మధ్య తరగతి మందహాసాన్ని
ఎంతో కొంత పెంచాలని,
చేసిన అప్పులు తీర్చాలని,
బెత్తెడైనా చదువు పెంచుకుందామని,
ఏదో ఒక రంగు కాలరు కూలీగా
వేన్నీళ్ళకి చన్నీళ్ళు చేర్చి,
ఓ నాలుగు రాళ్ళు కూడపెడదామని,
సొంత ఊరిలో అవక, చెయ్యలేక, చేతకాక,
అందిన ఓ అవకాశం ఆసరాగా
బుద్ధినో, కండనో నమ్ముకొని దేశాలు పట్టాం.
అవునండి మేము సగటు ఎన్నారైలం!
అదృష్టవంతులు మీరు
కన్న ఊరిలో ఉన్నారు
మీ చుట్టూ హితులే,
స్నేహితులే.
నిర్భాగ్యులం మేము
అన్నిటికీ దూరమయ్యాం.
పుట్టి పెరిగిన చోటు నుండి,
కని పెంచిన వారి నుండి
'మా' అనుకున్న మంది నుండి,
అందరి మనస్సుల నుండి.
అవునండి మేము సగటు ఎన్నారైలం!
వలస పోయిన పక్షులం,
శ్రీశ్రీ గారి బాటసారులం,
జాషువా వారి కాందిశీకులం,
బారిస్టర్ పార్వతీశులం.
ఎలా బ్రతికినా జెల్లకాయలు తినే
నడి రోడ్డు మీది అనాధ బ్రతుకులం.
ఆత్మీయత కోసం తపిస్తూ
కన్నీటి హలాహలాన్ని
గొంతులో పట్టి ఉంచుకున్న
విదేశ గరళ కంఠులం.
అవునండి మేము సగటు ఎన్నారైలం!
కన్నవారికి మంచి జీవితం ఇవ్వాలని,
మా కోసం త్యజించినవి అందివ్వాలని,
కాసుల వేటలో పడిన అత్యాశగాళ్ళం.
హఠాత్తుగా వారు తిరిగిరాని చోటుకి పోతే
మా నాలుగు ప్రాణాలను సప్తసంద్రాల్లో కన్నీటి తర్పణ చేస్తూ
దిక్కుతోచక, ఏకాకులమై, ఏకప్రాణంలో తిరిగి వస్తే,
'రావడానికి రెండు రోజులు పట్టిందా, మూడు రోజులు పట్టిందా' అని
మా మోహమ్మీద బేరీజు వేసే కాకుల పొడుపుల మధ్య అంత్యేష్టి చేసే మేము.
అవునండి మేము సగటు ఎన్నారైలం!
పెళ్ళిళ్ళకి, పండగలకి, పబ్బాలకి
సరదాలు, విందులు మీకైతే,
కంట నీరు తెప్పించే
గడిచిన రోజుల స్మృతులు,
ఏకాంత దుర్దినాలు మాకు.
శరీరాలు ఇక్కడే ఉన్నా,
మా తలపులు అన్నీ అక్కడే.
గుండె బద్దలు చేసే బాధని,
లోపల దాచేసుకొని
నవ్వుతూ video కాల్లో మాట్లాడే మేము,
అవునండి మేమే, సగటు ఎన్నారైలం!
మేమూ మనుషులమే
మా కాళ్ళకి డెక్కలు,
మా నెత్తికి కొమ్ములు లేవు.
మాది కూడా నెత్తుటి గుండే.
మాటల తూటాలకి,
మాటలు లేని శ్మశాన నిశాబ్దానికి
చలించే దాని రోదన,
మా ముఖ పుస్తక ఖాతాల్లో
మీకు కనిపించదు, వినిపించదు.
పల్లెలొదిలి పట్నాలు పట్టిన వెనకటి తరాల వారసులం.
అవునండి మేము సగటు ఎన్నారైలం!
ఎవరూ అడగని, కోరని చిరుతిళ్ళు,
ఏవో చిన్న బహుమతులు మోసుకొచ్చి,
'మాకూ గంధం రాయండి' అనే
అమాయక చక్రవర్తులం.
రేలంగి డాబుతో
రాజబాబు తింగరితనం తో
ఉన్న నాలుగు సెలవలూ అక్కడ గడిపి
ఓ గంపెడు జ్ఞాపకాలు పోగేసుకొని,
వాటిలో ఆనందించే
గవ్వలేరుకున్న పిల్లలం.
అవునండి మేము సగటు ఎన్నారైలం!
'ఇంత బాధతో ఎక్కడో ఎందుకు'
'నిజమే! వెనక్కి వచ్చేయొచ్చు.
పెట్టీ, బేడా, పిల్లా, పీచు సర్దేసుకొని,
సొంత ఊరిలో కలో గంజో కాచుకుంటూ
కాలం కర్మం కలిసి వస్తే
మళ్ళీ సున్నా నుండి
ఆట మళ్ళీ మొదలుపెట్టొచ్చు. '
ఈ వలస జీవితాన్ని ఎలా ముగించాలో,
కొత్త బ్రతుకుని ఎలా గీసుకోవాలో అనే
తలపుల కెరటాల్లో నిత్యం ఈదులాడే మేము
అవునండి మేము సగటు ఎన్నారైలం!
'ఇంత బాధతో ఎక్కడో ఎందుకు'
'ఎందుకు కాదు!
నచ్చినట్టు ఉండే హక్కు
మాకూ ఉంది.
మీ బతుకులను మేము శాసించం,
మా జీవితాలు మమ్మల్ని బతకనివ్వండి,
కులం మాత్రమే చూసి అవకాశాలు,
పేరు చూసి ఉద్యోగాలు,
డబ్బుతోనే గౌరవాలు ఇవ్వని చోట్లో ఉండాలనుకునే మేము!'
అవునండి మేము కూడా సగటు ఎన్నారైలం!
ఒక చిరునవ్వు, ఒక దీవెన
ఒక పలకరింపు,
కొంచం ఆప్యాయత, ఆదరణ
కుదిరితే మానవత్వం.
ఇవి మాత్రమే కోరుకునే మమ్మల్ని
మీరు నలుగురు కలిసే వేళ
ఎప్పుడో ఒకప్పుడు కొంచం గుర్తు చేసుకొండేం!
రెంటికీ చెడబోతున్న రేవళ్ళం, వలస పోయిన హంసలం,
దూరమనే మంచుకప్పిన చంద్రులం
ముమ్మాటికి, ఎప్పటికీ మీవాళ్ళం.
అవునండి మేము సగటు ఎన్నారైలం!