Sunday, June 14, 2026

On leaving Kashi

About leaving Kashi

As the hour of leaving Kashi draws near,
I feel heavy with 
So many memories
Too many emotions!
From physical world 
And the metaphysical realm.

As I drive through these streets,
Tears fill my eyes,
A heart's string gets pulled
An unheard call beckons
Drawing me closer to this city of Light,
The farther I move away from it.

Will I ever return to this place?
Yes! I pray for it.
There are rnas to be paid,
Closures to be had and
Loose ends to tie up.
And Ego to destroy!

Humbly I pray to Lord Viswanath
To consider bringing me back to Him
In this Life or another!
To Kashi, Abode of the Parents of this Universe
To Kashi, the Eternal Beacon!

Thank you @⁨Ravi Bava⁩ for making this Kashi trip possible for pedda mavayya's first annual rites, which I am sure is under the auspicious guidance of mavayya from pitru Loka. 
సీతారామ కార్యం లో పాల్గొన్నవి ఎన్నో! మహర్షులు, పక్షులు, రాక్షసులు,  కోతులు, ఎలుగు బంట్లు, బుడత ఉడత పిల్లలు! అన్నిటికీ, అందరికీ 🙏🏼

Tuesday, July 2, 2024

పూల మామ్మ


కాలి వేళ్ళకి మట్టెలు, మడమలకి  కడియాలు, ముతక వాయిలు చీర, రెండు చేతులకీ ఏవో పచ్చ బొట్లు, ఎర్ర గాజులు,  ముఖానికి ఛాయ పసుపు, చెవులకి కమ్మెలు, నుదిటిన పెద్ద రూపాయ కాసంత కుంకుమ బొట్టు, దాని కింద కనిపించి కనిపించని పచ్చ బొట్టు గీత,  ముడి వేసిన నెరిసిన జుట్టు, నెత్తిన పెద్ద పూల బుట్టతో నిటారున నిలుచొని  పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ 'అమ్మా ! పూలు' అని  అరుచుకుంటూ వీధుల వెంట నడిచే ఆవిడ మాకు కేవలం పూల మామ్మ గానే చాలా సంవత్సరాలు  తెలుసు. శ్రామిక జీవన విధానానికి, స్వాభిమానానికి నిలువెత్తు రూపం.

ఏ సంవత్సరామో గుర్తు లేదు కానీ ఒక మిట్ట మధ్యాహ్నం నేను అమ్మ ఇంట్లో భోజనాలు చేసి ఏవో పనులు చూసుకుంటున్న సమయం. ఆ మండుటెండలో మా ఇంటికి ఆనుకొని ఉన్న అరుగు మీద బుట్ట పెట్టుకొని, నెత్తి మీద ఉన్న బట్టతో చేసిన మట్టె తీసి మొహం తుడుచుకుంటూ కూర్చుంది, ఆయాస పడుతూ ఈ పూల మామ్మ. 

గేట్లో నుండి చూసిన అమ్మ బయటకి వెళ్ళి 'ఏం మామ్మ! నీళ్లేమైనా కావాలా? భోజనం చేశావా?' అని అడిగింది. 

ఆవిడేమో బుట్టలో ఉన్న సీమ వెండి డబ్బా, వాడేసిన ప్లాస్టిక్ 'మందు' సీసా లో నీళ్ళు చూపించి, అదో రకంగా 'ఉన్నాయిలెండమ్మా. ఎండగా ఉందని ఇలా కూకున్నాను. ఎల్లిపొమ్మంటే ఎళ్లిపోతాను' అని చటుక్కున లేవపోయింది.

దానికి అమ్మ 'ఎండలో తిరిగుతున్నావాని అడిగాను లే. నీకు కావలసినంత సేపు కూర్చొని వెళ్ళు. ఎంగిల్లు మాత్రం పడేయకు' అని లోపలికి వచ్చి నాతో ఒక సీసా తో fridge నీళ్ళు ఇచ్చి రమ్మంది.

అదీ పూల మామ్మ తో మా మొదటి మాటా మంతి. తరవాత ఎప్పుడో తెలిసింది ఏంటంటే అంతకుముందు వీధిలో ఎవరో వాళ్ళ గోడ దగ్గర ఉన్న చెట్టు కింది సేద తీరుతుంటే అక్కడ నుండి వెళ్లిపోమన్నారట.

అలా మొదలైన పరిచయం, వ్యాపార లావాదేవీల వరకు వచ్చింది. అదే ... అమ్మ పూజలకి మామ్మ రకరకాల పూలు తేవడం, అమ్మ కొనడం. కొన్నేళ్ళకి అమ్మ కానీ, మేము కానీ చెప్పక పోయినా, ఆ మామ్మ బలవంతంగా మాతో ఇంట్లో పూజ బుట్ట తెప్పించి, తన దగ్గర ఉన్న పువ్వులు అందులో పెట్టేసి వెళ్లిపోయేది - ఖరీదు చెప్పకుండానే, ఈ రోజుకి డబ్బులు తీసుకోకుండానే. అంటే తరవాత ఎప్పుడో తీసుకొనేది. అమ్మ పూజ కి మాత్రం పువ్వుల కొరత ఉండేది కాదు. అమ్మ ఎప్పుడూ ఇక్కడ బేరం ఆడటం వినలేదు. ఒకటి రెండు రూపాయిలు ఎక్కువే ఇచ్చేదీ. అలా ఓ రెండు దశాబ్దాలు గడిచాయి.

హఠాత్తుగా అమ్మకి మా మీద కోపం వచ్చి వెళ్ళిపోయింది. కాదు కాదు! పైవాడు తీసుకొని వెళ్ళిపోయాడు. పడుకొండవ రోజు నాడు రెండు పెద్ద సంచీలతో బంతి పువ్వులు, గులాబీలు ఆ అరుగు మీద పెట్టేసి వెళ్ళిపోయింది పూల మామ్మ. 

మళ్ళీ నెలకి కనిపించింది. అన్నేళ్ళకి మొదటి సారిగా మా గుమ్మం దాటి లోపలికి వచ్చిన పూల మామ్మ, అమ్మ ఫోటో కి పెట్టమని పెద్ద పెద్ద గులాబీలు నాలుగు కుర్చీ మీద పెట్టింది. 

'ఏం మామ్మ. రావడం లేదు ఇటువైపు' అని అడిగితే, 'అమ్మగారు లేకపోతే ఇంకా నా పువ్వులు ఎవలు కొంటారు ఈ వీధిలో' అని అనేసింది తన ముడతలు పడ్డ కళ్ళు గట్టిగా తుడుచుకొని. నాకు, నాన్నకి దుఃఖం ఇంక ఆగలేదు. ఏమనాలో  తెలీని స్థితిలో ఉంది పోయాం అమ్మని చూస్తూ, ఏడుస్తూ. ఆ ఎదురుచూపులకే అమ్మని తిరిగి తెచ్చే బలం ఉంటే!?

"పచ్చగా ఎళ్లిపోయింది తల్లి. నిండు కుండే పోనాది. ఇంకా మట్టెట్టుకుని ఏడుపెందుకు బాబు! ఏడవకండి" అనేసి మేమిచ్చిన నోట్లు అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ మాటల్లో ఎంత భావం ఉందో, ఎంత అనుభవం ఉందో తరవాత ఎప్పటికో కానీ నా బుర్రకి తట్టలేదు. నిజమే! కుండే లేని తరవాత, మట్టె పట్టుకొని ఏడవడం దేనికి?

ఇంకో సంవత్సరానికి రోడ్డు మీదా కనిపించింది మామ్మ. మనిషి చిక్కింది. చీర లో అక్కడక్కడా చిరుగులు.  'ఈ మధ్య ఎక్కడ ఉన్నావ్ మామ్మ. ఎలా ఉన్నావ్?' అని అడిగితే 'ప్రతీ నెలా పింఛను ఇస్తున్నారు రామాలయం కాడ నాకు, మా ఆయనకి. అక్కడి వరకు వస్తున్నాను. అప్పటిలా తిరగలేకపోతున్నాను బాబు. గోరమింట్ స్తలం ఇచ్చింది కొమ్మాదికవతల.' పిల్లలు లేరట మామ్మ కి. అప్పుడే తెలిసింది మాకు ఆ సంగతి. తన చేతిలో డబ్బులు పెడదాం అని చూస్తే, నవ్వేసి వద్దనేసి వెళ్ళిపోయింది ఒక చిన్న పూల బుట్ట పట్టుకొని. 

ఇంకో సంవత్సరం గడిచింది. ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటి మనిషి భాను ని పూల మామ్మ కోసం అడిగా. ఒక నెల ముందే తాను కాలం చేసింది అని చెప్పింది. అప్పుడే తెలిసింది మా పూల మామ్మ పేరు గంగమ్మ అని. ఆ పేరుతో  కన్నా తనని పూల మామ్మ గానే తలుచుకుంటాం. అమ్మ కి కూడా తను అలానే తెలుసు. 

Friday, April 28, 2023

మాయా పంచకం - 5 : పరబ్రహ్మ యందు భేదములు & ఉపసంహారము

 పరబ్రహ్మ యందు భేదములు    

విధిహరిహర  భేదమప్యఖండే బత  విరచయ్య  బుధానపి  ప్రకామం

భ్రమయతి  హరిహర విభేదభావః నఘటిత ఘటనా పటీయసి  మాయా || 

నిర్వికారమునిర్గుణము, సర్వ వ్యాపకము, అద్వితీయము, నిరంజనము, నిష్క్రియము అయిన పరబ్రహ్మలో, మనం ఉపాసన కోసం నామ-రూప భేదము కల్పిస్తున్నాము. కానీ "న తే రూపం నచాకారః న ఆయుధాని  నచాస్పదం".

హరిహరులకు అభేదము అంటే జనసామాన్యముగా ఉన్న నానుడి ఏమిటంటే వైకుంఠములో విష్ణువు, కైలాసము లో శివుడు అని ఇద్దరు ఉన్నారు. వారిద్దరు సమానులే. శివస్య హృదయం విష్ణుః, విష్ణుస్య హృదయం శివః. ఈయన మనసు లో ఆయన, ఆయన హృదయములో ఈయన ఉన్నారు అని.  వీరివురు కాకుండా సత్యలోకములో బ్రహ్మ అని ఒకరు ఉన్నారు. ఆయన సృష్టి కర్త. ఆయనని పరమశివుడు శపించాడు, కాబట్టి ఆయనకి పూజార్హత లేదు. ఈ విధముగా సాగుతుంది సంభాషణ. 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే మూడు రూపాలు లేవు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ, పరమాత్మ. అందుకే హరిహరులకు అభేదము. అఖండమయిన పరబ్రహ్మనే మన ఉపాసనా సౌలభ్యము కోసం వేరు వేరు రూపములుగా, ఆ రూపములకు ఆస్థానాలుగా వేరు వేరు లోకాలు, వారికి పరివారాలు, వాహనాలు కల్పించుకున్నాము.  ఈ వివిధ రూపగుణాలకు వివిధ ఉపాసనా పద్దతులు కూడా ఏర్పరుచుకున్నాము. వైష్ణవము, శైవము, గాణపత్యము, శాక్తేయము, సౌరము వంటివి అలా పుట్టిన భేదములే. విచిత్రం ఏంటంటే ఈ వివిధ భేదాల చక్రంలో ఇరుక్కొని, పరబ్రహ్మను గుర్తించలేకపోతున్నాము. 

ఇంకా విచిత్రము – ఇటువంటి మూల మతాలే కాకుండా గురువుల పేరున, మఠముల పేరున ఇంకా విడిపోయి ఒక అయోమయ స్థితి లో  భ్రమిస్తూ ఉండిపోతున్నాము. 

“ఉపాసకామాన్ కార్యార్థం బ్రహ్మణో రూప కల్పనామ్”

ఉపాసన ఉపాస్యము. ఉపాసింప బడుతున్నది ఉపాస్యము, అంటే ఆ దైవము. దైవము అఖండం. అఖండమునకు నామ రూపములు ఉండవు. అఖండము అంటే అద్వైతము – రెండవది లేదు. ఇంకొక వస్తువు లేనప్పుడు ఇంకా నామ రూప విభజన ఉండదు.

కానీ ఉపాసన చేసేటప్పుడు, ఈ ఉపాస్యమునకు ఒక నామము, రూపము కలుగచేసి, దానిని ఉపాసిస్తాం. అలా చేస్తూ నిజమైన పర బ్రహ్మను మరుస్తున్నాం. ‘విష్ణు సర్వ వ్యాపకుడు’ అంటూనే ఆయనని వైకుంఠవాసిగా చూస్తాం.

ఇది ఒక వ్యామోహము. ఈ వ్యామోహము 'బుధానాపి' - పండితులను కూడా వదలక పోగా, వారిచే ఈ సంఘములో ఇంకా ప్రజ్వలింపజేయబడుతోంది. ఇది "అఘటిత ఘటనా పటీయసి మాయా!" ఇది మాయ యొక్క ప్రభావము కాక ఇంకేమీ కాదు. 

ఇది మాయా పంచకము. 

ఉపసంహారము

ఆహా! ఇటువంటి అఘటిత ఘటనలను ఘటిలలేటట్లు చేసే మాయ యొక్క శక్తి ఇంతటిది అయితే, ఈ మాయ నుండి బయట పడడం సాధ్యమేనా?

"దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా

మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే

అని గీతాచార్యుని బోధ. ‘దైవ సంబంధమయినది, త్రిగుణములతో కూడుకున్నది అయి నేను కల్పించిన మాయ దాటుట అతి కష్టము. కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని దాటగలరు.’

ప్రపత్తి అంటే సర్వ శరణాగతి. నిష్కామ భక్తి. అన్నింటికీ ఆ పరబ్రహ్మనే శరణువేడడం. ఏది జరిగినా అది కేవలం పరమాత్మ యొక్క ప్రసాదము అని గ్రహించడం. "నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్ " అన్న గజేంద్రుని స్థితి లో ఎల్లవేళలా ఉండటం. ఈ సర్వ శరణాగతి ఎంతవరకు మనము చేయగలము? ఎటు వంటి సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు ఎదురయినా, వాటిని పరమాత్మ యొక్క అనుగ్రహముగా స్వీకరించగలమా? ప్రతికూల పరిస్థితులలో కూడా ఆ శరణాగతి వదలకుండా, అనుకూల పరిస్థితులలో పరమాత్మ మీద ఉన్న ధ్యానం వదలకుండా ఉండగలమా? 

సజ్జన సాంగత్యము, ఆత్మ విచారము, నిరంతర సాధన తో ఇది సాధ్యము అవుతుంది. ఆ సాధన తో, ఆ విచారముతో నిష్కామ కర్మ సాధ్యం అవుతుంది. కర్మ ఫలాలను త్యజిస్తే, కోరికలు శమిస్తాయి. కోరికలు లేనప్పుడు, బంధాలు ముడి విడుతాయి. మరి,  అటు వంటి సాధన ఎలా సాధ్యము? 

ఆత్మానాత్మ వివేకము, నిత్యానిత్య వివేకము, సత్-అసత్ వివేకము - ఏది ఆత్మ, ఏది అనాత్మ , ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము ఏది అసత్యము అన్న విచక్షణ కలగడం మొదటి అడుగు గా భావించవచ్చు. 

వివేకము కలుగుతున్న కొద్దీ అనిత్యమైన, అనాత్మ అయిన, అసత్తు అయిన విషయముల మీద ఆసక్తి తగ్గుతుంది. అదే వైరాగ్యము. కర్మలు మానుట వైరాగ్యము కాదు. కర్మ ఫలముల మీద అనాపేక్ష. సంసారమును వదలడం కాదు. దాని మీద ఆసక్తి, ఆపేక్ష వదలాలి. తామరాకు మీద నీటి బొట్టు లా ఉండగలగాలి. 

వివేక వైరాగ్యాలు పెరుగుతున్న కొలదీ, ఒక రకమయిన శాంతి, పరిపూర్ణత్వము గోచరమవుతూ ఉంటుంది. అదే శమము.

జ్ఞాన, కర్మేంద్రియాలు పై పట్టు పెరుగుతుంది. అదే దమము.

బాహ్య విషయాసక్తి తగ్గి, తనలో తానూ చరిస్తూ, రమిస్తాడు - ఉపరతి.

క్షమ, సహనము పెరుగుతాయి - తితీక్ష

తానూ ఎంచుకున్న మార్గం పై విశ్వాసము, పూనిక కలిగి అచలుడై ఉంటాడు - శ్రద్ధ.

ఈ సత్యాన్వేషణమునుప్రయాణమును ఏకాగ్ర చిత్తము తో సాగించడం సమాధానము.

శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనే ఈ ఆరు షట్ సంపత్తులు. 

వీటి వలన కలిగేది జననమరణాతీత స్థితి అయినా ముక్తి లేదా మోక్షము పై తీవ్రమయిన ధ్యాస. మోక్షము అనగా భవ బంధముల నుండి ముక్తి. దీనినే ముముక్షత్త్వము అంటారు.

వివేకము, విరాగము, షట్ సంపత్తి, ముముక్షత్వం – ఈ నాలుగింటిని సాధనా చతుష్టయము అంటారు. నిరంతర అభ్యాసముల ద్వారా సాధన సాగించి వీటిని పొందాలి.

సాధన ఎలా చెయ్యాలి అంటే –

(శ్రవణము) వేదాంత బోధలు , మహా వాక్యాలు, వివిధ భాష్యములు వినడము

(మననము) వాటిని స్మరిస్తూ అర్థము, అన్వయము చేసుకోవడము

(నిధిధ్యాసన) ఆ అన్వయమును ఆలవాలముగా చేసుకొని ఆత్మా జ్ఞానానికై ధ్యానించడం.

శ్రవణ మననములలో బుద్ధి యొక్క అష్టాంగములు పాటించాలి. అవి  గ్రహణము, ధారణము, స్మరణము, ప్రతిపాదనము, ఊహాపోహ, అర్థ విజ్ఞానము, తత్వ జ్ఞానము. 

నిధిధ్యాసన / ధ్యానము చేయుటకు యమ, నియమములు సహకరిస్తాయి. అహింస, సత్యము, అస్తేయము (చౌర్యము చేయకుండుట) , బ్రహ్మచర్యము, అపరిగ్రహము - ఇవి యమములు. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నియమములు. 

చీకటి గది లో ఒక దీపం వెలిగించి గానే, మనకి వెనువెంటనే ఆ గదిలో వస్తువులు కనిపించవు. ఆ వెలుతురుకి మన కనులు నెమ్మదిగా అలవాటు పడుతూండగా, నెమ్మది నెమ్మది గా వస్తు విశేషాలు గోచరమవుతాయి. అలాగే సాధన చేస్తున్న కొలదీ ఈ గుణముల పరిపక్వత కలుగుతుంది. ఆ పరిపక్వత జ్ఞానమును కలిగిస్తుంది. ఆ జ్ఞానము తో మాయ అనే తెర తొలగుతుంది.

ఇప్పుడు 'ఇవి అన్నీ చెయ్యడం సాధ్యమేనా?' అన్న ప్రశ్న కలగడం ఆశ్చర్యమయిన విషయము కాదు. సాధ్యమే అని చెబుతాయి వేద వేదాంగ పురాణేతిహాసాలు. లౌకిక విద్యా సాధన చెయ్యగలిగినప్పుడు, మనం పూనుకుంటే, సరి అయిన మార్గదర్శి ఉంటే ఈ ఆధ్యాత్మిక సాధన ఎందుకు వీలు పడదు? 

ఓం శాంతి శాంతి శాంతిః

స్వస్తి

మాయా పంచకం - 4: సుత దార గేహ మోహము

 సుత దార గేహ మోహము 

అపగత గుణవర్ణ  జాతిభేదే సుఖచితి  విప్రవిడాద్యహంకృతిం చ

స్ఫూటయతి  సుత  దార  గేహే  మోహం త్వఘటిత  ఘటనాపటీయసీ మాయా ||

‘నేను’ (ఆత్మ) ఎవరు? ఈ ప్రశ్న కి సమాధానం - ‘నేను’ ఒక సచ్చిదానంద స్వరూపము. కానీ ఈ మాంస మయ దేహమే ‘నేను’ అన్న భ్రమ లో ఉంటాం. ఈ భ్రమ కేవలం మన దేహము నందు మాత్రమే కాదు, పరబ్రహ్మ నందు కూడా చూస్తున్నాము. అలా మనం ఆరాధిస్తున్న వివిధ విగ్రహాలు ఈ భేదాన్ని మరింత ఎట్టి చూపుతున్నాయి. కానీ దేవతా స్వరూపము మృణ్మయమో, దారుమయమో కాదు. ఆ విగ్రహం కేవలం ఒక ప్రతినిధి మాత్రమే. కొమ్మని చూపి, చంద్రుణ్ణి చూపించినట్లు, విగ్రహాలు ఆ కొమ్మ. పరమాత్మ చంద్రుడు.

ఆ పరబ్రహ్మ తత్వం తెలిసిన తరవాత ‘న మృత్ శిలా మయా దేవతాః న ఆపోమయం తీర్థం’. పుణ్య తీర్థాల్లో ఉండేవి కేవలం జలం కాదు. అలా అయితే మన ఇంట్లో ఉన్న నీటికి కూడా ఆ పుణ్య శక్తి ఉండాలి. 

అలాగే ఈ దేహ స్వరూపం ‘నేను’ కాదు – ‘నేను’ చిన్మయ స్వరూపుడను. ఆనంద స్వరూపుడను. అటు వంటి ‘నాలో’  - అపగత గుణ వర్ణ  జాతి భేదే! 

సత్త్వ , రజస్, తమో గుణాలు మూడు. ఈ గుణములలో భేదం ఉంటుంది. ఈ గుణములను అంటి పెట్టుకున్న వస్తువులకు, ఆయా గుణములు కలుగుతాయి.

వర్ణ భేదం కలదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు గలవు. కులము వేరు. వర్ణము వేరు. జన్మతః కలిగేది వర్ణము. చేయు కార్యముల వలన కలిగేది కులము. (గోకులము అంటే గోవులను సాకే వారు అందరూ ఉన్న కూటమి. ఈ గో కులము లో వర్ణ భేదములు ఉండవచ్చు. ఈ రెండిటినీ కలిపి ఒక్కటిగా చూడటము తప్పు. కానీ ఇది జన సామాన్య విషయమయిపోయినది.) 

జాతి భేదం కూడా కలదు. దేవ దానవ కిన్నెర కింపురుష, మానవ సమస్త జంతు జాలము వివిధ జాతులుకు చెందినవి. అలాగే ప్రతీ జాతిలోనూ పలు విజాతులు కలవు.

అయితే ఈ గుణ, వర్ణ, జాతి భేదాలు అన్నీ ఈ దేహానివే తప్పా, ‘చిత్’ స్వరూపము నందు లేవు. కానీ మనం ఈ భేదాలు అన్నీ ఆపాదించుకొని, సస్వరూపమయిన ఆనంద , చిన్మయత్వానికి దూరం అవుతున్నాం. 

స్ఫూటయతి  సుత  దార  గేహే  మోహం 

పిల్లలు, భార్య, స్వగృహము పై మోహము, అహం/నేను, మమ/నాది అనే భావన. వీటి పైనే మానవ సమాజం ఆధారపడి ఉందేమో అనిపిస్తుంది. నేను, నాది అన్నవి ఏమీ లేకపోతే మనిషి కి అస్తిత్వం లేదు. కేవలం శూన్య స్థితి లో ఉంది పోతాడు మనిషి ఈ సమాజం లో.  నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా గృహము, నా ధనము, నా స్థలము – వీటితోనే మనిషి గుర్తింపబడుతున్నాడు. వీటి ద్వారా మనిషి తనకు తాను ఒక పూర్ణత్వం ఆపాదించుకుంటున్నాడు.  ఈ సమాజం వీటిని ఒక వ్యక్తి యొక్క గుర్తింపుగా, జీవితం లో ముఖ్య వస్తువులుగా చూస్తుంది.

ధర్మార్థకామమోక్షములు చతుర్విధ పురుషార్థములు. సూత, దార, గేహములు ఇందులోని అర్థకామములను సూచిస్తాయి కదా.  మరి ఇవి ఉండటం వలన నష్టం ఏమిటి? 

వీటి వలన నష్టం ఏమీ లేదు. నిక్షేపముగా ఉండవచ్చు. సప్తర్షులకు సంసారములు ఉన్నాయి కదా?  ఉన్న సమస్య అంతా కూడా వీటి యందు మోహము, మమకారము ఉండటం వల్లనే. వీటి యందు బంధములు పెంచుకొని, ఆ బంధముల ద్వారా సుఖము కలగాలి అని చూస్తాము. ఆ బాహ్య వస్తువు నందు సుఖము కొరకు శ్రమ, తపన. అవి దొరకకపోతే దుఃఖం. 

‘నా భర్త ఈ విధం గా నాడుచుకుంటే నాకు ఆనందం. నా భార్య ఈ విధం గా వంట చేస్తే చాలా బాగుంటుంది. నా కూతురు పెద్ద వైద్యురాలు కావాలి. నా కొడుకు పెద్ద వాహనము లో తిరగాలి. నా ఇంటి ముందు పెద్ద తోట, ఆ తోట లో మామిడి చెట్టు, ఆ చెట్టు మీద పక్షి గూళ్ళు, దానికి కాసే తియ్యని ఫలాలు, వాటిని నా మనవడు తినాలి..’ ఈ విధంగా సూత దార గేహాలపై కోరికల పరంపర నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. 

ఇవి ఎప్పటికీ తరగని సముద్ర తరంగాలు. వీటిని సాధిస్తే ఆనందం. సాధించలేకపోతే దుఃఖం. ఎక్కడి సుఖ మయ, చిద్రూప, ఆనంద, అఖండ స్వరూపం. ఎక్కడ ఈ లౌకికమైన కోరికలు. ఏమైనా పొంతన ఉన్నదా? 

వీటికి అడ్డు కట్ట వేయడం చాలా కష్టం. ఒక శూన్య వ్యక్తి గా మనలేని మన దౌర్బల్యం, ఒక మనిషికి ఈ సమాజం ఏర్పరచిన ప్రమాణాలు అంత సుళువుగా పై కోరికలు లేని జీవితాన్ని గడపనియ్యవు. మనం కూడా ఈ అసహజపు ప్రమాణాలు అందుకోవాలని బాహ్య వస్తువుల వెంట, ఒకదాని వెంట మరొకటిగా పరుగెడుతూనే ఉంటాం. వాటి లోనే మన ఆనందాన్ని, జీవిత పరమార్ధాన్ని అన్వేషిస్తాం. 

ఇది స్థితి తప్పించాలి అంటే, సూత దార గేహాలు కల్పించుకో. కానీ వాటి యందు మమకారం వీడు. వారి యొక్క ప్రవర్తన పై కానీ, వ్యవహారాలపై కానీ మోహము పొందకు. బాహ్య వస్తువుల ప్రాప్తి ద్వారా నీ ఉనికిని , ఆనందాన్ని పొందకు. నిజమే. జీవితం సాగాలి అంటే ఇల్లు కావాలి. భుక్తి కావాలి. తిరగడానికి ఏదో ఒక వాహనం కావాలి. వాటిని సాధించు. సాధించి వదిలెయ్. అంతకన్నా వాటి యందు రమించకు.

ఇది జరగాలి అంటే నిరంతరముగా మన ప్రవర్తనని మనమే విశ్లేషించుకోవాలి. ఒక వ్యక్తి లేదా వస్తువు పై విపరీతమయిన స్పందన కలిగిన వెంటనే, ఆ ఆలోచనను అక్కడే ఆపేసి ఆ స్పందన ఎందుకు కలిగింది అనే విషయము పై ఆలోచన చేయాలి. నీ ఆనందము యొక్క మూలము నీలో ఉన్నదా, లేదా బాహ్య వస్తువు పై ఉన్నదా?

అలా విశ్లేషించగా కలిగేది ‘నా ఆనందానికి మూల బిందువు నాలోనే ఉన్నది. దాని కేంద్ర స్థానం ‘నేను’. ’ అనే వివేకము. ఇది ఎన్నో ఒడిదుడుకులతో సాగే ఒక పరిణామ క్రమము. ఈ పరిణామమే దుఃఖానుభవముగా భావించే ఈ సంసారంలో, మనల్ని సత్ చిత్ ఆనంద స్వరూపులుగా నిలబెడుతుంది.

చిన్మయము, చిద్రూపము అయిన ఈ ఆత్మ యందు గుణ వర్ణ జాతి భేదములు, వాటి నందు గల వివిధ వ్యాపారాదుల ద్వారా జనియించే అహంకార ప్రవృత్తులు కలిగించి, ఆశాశ్వతములు అయిన సుత దార గేహముల పై మోహము కలుగతున్నది. ఏమి ఈ మాయా జనితమయిన అఘటిత ఘటన! అఘటిత ఘటనా పటీయసి మాయ!

మాయా పంచకం - 3: భవ సాగర భ్రమణం

భవ సాగర భ్రమణం

సుఖచిదఖండబోధ  మద్వితీయం వియదనలాది  వినిర్మితే  నియోజ్య

భ్రమయతి  భవసాగరే  నితాంతం త్వఘటిత  ఘటనాపటీయసీ మాయా ||

సత్, చిత్, ఆనందమయము, అఖండము, అద్వితీయము అయిన ఆత్మ ను, అది పంచ భూతాత్మకమయిన శరీరముగా భావింపచేసి, నిరంతరము ఈ భవ సాగరములో తిరగడమనే ఈ అఘటిత ఘటన మాయ యొక్క బలీయమయిన శక్తి! 

సుఖచిదఖండబోధ  మద్వితీయం

‘నేను’ (ఆత్మ) యొక్క స్వరూప వివరణము సత్, చిత్, ఆనంద స్వరూపము.

ఈ ‘నేను’ నిత్యము (సత్). ఇది ఆనంద స్థితిలో ఉంటుంది. అంటే నిరంతర సుఖ స్థితి లో ఉంటుంది. కానీ ఇది దుఃఖ స్థితిలో ఎందుకు చూస్తున్నాము? బాహ్య వస్తువుల వలన. అది ఎలా?

బాహ్య వస్తువు యొక్క ఉనికి చేత మనకి దుఃఖము కలుగదు. ఆ వస్తువును కావాలనుకోవడం, దాని యందు సుఖాన్ని చూడటం, ఆ వస్తువు అలభ్యమయినప్పుడు బాధ పడటం, అది వేరొకరికి దొరికినప్పుడు వారి యందు ఈర్ష్య భావము ఇత్యాది వికారముల వలన దుఃఖము కలుగుతున్నది. వీటినే రాగా ద్వేషములుగా చెప్పవచ్చు.

అంటే నిరంతర సుఖ స్థితి లో ఉండే  ‘నేను’, ఆ సుఖము యొక్క అన్వేషణ ‘నా’ లో చేయకుండా, దానిని బాహ్య వస్తువులకు ఆపాదించి, వాటి యందు మమేకమయి, ‘నా’ లోని సుఖమును మరిచి, దాని కొరకు వేరొక దానిపై ఆధారపడుతున్నాను.

ఆ ‘నా’ లోని సుఖ స్వరూప అన్వేషణమే  ఆత్మ విచారము. ఈ రాగ ద్వేషములు, బాహ్య ప్రపంచము లేనప్పుడు ఈ ‘నేను’ యొక్క స్వరూపము ఏమిటి అన్నదే ఆత్మ విచారము.

కో అహం!

ఎటువంటి ఆలోచనల చలనం లేకుండా, బాహ్య వస్తువుల అస్తిత్వ భావన లేకుండా, ఒక ప్రశాంతమయిన స్థితి కలిగినప్పుడు ఉన్నదే ఈ ‘నేను’. ఆ ఆలోచనల స్తంభనయే సంసార విముక్తి. ఆ ఆలోచనల స్తంభన ప్రక్రియయే ధ్యానం.  అటు వంటి స్థితి లో భావనయే  ‘అహమస్మి ’. ‘నేను’ తప్ప వేరొకటి లేదు. ‘నేను’ మాత్రమే ఉన్నాను. అలా ‘నేను’ మాత్రమే ఉన్నాను అన్నదే ‘నా’ (ఆత్మ) యొక్క నిజ స్థితి – సుఖ, ఆనంద స్థితి.

‘నా’ నిజ స్థితి సుఖ, ఆనందమయితే, మరి దుఃఖమయముగా ఎందుకు అనుభవము అవుతున్నది? అదే మాయా ప్రభావము!

చిత్

చిత్ అంటే స్పృహ, ఎరుక, జ్ఞానము. “నేను ఉన్నాను. నేను చూడగలను. వినగలను. నడవగలను. రుచి చూడగలను. నాలో ఆలోచనల పరంపర ఉంది. సుఖదుఃఖానుభవము ఉంది.” ఇటువంటివి ఉన్నాయి అన్న స్పృహ ఎక్కడ ఉన్నది? మనస్సు లో ఉన్నది. ఆ ‘స్పృహ’ యే ‘నేను’. అదే చిత్.

“నేను ఇక్కడ ఉన్నాను. అక్కడ లేను” అని అన్నప్పుడు, ఆ విషయము నీకు ఎలా తెలిసినది? క్షేత్రములో (లేదా అంతరము లో),  ఒక శరీరము ఆక్రమించిన స్థలము యొక్క జ్ఞానము నీ యందు కలుగుటచే తెలిసినది.

అది ఎలా తెలిసినది ? ఆ శరీరము నీవు కాదు కాబట్టి. ఆ శరీరమే నీవైనచో, దాని యొక్క బిందుస్థానములు నీకు తెలిసే అవకాశము లేదు.  స్థలకాలాదుల పరిమితులలో ఆ శరీరము యొక్క ఉనికిని తెలుసుకున్నది ఏదైతే ఉందో అది నీవు. అదే నీ యొక్క స్పృహ, ఎరుక, -  చిత్.

ఆ చిత్ అపరిమతము, సర్వవ్యాపకము. ఎందువలన? క్షేత్రాగణితము లో ఒక క్షేత్రము తీసుకున్నప్పుడు, అందులో స్థిర స్థానము నుండి బిందుస్థానములు నిర్ణయించడం కేవలం ఆ క్షేత్రానికి అభిన్నముగా ఉన్నప్పుడే సాధ్యము. నీకు ఈ ప్రపంచములో నీ శరీరము యొక్క స్థితి తెలియుచున్నది అంటే, నువ్వు ఆ శరీరానికి, ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచం ఉన్న సృష్టి కి అభిన్నముగా ఉన్నావు. అది కేవలం ‘నువ్వు’ (చిత్) అపరిమితమయి, సర్వ వ్యాపాకము ఐనప్పుడే సాధ్యము. 

అఖండమద్వితీయం

‘నేను’ అఖండము. ఆత్మస్వరూపము సుఖ, చిత్ స్వరూపము అని పైన తెలుసుకున్నాము. సుఖము ఉన్నది – దుఃఖము లేదు. అంతటా ‘నీవే’ ఉన్నావు. అన్నీ ఒకే వస్తువు అయినప్పుడు, ఆ వస్తువును విభాగించడం జరగదు. దానిని ఖండ ఖండాలుగా చూడలేము. అందుకే ‘నేను’ అఖండము. ‘నేను’ అద్వితీయం.

తెలుసుకుంటున్నవాడు జ్ఞాత, తెలియబడుతున్న విషయము జ్ఞేయము. ఇవి రెండూ జ్ఞానము నుండి పుడతాయి. చూచుచున్నవాడు వాడు ద్రష్ట, చూడబడుచున్నది దృశ్యము. ఇది దర్శనము వలనే సాధ్యము. ‘నువ్వు’ జ్ఞాతవా? ద్రష్టవా? రెండూ కాదు. ‘ద్రష్ట’ అని ఒకడు లేనప్పుడు, ‘జ్ఞాత’ అని ఒక పదవి లేనప్పుడు కూడా ‘నువ్వు’ కలవు. దర్శనము లో ‘నువ్వు’ లేవు. జ్ఞేయము లో కూడా ‘నువ్వు’  లేవు.  జ్ఞేయదృశ్యవిహితముగా ‘నువ్వు’ గలవు. కాబట్టి ఆ ‘నువ్వే’  జ్ఞానము, దర్శనము.

‘నా’ నిజ రూపము సుఖచిదఖండమయినప్పటికీ పెరిగిన, మసులుతున్న  ఈ ప్రపంచం ఆ భావన కలుగనివ్వదు. ప్రతీదాని యందు రాగమో, ద్వేషమో ఉండాలని పెరుగుతాం. ఒక వస్తువును అభావముగా చూడడం చాలా అరుదు. ఈ భావన చాలా అలవోకగా ‘చిట్టీ! నీకు నాన్న ఇష్టమా? అమ్మ ఇష్టమా?’ లాంటి చిన్న అమాయకపు ప్రశ్న దగ్గర మొదలవుతుంది. 

రాగద్వేషాలే కాదు, బయటి వారు లేదా వస్తువులు మనల్ని ఏదో చేస్తారనే భయముతో ఉంటాం.  ఈ రాగద్వేషాలు, భీతి, నామ రూప విభేదాలు పరమాత్మ రూపాలుగా మనం భావించి పూజించే విగ్రహాల దగ్గర నుండి, ఖగోళ గ్రహాల వరకు, చివరికి నిర్గుణుడు అయిన ఆ పరబ్రహ్మకి కూడా ఆపాదిస్తాం. ఫలానా గ్రహానికి శాంతి చేయాలి, ఫలానా దేవుడికి అభిషేకం చేయాలి, ఫలానా చోట ఉన్న గుడికి ప్రదక్షిణలు చేస్తే ఏదో మంచి జరుగుతుంది, అలా చేయక పోతే కీడు జరుగుతుంది అని వివిధ వ్యవహారాలు నడుపుతూ, ప్రతీ దానికి భయపడే స్థితిలో జీవిస్తున్నాం. 

వీటికి ఊర్ధ్వముగా ఎదగడానికి ప్రయత్నించాలి.  ‘నేను’ సుఖచిదఖండస్వరూపము అన్న జ్ఞానము మనకు ఆ స్థితి ని కల్పిస్తుంది. 

ఈ సుఖచిదఖండ అద్వితీయమైన స్వరూపమును మనం మాయ యొక్క ప్రభావము చేత మరచి, ఏమవుతున్నాము? 

వియదనలాది  వినిర్మితే  నియోజ్య భ్రమయతి  భవసాగరే  నితాంతం

దేహాధ్యాస, దేహధర్మాధ్యాస చాలా లోతుగా మనలో పాతుకొని ఉంటాయి. ‘ఈ దేహమే నేను. ఈ దేహము యొక్క గుణ ధర్మములు నావి’ అన్న ఆలోచన నిజం కాదు అని మనం అస్సలు అంగీకరించలేము. మనం పాటించే వీధి విధానాలు, ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి అటు వంటివి.

ఒక ఉదాహరణ .

మనం పాటించే దైనందిన కర్మలలో ఈ దేహం శుచి అయితే, ‘నేను’ కూడా శుచి. దేహం అశుచి అయితే, ‘నేను’ కూడా అశుచి. ఇక్కడ ‘నేను’ (ఆత్మ) శుచిగా ఉందా లేదా అన్న ప్రసక్తి ఉండదు. దూర ప్రదేశాలలో సంభవించిన జ్ఞాతుల మరణ వార్త వలన కూడా ఈ దేహానికి అశుచి ఏర్పడుతుంది. అలా కర్మ కాండ అంతా దేహము చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ఇది దేహాధ్యాస ను దూరంగా ఎలా ఉంచుతుంది?

మరొక ఉదాహరణ.

ఒక వ్యక్తి యొక్క ఛాయాచిత్రం ఒకటి తీయించి, ఆ చిత్రం లోని రూపాన్ని ఆ వ్యక్తికి ఆపాదిస్తాం. అంతెందుకు మన ఛాయాచిత్రం తీసుకొని, ‘ ఈ చిత్రం లో నేను బాగున్నాను. ఇందులో నేను కనబడటం లేదు. ఇందులో నీనెక్కడో చూస్తున్నాను.’ అని అంటాం. ఆ చిత్రం లో ఉన్నది నిజంగా మనమేనా? మనం ‘దృశ్యం’ కాదు కదా? అయినా సరే దేహాధ్యాస మనలని వేరే విధంగా ఆలోచించనివ్వదు. 

మన కన్నులతో ఒక చైతన్య స్వరూపాన్ని జడము లో చూస్తూ, మనస్సు, బుద్ధుల సంయోగముతో ఆ జడముకు ఒక రూపాన్ని కల్పించి, చైతన్యవస్తువు గా భ్రమించి, మన తలపుల్లో బంధిస్తాం. రోజూ మార్పు చెందుతున్న దేహం, మనస్సులో బంధించిన రూపం ఒకటి కాదు. ఈ భ్రమ మనం తీసే ప్రతీ ఛాయాచిత్రంతోనూ పెరుగుతూనే ఉంటుంది.

చివరి ఉదాహరణ.

ఈ మధ్య హోమములు, యజ్ఞములు చేయడం చూస్తున్నాము. అలా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న అగ్నికి ఛాయా చిత్రం తీసి,  ఆ అగ్ని కీలలలో ఏదో దేవతా స్వరూపమనో, ఆ హోమ ధూమములో గురు స్వరూపమనో ప్రచారం చేయడం చూస్తున్నాము. అలా మనకు మనమే ఒక భ్రమ కలిగించుకుంటున్నాం.

ధూమంలో కనిపించే రూపం మరుక్షణంలో మాయమవుతుంది. ఛాయా చిత్రం లోని రూపం కొన్ని రోజులకి మాయమవుతుంది. అలాగే మన దేహం కూడా ఎప్పుడో ఒకప్పుడు లయమవుతుంది. కానీ మాయ ప్రభావం ఎంతటిది అంటే సుఖచిదఖండమద్వితీయమయిన ఈ ‘ఆత్మ’ ని, పంచ భూతముల కలయిక అయి ఆశాశ్వతమయిన ఈ దేహము గా భావిస్తున్నాం. 

ఒక మనిషి మరణించినప్పుడు మనం నిజంగా ఆ మనిషిని కోల్పోతున్నామా?

అమ్మ వెళ్లిపోయినది.  ఆలోచించగా పోయినది కేవలం అమ్మ రూపము, దేహము అనే అనిపిస్తుంది. తన చైతన్యం నిత్యచైతన్యమయిన పరమాత్మ యందు కలిసింది, ఘటాకాశం మహాకాశం లో లయమయినట్లు. తన ఆలోచనలు, భావనలు నాలోనే ఉన్నాయి.

నిజంగా తనను కోల్పోతే, తాను ఇంక లేదు అంటే, మరి నేను శ్రాద్ధ కర్మ ఎవరికి చేస్తున్నట్టు? మరణించిన వ్యక్తి ఉండేది పక్షి రూపము లోనో, జంతు స్వరూపము లోనో కాదు. పితృ దేవతారూపములో ఆరాధన చేస్తున్నప్పుడు, నేను ఆ లయమయిన చైతన్యాన్ని ఆరాధిస్తున్నాను. ఆ చైతన్యము నిత్యము, సత్యము. కనుక అమ్మని నేను కోల్పోలేదు. ఆ రూపాన్ని, ఆ రూపము పంచి ఇచ్చే ఆనంతమయిన ప్రేమని కోల్పోయాను.

నేను కోల్పోయినది నిరంతరము మార్పు చెందినదయి, జీర్ణమవుతున్న ఒక అనిత్య శరీరాన్ని. ఈ శరీర పతనం మన చుట్టూ ఉన్న మనుషులకు, మనకు కూడా జరుగుతున్నదే. కాలం క్షణముల రూపములో మన జీవితాన్ని హరిస్తోంది. తీసే ప్రతే ఊపిరి చివరి ఊపిరికి మనల్ని దగ్గరకి చేరుస్తోంది. ఏనాటికైనా ఈ శరీరం పతనం కావాలసినదే. కానీ మనం ఈ రూపం, దేహము నిత్యములు అన్న అసత్య భావన, భ్రమలో  ఉంటాం. ఆ భ్రమ లో బ్రతుకుతున్నప్పుడు, ఈ సత్యం ఎప్పుడో ఒకప్పుడు మనల్ని తట్టిలేపుతుంది. అప్పుడు ఆ సత్యాన్ని భరించడం కష్టం. అందుకే ఈ  భ్రమ దుఃఖ హేతువు.

సరే!  ఈ దేహము స్థిరం అనుకోవడమే భ్రమ. ఈ భ్రమ వలన 'భ్రమయతి  భవసాగరే  నితాంతం'.

స్వతహాగా సుఖ, చిద్ , ఆనంద రూపమైన ఈ ఆత్మని కాదని, మనం ఆ సుఖాన్ని, ఆనందాన్ని బయట ప్రపంచం లో వెతుకుంటాం. ఆ వెతుకులాట లో ఎన్నో సంబంధాలు , రాగ ద్వేషాలు , కామ క్రోధ లోభ మొహాలకు గురి అవుతాం. ఆ భ్రమయే , ఆ తిరగడమే మనం 'బాగోవడం' వెతుక్కుంటూ ఈ సంసారం లో పాడుతాం. ఈ అజ్ఞానం మనల్ని తిప్పుతోంది. భ్రమయతి. ఎక్కడ తిప్పుతోంది? సంసార చక్రం లో. ఈ చక్రం లో ఏముంది. సుఖదుఃఖాల సమాహారం ఈ సంసారం. దేహం నిత్యము అనుకోవడం వలన ఈ తిరుగుడు తప్పదు.

బాహ్య వస్తువును చూడటం ఒక ఎత్తు ఐతే, ఆ వస్తువు తో మమేకం చెందడం, ఆ వస్తువు మీద ఇష్టాఇష్టాలను ఆపాదించుకోవడం వలన భ్రమయతి, తిరుగుడు. ఆ వస్తువును కేవలం ఒక నిమిత్తంగా చూడగలిగితే, ఆ దృష్టి తో  సమస్త లౌకిక ప్రపంచాన్ని చూడగలిగితే  తామరాకు మీద నీటి బొట్టు లా బతకడం సాధ్యమవుతుంది. 

ఈ భావనని ఇంకా కొంచం పైకి తీసుకొని వెళ్దాం. 

‘ఇది నేను. ఇది నేను కాదు’. ‘ఇది నాది. ఇది నాది కాదు.’

ఈ భావనలు మనలోని అహం ని సూచిస్తాయి. అస్సలు నేను అన్న భావనే లేకపోతే? నాదీ అన్న అనుబంధమే లేకపోతే? అంటే పూర్తిగా ఈ ప్రపంచానికి, మనకి ఉన్న సంబంధాలు త్రెంచుకోమని కాదు. మనిషి సంఘ జీవి. సంఘంలో బ్రతుకుతున్న మనిషి కి కొన్ని కట్టుబాట్లు తప్పవు. కొన్ని బాధ్యతలు తప్పవు. అయితే ఆ బంధాలు, బాధ్యతలను కేవలం నిమిత్తంగా చూడలేమా?

కర్మలు చేస్తున్నప్పుడు, వాటి ఫలాపేక్షను వదలలేమా? అలా వదిలి ఉండలేకపోతున్నాము కాబట్టే ఈ భవ సాగరం లో నిరంతరము, జన్మ జన్మలుగా పరిభ్రమిస్తున్నాము. భ్రమయతి భావసాగరే నితాంతం!  

ఎందువలన?

అఘటిత ఘటనా పటీయసి మాయ!