్గురువు అయి ఉండాలి. అటు వంటి గురువు దొరకడం చాలా దుష్కరం. ఒక్కసారి దొరికారా, ఇంకా వారి పాదములు వదలకూడదు.  గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ !

మరి ఏ ఇతర మాధ్యమాలు కూడా, గురువు లేని లోటును తీర్చలేవు.

దేశాకాల పరిస్థితుల ప్రభావం చేత ప్రత్యక్ష గురువు లేని నాకు, వివిధ ప్రవచనాలు, పుస్తకాలే గురువులు. వాటిని అందించిన మహాపురుషులకి నా పాదాభివందనములు. 

ఇవి కేవలం నా యొక్క జ్ఞాన సంచయానికి, విచారం జరపడానికి ఉపకరించే పుటలు. ఇందులో శాస్త్ర విహితమయినవి గురు ప్రసాదములు. అలా కానివి నా స్వకపోల కల్పితములు.

విజ్ఞులు విశాల హృదయముతో మన్నించి, సూచనలు చేయుదురు గాక.

ఇందులో ‘నేను’ అని ప్రస్తావించిన చోట ‘ఆత్మ’ గురించిన విచారముగా భావించండి. అలా కాకుండా కేవలము నేను అని ఉన్న చోట, అది దేహ సూచన గా భావించండి.

***

వాక్య వివరణలు

అధ్యారోపము

ఒక వస్తువును మఱియొక వస్తువుగా భ్రమించడం. ఒక వస్తువు యొక్క గుణములను వేరొక వస్తువునందు చూసి, ఆ రెండవ వస్తువును మొదటి వస్తువు గా భ్రమించుట అధ్యారోపము.

  • చీకటి లో తాడుని పాముగా భావించడం – రజ్జువు నందు సర్పత్వాధ్యారోపము.
  • దూరముగా మెరుస్తున్న ముత్యపు చిప్పను వెండి ముద్దగా  అనుకోవడం – శుక్తి యందు రజతత్వాధ్యారోపము. 
  • ఎండమావులందు నీటిని చూడటం – మరుమరీచికల యందు జలత్వాధ్యారోపము.

ఉపాదాన, నిమిత్తములు

అనేక దారముల యొక్క నిర్మాణము ఒక వస్త్రము. మట్టి యొక్క రూపము ఒక కుండ. ఇక్కడ దారములు, మట్టి ఉపాదాన కారణములు. వస్త్రమును నేయు వాడు, కుండను చేయువాడు నిమిత్త కారణములు.

కానీ ఈ సృష్టి యొక్క ఉపాదాన, నిమిత్త కారణములు రెండూ కూడా ఆ పర బ్రహ్మ మాత్రమే.  అది ఎలా సాధ్యము? ఒక దారము, దాని అంతట అది ఒక వస్త్రమును నేయలేదు. మట్టి ముద్ద తనంతట తానుగా ఒక కుండగా మారలేదు. మరి అటువంటప్పుడు ఒకే పరబ్రహ్మము ఉపాదాన, నిమిత్తకారణములుగా ఈ ప్రపంచాన్ని ఎలా సృజిస్తున్నాడు? ఈ రెండు కారణములు ఒకనికే ఎలా చెందుతాయి?

సాలె పురుగు తనలో నుండి పుట్టిన దారముతో తన గూడు కట్టుకొని, ఆ దారమును మరలా తనలోకి ఎలా తీసుకుంటుందో, అలా పరబ్రహ్మ, తన యందు పుట్టిన త్రిగుణాత్మికమయిన మాయతో కూడి ఈ ప్రపంచాన్ని కల్పిస్తున్నాడు.

 

సాలె పురుగు యొక్క గూడు మిథ్య కాదు, అది కేవలము తాత్కాలికము ( అసతః/అసత్తు). అలాగే ఈ ప్రపంచము మిథ్య కాదు. ఇది కేవలము అసత్తు - తాత్కాలికము, ఆశాశ్వతము, అనిత్యము.

 అపవాదము

ఒక కార్యము తెలుస్తున్నది. దేనివలన ఆ కార్యము తెలుస్తున్నది? ఒక కారణము యొక్క ఘటనము వలన. కార్యము కేవలము కారణము వలనే సాధ్యము. కారణము యొక్క రూపము కార్యము లో ప్రస్ఫుటమవుతున్నది.  కారణ వ్యతిరిక్తముగా కార్యము లేదు అనడం అపవాదము.

        బంగారము తో చేయబడిన ఆభరణాలు, బంగారము లేకపోతే ఆ ఆభరణాలు లేవు. అవి బంగారము            కన్నా భిన్నములు కావు.

        మట్టి తో చేయబడిన కుండలు, మట్టి లేకపోతే వాటి అస్తిత్వం కోల్పోతాయి. అవి మట్టి తో కూడి                ఉంటాయి.

        అలాగే పరబ్రహ్మ లేదా పరమాత్మ నందు పుట్టిన ఈ ప్రపంచము, ఆ పరబ్రహ్మము కన్నా వేరు కాదు.

ఒక కుండ లో ఉన్న ఆకాశము (శూన్యము), బయట ఉన్న శూన్యము కన్నా వేరు కాదు. ఆ కుండ యొక్క రూపము మనము చూడటం వలన, ఘటాకాశము వేరుగాను, మహాకాశము వేరుగాను అనిపించుచున్నది.    

ఘటాకాశము, మహాకాశము అని రెండు లేవు. ఉన్నది ఒక్కటే ఆకాశము. ఈ ప్రపంచము (దాని లో కూడిన నువ్వు) కూడా ఆ పరమాత్మ కన్నా వేరు కాదు.


****

కో హం

ఈ ప్రపంచము, దానితో కూడిన ‘నేను’, పరమాత్మ కన్నా అభిన్నములైతే, మరి ఆ సంగతి నాకు ఎందుకు తెలియడం లేదు?

ఈ ‘నేను’ కూడా ఈ ప్రపంచము లో ఒక భాగమే కదా. అయితే ఈ ‘నేను’ కూడా పరబ్రహ్మమేనా?

ఈ మానవ శరీరమే నేనుగా ఈ లోకములో తిరుగుతోంది కదా. ఈ శరీరమే లేకపోతే, నాకు ఆస్తిత్వమే లేదు. ఈ శరీరమే ‘నేనా’?

బంగారముతో చేసిన ఆభరణములలో మట్టి ఉండదు. మరి నిత్యమయిన పరమాత్మ నుండి, అనిత్యము అయిన ఈ శరీరము (మరియు ప్రపంచము) ఎలా పుడుతోంది? కాబట్టి ఈ శరీరము, ‘నేను’ వేరు అవ్వాలి.

అయితే  ‘నేను’ (ఆత్మ) ఎవరు? ‘నా’ యొక్క నిజ స్వరూపము ఏమిటో నాకు తెలియనివ్వకుండా ఎందుకు ఉంటోంది?

ఎంతటి లోతయిన, గంభీరమయిన విచారణ ఇది!   

ఈ ప్రశ్నల పరంపర కొనసాగిస్తే –

కా తే కాంతా కస్తే పుత్రః సంసారోఽయమతీవ విచిత్రః ।
కస్య త్వం వా కుత ఆయాతః తత్త్వం చింతయ తదిహ భ్రాతః ।।

‘సోదరా (భ్రాతః)! నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారము విచిత్రమయినది. నువ్వు ఎవరి వాడవు? నువ్వు ఎవరు? ఎక్కడ నుండి వచ్చావు?ఈ తత్త్వ విచారణ కొంచం చెయ్యు’ 

    కస్త్వం కో హం కుత ఆయాతః కామే జననీ కోమే తాతః । 

    ఇతి పరిభావయ నిజ సంసారం సర్వం త్యక్త్వా స్వప్న విచారం ।। 

‘నువ్వు ఎవరు? నేను ఎవరిని? నేను ఎక్కడ నుండి వచ్చాను? నాకు తల్లి ఎవరు?తండ్రి ఎవరు? ఇలా విచారించి (ఆలోచించి) సారము లేని ఈ ప్రపంచము స్వప్నతుల్యంగా భావించి , ఈ సంసారమును (సంసారము పై మోహమును)  విడిచి పెట్టుము’.

స్వాధ్యాయము, తపస్సు, నిరంతర సత్యాసత్య విచారము, ధ్యానము, వేదాధ్యయణము, గురు శుశ్రూష తో ఈ ప్రశ్నల సమాధాన్యములు సాధ్యమవుతాయి. అయితే ఎంతమంది ఆ మార్గములో ప్రయాణిస్తారు? వారిలో ఎందరికి జ్ఞానసిద్ధి కలుగుతుంది? వారిలో ముముక్షువులై జీవనం సాగించి, పరమాత్మ లో ఏకమయ్యేది ఎందరు?

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్  యతతి  సిద్ధయే ।

యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం  వేత్తి తత్త్వతః ।।

‘వేల కొలది మనుష్యులలో ఏ ఒక్కడో మోక్ష సిద్ధి కి ప్రయత్నిస్తున్నాడు. అలా యత్నించినవారిలో ఎవరో ఒకడు మాత్రమే నన్ను యధార్ధముగా తెలుసుకోగలుగుతున్నాడు’

ప్రయాణం ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి! గమ్యం వైపు నడక సాగించాలి. ఇది జన్మాంతర ఆధ్యాత్మ ప్రయాణం. ఈ విచారణ జరగాలి. అరణి నుండి అగ్ని పుట్టినట్టు నిరంతర విచారణ తో జ్ఞానాగ్ని కణం ఒకటైనా పుడుతుంది. ఆ భగవదస్వరూప జ్ఞానముతో అనుభూతి కలుగజేసుకోవాలి.

మృగ స్వరూపము నుండి మానవ స్వరూప పరిణామము లో మన నిజ యత్నము ఏదీ లేదు. కానీ మానుష్య రూపము నుండి భగవద్స్వరూప పరిణామము మన చేతి లో ఉంది.

నాకు నేనుగా ఎన్నుకున్న మొదటి ప్రస్థానం, మాయా పంచకము. 

References

శ్రీ తత్వవిధానంద సరస్వతి గారి మాయ పంచకము ప్రవచనం, వివిధ సత్సంగ ప్రశ్నోత్తరముల చలనచిత్రములు.

గీత మకరందము – శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వామి గారు
యోగ వాసిష్టముశ్రీ కుప్పా వేంకట కృష్ణ మూర్తి గారు
వివేకా చూడామణి – ఆచార్య శ్రీ పుల్లెల శ్రీ రామచంద్రుడు గారు
శ్రీ ఆది శంకరుల రచనలు - https://www.sankara.iitk.ac.in/
ఆంధ్ర భారతి నిఘంటువు - https://andhrabharati.com/dictionary/index.php