Monday, April 24, 2023

మాయా పంచకము - పరిచయము

మాయా పంచకము

హరిః ఓం!

మాయ అనునది త్రిగుణాత్మకమై (సత్వ, రజస్, తమో గుణాలతో కూడినది అయి) ఉంటుంది. భగవదస్వరూపము, ఆత్మ స్వరూపము అనునవి వేరు అని, మనము అనుభవించుచున్న ప్రపంచము నిత్యము, సత్యము, భగవంతుని కన్నా అభేదము అన్న అజ్ఞానమును కలిగించినదే మాయ.

ఈ మాయ అతి బలమయినది. దీనిని తెలుకోవడం అంతా సులువయిన పని కాదు. ఒక వస్తువును తెలుసుకోవాలి అంటే, అది ప్రత్యక్షముగా ఉండాలి. ‘న విద్యతే యా సా మాయా విద్యావిద్యా ...’ (మాయా దర్శనము) మరియు ‘యా మా సా మాయా’ వాక్యాల ద్వారా  – ఏది లేనిదో అది మాయ, ఏది తెలియబడదో అది ఆవిద్య అన్న అర్థం దొరుకుతోంది. అంటే మాయ, అవిద్య అనే రెండూ కూడా లేని వస్తువులను సూచిస్తున్నాయి. లేని వస్తువునకు నిర్వచనము చెప్పలేము. అందుకే అవి అనిర్వచనీయాలు.

ఆకాశం లో అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి, దాని పక్కన ఉన్న పెద్ద నక్షత్రాన్ని చూపిస్తాము. ఆ చూసే వారు, ముందు ఆ పెద్ద నక్షత్రాన్ని చూసి, దాని బట్టి ఆ పక్కన ఉన్నది అరుంధతి నక్షత్రం అని గ్రహిస్తారు. ఆకాశము లో ఉన్న చంద్రుణ్ణి పిల్లవానికి చూపడం కోసం, చెట్టు కొమ్మ వెనక ఉన్నాడు అని మన చేతి వేళ్ళతో చూపిస్తాము. అప్పుడు ఆ పిల్లవాడు, ముందు మన చేతి వేళ్ళని, వాటి నుండి చెట్టు కొమ్మని, దాని నుండి చంద్రుని చూసి తెలుసుకుంటాడు.

అలాగే  ఈ మాయ యొక్క స్వరూప, గుణాలను అధ్యారోప, అపవాదముల యొక్క సహాయము తో తెలుసుకోవచ్చు. రజ్జువు నందు సర్పారోపము కలిగించి, రజ్జువును సర్పముగా మనకు అజ్ఞానము కలిగించినదే మాయ. పరమాత్మ స్వరూపమయిన ఈ జగత్తు నందు  సంసారమును చూపించునదే మాయ. దీపము యొక్క వెలుతురుచే, చీకటిలో సర్పము అని భావించిన రజ్జువు యొక్క నిజ స్వరూపము తెలియునట్లు, జ్ఞానముచే ఈ మాయ తొలగిపోవుచున్నది.

ఘటాకాశము, మహాకాశములని రెండు ఆకాశములు ఉన్నాయి అన్న భావన మనకు కలిగించినదే మాయ. ఘటః అస్తి - ఘటము అని ఒకటి ఉన్నది అన్న భావన వలన ఇవి రెండు అని అనుకుంటున్నాము. ఆ ఘటమే లేకపోతే, ‘ఆకాశములు రెండు’ అన్న సూచనయే  ఉండదు.

అలాగే ‘నేను’ అనేది ఈ శరీరము. ఈ శరీరము లో  ఆవరించిన ఆత్మ వేరు, పరమాత్మ వేరు అన్న భావన కలిగించినది మాయ. ఈ జగత్తు అంతా భగవద్ సృష్టి. ఆ పరమాత్మ నుండి పుట్టి, అందులోనే లయిస్తుంది. అందులో నుండి పుట్టినది కాబట్టి, ఈ జగత్తు, పరమాత్మ వేరు కాదు అన్న జ్ఞానమును మనలో కలగకుండా, కలిగినా స్థిరపడకుండా ఉండనీయనిదే మాయ.    

మాయ మన జీవితం లో ఒక భాగం. ఇది మన అస్తిత్వం, అనుభావాల యొక్క సారం. ప్రతీ అనుభవాన్ని, బంధాన్ని, భావనని తరచి తరచి ప్రశ్నిస్తూ పోతే దొరికే సమాధానం ఈ మాయ. ఏది నిజము, ఏది నిత్యము అన్న వైపు ఆ విచ్ఛేదనం సాగితే దొరికే సమాధానం ‘న ఇతి న ఇతి’ – ఇది కాదు , ఇది కాదు, ఇది నిజం కాదు, ఇది నిత్యం కాదు. ఇది మానవ జీవన సత్యం.

ఈ సంసారం లో ఏదీ నిత్యం కాదు అని ఎలా అంటాము? నిత్యమయినవి ఏమీ లేవా?  ప్రతి దినము చూసే జనన మరణాలు నిత్యములు  కావా?

ప్రతీ రోజు ఏక కణ జీవుల నుండి తిమింగాల వరకు ఎన్నో వేల జీవాలు పుడుతున్నాయి. అలాగే వీటి జీవనానికి ఆవలంబముగా ఈ ప్రపంచములో ఎన్నో వస్తువులు ఉన్నాయి కదా. పుచ్చిన కట్టె నుండి కూడా పుట్ట గొడుగులు పుట్టడం లేదా? సాగర గర్భములో ఉన్న అగ్ని పర్వత బిలాలలో వద్ద కూడా శాస్త్రజ్ఞులు జీవులను కనుగున్నారు కదా!  అవి నిజం కాదా?  పసివారి దగ్గరనుండి పండు ముసలివారు వరకు ఎందరో రోజూ మరణించడం చూస్తున్నాము. ఆ మరణాలు నిజం కాదా?

ఈ జనన మరణాలు నిజం అనుకుంటే, జనన మరణాలు రెండూ ఏక కాలం లో ఒకే వస్తువు నందు ఉండవు. జీవం ఉన్నది – మరణం లేదు. మరణం కలిగినది – జీవం లేదు. సత్యమయిన వస్తువు లేదా విషయము దేశ కాలాలకు అతీతముగా, ఎల్లప్పుడూ ఉండాలి. అంటే జన్మించిన వస్తువు ఎల్లప్పుడూ ఉండాలి.  మరి ఇక్కడ అలా లేదు కదా. అంటే, జనన మరణాలు సత్యం కాదు. అవి మాయ.

పోనీ ఈ జగత్తు నందు సుఖము నిత్యమా? దుఃఖము నిత్యమా?

ఆనందావస్తా లో ఉన్న వ్యక్తి కి ఈ జగత్తు నందు అంతటా సుఖమే కనుపడుతున్నది. అదే సమయము లో, అదే జగత్తు నందు దుఃఖము నందు ఉన్న వ్యక్తి కి బాధామయముగా అనిపిస్తున్నది. అంటే ఒకే సమయం లో, ఒకే వస్తువు (జగత్తు), వేరు వేరు మనుష్యులకి, వారి వారి మానసిక స్థితి బట్టి సుఖభరితము గాను, దుఃఖపూరితము గాను అనుభవమవుతున్నది. సుఖ, దుఃఖాలు రెండూ పరస్పర విరుద్ధ భావాములు కదా!

సుఖము ఉన్నది – దుఃఖము లేదు. దుఃఖము ఉన్నది – సుఖము లేదు. మరి ఈ రెండూ ఏక సమయము లో, ఒకే జగత్తు నందు ఎలా ఉన్నవి? ఎండమావి లో నీరు ఉన్నదా? లేదు, ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవి కూడా అలానే. కానీ వాటి యొక్క నిత్యానుభవము, సత్యారోపము – మిథ్య, మాయ!

రజ్జువు నందు సర్పము ను చూసినప్పుడు, ఆ సర్పము ఎక్కడ ఉన్నది?

ఆ చూసిన వ్యక్తి యొక్క మనస్సు లో మాత్రమే ఉన్నది. మనస్సు లో ఉన్న సర్పాన్ని, ఆ మనిషి ఆ రజ్జువు నందు చూశాడు. ఆ సర్పము నిజము కాదు, కేవలము మాయ.

అలాగే ఈ జగత్తు, మనిషి మనస్సు లోనుండి పుట్టినది. మనిషి లయించిన తరవాత ఆతని జగత్తు కూడా లయమవుతుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనపై చేసే యుక్తి మనం నిత్యమని చూసే ఈ జగత్తు.  అందుకే జగత్తు అనిత్యము.

మకుటము

ఈ పంచకము లో మకుటము – ‘అఘటిత ఘటనా పటీయసి మాయ!

ఏ సంఘటన అయితే జరుగలేదో, ఏదైతే సంభవము కాదో, ఏది ఘటిల్లలేదో అది అఘటితము. అఘటితము సంభవించే దేశ, కాల, స్థల పరిస్థితులు ఉండవు.  అటువంటి అఘటితాన్ని, ఘటించినట్లు, జరిగినట్లు, ఉన్నట్టు చూపగల శక్తి కలది మాయ.

తెర మీద చలన చిత్రము కనిపించుచున్నది. యందు ఒక మనిషి ఆకాశమంత ఎత్తు పెరిగాడు లేదా చీమ అంతా చిన్న వాడు అయ్యాడు. అందులో కనిపించే విషయాములు ఏవీ కూడా సత్యములు కాదు. కానీ దానిని చూస్తున్నంతసేపూ దాని యందు మనం మమేకమయి, ఆ తెర పై కనిపిస్తున్న జగత్తుపై మామతానురాగములు, సుఖ దుఃఖములు కలిగించుకుంటున్నాము. ఆ తెర, చలన చిత్ర యంత్రము రెండూ కూడా జడములు, ప్రాణములు లేనివి. జడము నుండి చైతన్యాయాత్మకమయిన జగత్తు పుట్టడం సాధ్యము కాదు.  మన మనస్సు, చెవులు, కళ్ళు కల్పించిన మాయ ఈ తెర మీద ఉన్న జగత్తు.  ఈ మూడిటిలో ఏ ఒక్క దానిని మనం మూసేసినా ఆ మాయా  జగత్తు లో ఆ లక్షణము మరుగవుతుంది.

సర్పము అక్కడ ఉండే అవకాశం లేదు. అక్కడ ఉన్నది రజ్జువు ఒక్కటే కాబట్టి.  కానీ సర్పం అక్కడ ఉన్నట్టు ఆ మనిషికి కనిపించింది. అది ఎలా సాధ్యము? అదే మాయ.

ఎండమావి అని తెలిసిన తరవాత, దాని లో నీటిని మనం తాగాలని అనుకుంటామా? ‘ఆహా! ఇది మాయ రా! ఇది కాదు మనకి కావలసినది’ అనుకుంటాం. అందుకే మనము మాయను తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అన్న నిరంతర తపన ఉన్నవాడే సాధకుడు. సాధకుడు ఈ మాయ యొక్క ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపడతాడు. ఆ ఆశ్చర్యము, ఆ సాధన అతనిని మిథ్యా స్వరూపమయిన ఈ జగత్తు నుండి దూరముగాను, నిత్యమయిన పరమాత్మ కి దగ్గరగాను తీసుకొని వెళ్తుంది. ఆ మాయాతీత స్థితి, మాయను తెలుసుకోవడము వల్లనే సాధ్యము. ఒక్కసారి మాయని తెలుసుకున్న తరవాత, ఇంక అక్కడ మాయ ఉండదు. అఘటిత ఘటనలు జరుగవు.

ఏమిటా అఘటిత ఘటనలు? అవే ఈ పంచకము లోని శ్లోకాలు సూచించే ఘటనలు.

No comments: