అపగత గుణవర్ణ జాతిభేదే సుఖచితి విప్రవిడాద్యహంకృతిం చ
స్ఫూటయతి సుత దార గేహే మోహం త్వఘటిత ఘటనాపటీయసీ మాయా ||
‘నేను’ (ఆత్మ) ఎవరు? ఈ ప్రశ్న కి సమాధానం - ‘నేను’ ఒక సచ్చిదానంద స్వరూపము. కానీ ఈ మాంస మయ దేహమే ‘నేను’ అన్న భ్రమ లో ఉంటాం. ఈ భ్రమ కేవలం మన దేహము నందు మాత్రమే కాదు, పరబ్రహ్మ నందు కూడా చూస్తున్నాము. అలా మనం ఆరాధిస్తున్న వివిధ విగ్రహాలు ఈ భేదాన్ని మరింత ఎట్టి చూపుతున్నాయి. కానీ దేవతా స్వరూపము మృణ్మయమో, దారుమయమో కాదు. ఆ విగ్రహం కేవలం ఒక ప్రతినిధి మాత్రమే. కొమ్మని చూపి, చంద్రుణ్ణి చూపించినట్లు, విగ్రహాలు ఆ కొమ్మ. పరమాత్మ చంద్రుడు.
ఆ పరబ్రహ్మ తత్వం తెలిసిన తరవాత ‘న మృత్ శిలా మయా దేవతాః న ఆపోమయం తీర్థం’. పుణ్య తీర్థాల్లో ఉండేవి కేవలం జలం కాదు. అలా అయితే మన ఇంట్లో ఉన్న నీటికి కూడా ఆ పుణ్య శక్తి ఉండాలి.
అలాగే ఈ దేహ స్వరూపం ‘నేను’ కాదు – ‘నేను’ చిన్మయ స్వరూపుడను. ఆనంద స్వరూపుడను. అటు వంటి ‘నాలో’ - అపగత గుణ వర్ణ జాతి భేదే!
సత్త్వ , రజస్, తమో గుణాలు మూడు. ఈ గుణములలో భేదం ఉంటుంది. ఈ గుణములను అంటి పెట్టుకున్న వస్తువులకు, ఆయా గుణములు కలుగుతాయి.
వర్ణ భేదం కలదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు గలవు. కులము వేరు. వర్ణము వేరు. జన్మతః కలిగేది వర్ణము. చేయు కార్యముల వలన కలిగేది కులము. (గోకులము అంటే గోవులను సాకే వారు అందరూ ఉన్న కూటమి. ఈ గో కులము లో వర్ణ భేదములు ఉండవచ్చు. ఈ రెండిటినీ కలిపి ఒక్కటిగా చూడటము తప్పు. కానీ ఇది జన సామాన్య విషయమయిపోయినది.)
జాతి భేదం కూడా కలదు. దేవ దానవ కిన్నెర కింపురుష, మానవ సమస్త జంతు జాలము వివిధ జాతులుకు చెందినవి. అలాగే ప్రతీ జాతిలోనూ పలు విజాతులు కలవు.
అయితే ఈ గుణ, వర్ణ, జాతి భేదాలు అన్నీ ఈ దేహానివే తప్పా, ‘చిత్’ స్వరూపము నందు లేవు. కానీ మనం ఈ భేదాలు అన్నీ ఆపాదించుకొని, సస్వరూపమయిన ఆనంద , చిన్మయత్వానికి దూరం అవుతున్నాం.
స్ఫూటయతి సుత దార గేహే మోహం
పిల్లలు, భార్య, స్వగృహము పై మోహము, అహం/నేను, మమ/నాది అనే భావన. వీటి పైనే మానవ సమాజం ఆధారపడి ఉందేమో అనిపిస్తుంది. నేను, నాది అన్నవి ఏమీ లేకపోతే మనిషి కి అస్తిత్వం లేదు. కేవలం శూన్య స్థితి లో ఉంది పోతాడు మనిషి ఈ సమాజం లో. నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా గృహము, నా ధనము, నా స్థలము – వీటితోనే మనిషి గుర్తింపబడుతున్నాడు. వీటి ద్వారా మనిషి తనకు తాను ఒక పూర్ణత్వం ఆపాదించుకుంటున్నాడు. ఈ సమాజం వీటిని ఒక వ్యక్తి యొక్క గుర్తింపుగా, జీవితం లో ముఖ్య వస్తువులుగా చూస్తుంది.
ధర్మార్థకామమోక్షములు చతుర్విధ పురుషార్థములు. సూత, దార, గేహములు ఇందులోని అర్థకామములను సూచిస్తాయి కదా. మరి ఇవి ఉండటం వలన నష్టం ఏమిటి?
వీటి వలన నష్టం ఏమీ లేదు. నిక్షేపముగా ఉండవచ్చు. సప్తర్షులకు సంసారములు ఉన్నాయి కదా? ఉన్న సమస్య అంతా కూడా వీటి యందు మోహము, మమకారము ఉండటం వల్లనే. వీటి యందు బంధములు పెంచుకొని, ఆ బంధముల ద్వారా సుఖము కలగాలి అని చూస్తాము. ఆ బాహ్య వస్తువు నందు సుఖము కొరకు శ్రమ, తపన. అవి దొరకకపోతే దుఃఖం.
‘నా భర్త ఈ విధం గా నాడుచుకుంటే నాకు ఆనందం. నా భార్య ఈ విధం గా వంట చేస్తే చాలా బాగుంటుంది. నా కూతురు పెద్ద వైద్యురాలు కావాలి. నా కొడుకు పెద్ద వాహనము లో తిరగాలి. నా ఇంటి ముందు పెద్ద తోట, ఆ తోట లో మామిడి చెట్టు, ఆ చెట్టు మీద పక్షి గూళ్ళు, దానికి కాసే తియ్యని ఫలాలు, వాటిని నా మనవడు తినాలి..’ ఈ విధంగా సూత దార గేహాలపై కోరికల పరంపర నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది.
ఇవి ఎప్పటికీ తరగని సముద్ర తరంగాలు. వీటిని సాధిస్తే ఆనందం. సాధించలేకపోతే దుఃఖం. ఎక్కడి సుఖ మయ, చిద్రూప, ఆనంద, అఖండ స్వరూపం. ఎక్కడ ఈ లౌకికమైన కోరికలు. ఏమైనా పొంతన ఉన్నదా?
వీటికి అడ్డు కట్ట వేయడం చాలా కష్టం. ఒక శూన్య వ్యక్తి గా మనలేని మన దౌర్బల్యం, ఒక మనిషికి ఈ సమాజం ఏర్పరచిన ప్రమాణాలు అంత సుళువుగా పై కోరికలు లేని జీవితాన్ని గడపనియ్యవు. మనం కూడా ఈ అసహజపు ప్రమాణాలు అందుకోవాలని బాహ్య వస్తువుల వెంట, ఒకదాని వెంట మరొకటిగా పరుగెడుతూనే ఉంటాం. వాటి లోనే మన ఆనందాన్ని, జీవిత పరమార్ధాన్ని అన్వేషిస్తాం.
ఇది స్థితి తప్పించాలి అంటే, సూత దార గేహాలు కల్పించుకో. కానీ వాటి యందు మమకారం వీడు. వారి యొక్క ప్రవర్తన పై కానీ, వ్యవహారాలపై కానీ మోహము పొందకు. బాహ్య వస్తువుల ప్రాప్తి ద్వారా నీ ఉనికిని , ఆనందాన్ని పొందకు. నిజమే. జీవితం సాగాలి అంటే ఇల్లు కావాలి. భుక్తి కావాలి. తిరగడానికి ఏదో ఒక వాహనం కావాలి. వాటిని సాధించు. సాధించి వదిలెయ్. అంతకన్నా వాటి యందు రమించకు.
ఇది జరగాలి అంటే నిరంతరముగా మన ప్రవర్తనని మనమే విశ్లేషించుకోవాలి. ఒక వ్యక్తి లేదా వస్తువు పై విపరీతమయిన స్పందన కలిగిన వెంటనే, ఆ ఆలోచనను అక్కడే ఆపేసి ఆ స్పందన ఎందుకు కలిగింది అనే విషయము పై ఆలోచన చేయాలి. నీ ఆనందము యొక్క మూలము నీలో ఉన్నదా, లేదా బాహ్య వస్తువు పై ఉన్నదా?
అలా విశ్లేషించగా కలిగేది ‘నా ఆనందానికి మూల బిందువు నాలోనే ఉన్నది. దాని కేంద్ర స్థానం ‘నేను’. ’ అనే వివేకము. ఇది ఎన్నో ఒడిదుడుకులతో సాగే ఒక పరిణామ క్రమము. ఈ పరిణామమే దుఃఖానుభవముగా భావించే ఈ సంసారంలో, మనల్ని సత్ చిత్ ఆనంద స్వరూపులుగా నిలబెడుతుంది.
చిన్మయము, చిద్రూపము అయిన ఈ ఆత్మ యందు గుణ వర్ణ జాతి భేదములు,
వాటి నందు గల వివిధ వ్యాపారాదుల ద్వారా జనియించే అహంకార ప్రవృత్తులు కలిగించి,
ఆశాశ్వతములు అయిన సుత దార గేహముల పై మోహము కలుగతున్నది. ఏమి ఈ మాయా జనితమయిన అఘటిత
ఘటన! అఘటిత ఘటనా పటీయసి మాయ!
No comments:
Post a Comment