Tuesday, April 25, 2023

మాయా పంచకం - 2: పండితులందు ధనాది విషయ మోహము

పండితులందు ధనాది విషయ మోహము  

ఒక విషయము, వస్తువు యొక్క సత్యాసత్య నిర్ధారణ చేయుటకు పలు విధములయిన ప్రమాణములు గలవు.


ప్రత్యక్షము - ఇంద్రియాలకి కలిగిన అనుభవముల వలన కలిగిన జ్ఞానము ప్రత్యక్ష ప్రమాణము. నేను నా జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకున్నాను కావున దానిని అంగీకరిస్తున్నాను అనడం ప్రత్యక్ష ప్రమాణము.

అనుమానము - అనుభవయిన ఒక వస్తువు బట్టి, వేఱొక వస్తువు యొక్క జ్ఞానం కలగడం అనుమాన ప్రమాణం. యత్ర  యత్ర  ధూమః  తత్రాగ్ని: -  పొగ కనబడిన ప్రతీ చోట నిప్పు ఉండడంతో, పొగ ఎక్కడ ఉన్నా, అక్కడ నిప్పు ఉంది అని అనుకోవడం.

ఉపమానము – ఒక వస్తువు యొక్క పోలిక  గురించిన జ్ఞానం తో, ఆ వస్తువు ని గుర్తించడం లేదా  అనుభవంలోకి తెచ్చు కోవడం.

శబ్దము - ఆప్తులు, మనం నమ్మినవారు, మనం గౌరవించేవారు చెప్పిన మాటను యదార్ధం అని నమ్మడమే శబ్ద ప్రమాణం. వేదాలు శబ్ద ప్రమాణాలు.

అర్థాపత్తి - తెలియని ఒక విషయాన్ని, తెలిసిన మరొక విషయం బట్టి తెలుసుకోవడం. ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం కానీ అనుమాన ప్రమాణం కానీ  ఉండవు. Circumstantial proof.

అనుపలబ్ధి  - ఒక వస్తువు యొక్క అభావం బట్టి తెలుసుకున్న జ్ఞానం. "ఘటము లేదు; కనబడం లేదు కదా " - అంటే ఘటం ఉంటే అది కనబడేది - అనుపలబ్ధి  ప్రమాణం లేక అభావ ప్రమాణం.


వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ ఒక వస్తువు పై వెలుగు పడేసరికి, ఆ వస్తువు యొక్క నీడ కల్పింపబడుతోంది కదా. మరి నీడ అంటే చీకటే కదా. వెలుగు వలన చీకటి ఎలా ఉత్పన్నమవుతున్నదో, మాయా శక్తి మనలో అవిద్య, అజ్ఞానము కల్పించుచున్నది.

అజ్ఞానము అంటే ఏమిటి? లేనిది, ఉన్నట్లు భావించడము లేదా చెప్పడము అజ్ఞానము. ఉన్న దానిని తెలుకోలేకపోవుట అవిద్య.

లౌకిక పరిభాషలో 2 x 2 = 10 అని అనడము అజ్ఞానము. 2 x 2 = 4 అని తెలుసుకోలేకపోవుట అవిద్య.  చంద్రుడు నల్లగా ఉన్నాడు అనడము అజ్ఞానము.

అటులనే అనిత్యమయిన ఈ ప్రపంచము నిత్యమని భావిస్తూ, ఇందు గల విషయములపై భోగాసక్తి పెంచుకొని, వాటి యందు రమించడమును కూడా అజ్ఞానము అని చెప్పవచ్చు కదా? ఇది ఎండమావి యందు గల నీటిని తాగబూనుకోవడం వంటి విషయమే కదా?

ఒక విషయము సంభవించినది, ఒక వస్తువు అక్కడ ఉన్నది. కానీ ప్రత్యక్ష, అనుమాన, శబ్ధ ప్రమాణముల చేత మనము దాని నిర్ధారణ చేయలేకపోవుచున్నాము.

ప్రత్యక్షము గా కానీ, అనుమానము తో కానీ, కనీసం శబ్ధ ప్రమాణము కానీ లేకుండా, ఒక ఘటన ఎలా ఘటిల్లగలదు? అదే అఘటిత ఘటన.

మాయా ప్రభావము!

శృతి శత నిగమాంత శోధకనపి అహహ ధనాదినిదర్శనేన   సద్యః

కలుషయతి  చతుష్పదాద్యభిన్నాన్ అఘటిత ఘటనా పటీయసి  మాయా!

శృతులు, నిగమములు, వేద వేదాంతములను శోధించి, వాటి సారము అంతా గ్రహించిన విజ్ఞానులు కూడా, ధనము, కీర్తి, యశస్సు వంటి వాటిని చూసిన వెంటనే చతుష్పదముల (పశువుల) కన్నా అభిన్నముగా లేకుండా, వాటి వలనే కలుషత్వమును పొంది ప్రవర్తించుచున్నారే!ఆహాహా! ఈ అఘటిత ఘటన మాయ యొక్క ప్రభావము.

ఒక విషయము పై, లేదా వస్తువు పై జ్ఞానము కలిగినది అంటే దాని పై అజ్ఞానము పోయినది అని అర్థము. ఏ విషయము యొక్క పూర్వాపరములు, సత్యాసత్యాములు, సంభవాసంభవాములు, నియములు, దాని పరిమితులు కూలంకుషముగా తెలిసియుండటమే జ్ఞానము.

‘నాకు ఈత కొట్టడము తెలుసు, కానీ ఈదలేను’ అని ఒక గజ ఈతగాడు చెప్పగలడా? అలా చెబితేవాడు ఆ విషయములో అజ్ఞాని అని కదా అర్థము. కానీ వాడి గజ ఈతగాడు అంటున్నారే!

శృతి శత నిగమాంత శోధకాన్

శాస్త్రజ్ఞానము గలవాడు, పండితుడు అయిన వాడు దానిని ఆచరించి చూపవలెను.  అలా కానీ పక్షములో అటు వంటివానికి ఆ శాస్త్ర సారము తెలియలేదు అని అర్థము. లేదు సారము తెలిసినది కానీ దానిని ఆచరించుటలేదు అని అర్థము. అటువంటప్పుడు ఆ పాండిత్యానికి అర్థం ఉంటుందా? దాని కన్నా శాస్త్ర విషయముల సాధన గొప్పది కాదా? ఖచ్చితముగా సాధనే ముఖ్యము. కేవలము శాస్త్ర విషయములు వల్లె వేయడం వలన వనగూరేది ఏమీ లేదు. వాటిని ఆచరించాలి. అదే ‘నహి నహి రక్షతి డుకృణ్ కరణే!

జ్ఞానము గొప్పా?లేదా కర్మ, భక్తి గొప్పవా? ఈ మూడిటి లోనూ ఏది శ్రేష్టము?

నదిని దాటటానికి మూడు పడవలు ఉన్నాయి. ఆవలి ఒడ్డుకు చేరడానికి ఏదో ఒక పడవ ఎక్కితే సరిపోతుంది. మూడు పడవలలో ఏది గొప్పది అన్న ఆలోచనలో కాలయాపన చేస్తే ఈవలి గట్టునే ఉండిపోతాము. మరి ఇది సంసార సాగరము. దీని దాటటానికి  కర్మ, భక్తి, జ్ఞానములనే పడవలలో ఏదో ఒక్క పడవని పట్టుకొని ప్రయాణము చేయాలి. ఆ ప్రయాణములో ఒడిదుడుకుల నుండి నేర్చుకోవాలి. చేసిన తప్పులను నుండి పాఠములు గ్రహించి, వాటిని మరలా చేయకుండా పడవని నడపాలి. అదే సాధన.

కానీ ఈ ప్రపంచములో ఈ  ‘శృతి శత నిగమాంత శోధకాన్’ ఎలా ప్రవర్తించడం చూస్తున్నాము?

ధనాదినిదర్శనేన చతుష్పదాద్యభిన్నాన్ సద్యః కలుషయతి 

వేదాంతము - ‘దేహము నువ్వు కాదు. దేహము వేరు. ‘నేను’ (ఆత్మ) వేరు. దేహము నిత్యము కాదు. దేహము ఉన్న ఈ ప్రపంచము కూడా నిత్యము కాదు. ఈ ప్రపంచములో ఉన్న మిగిలిన దేహాములు కూడా నిత్యములు కాదు. చైతన్యములయిన దేహములే నిత్యములు కానప్పుడు, అచేతనములు అయిన వస్తువులు నిత్యములు కానేరవు. అనిత్యములు సత్యములు కాలేదు.  కాబట్టి అట్టి అనిత్య, అసత్య వస్తువుల పై ఏ విధమయిన ఆపేక్ష అయినా దుఃఖహేతువే. కాబట్టి వాటిని నిమిత్తములుగా మాత్రమే చూసి జీవించు’ ఇత్యాది బోధలు పరిపరి విధములుగా చేస్తుంది. జ్ఞానము గలవారికి అందరికీ ఈ వాక్యములు చిర పరిచతములే. మనము కూడా ఈ విషయములు పలు మార్లు విని ఉంటాము.

ఈ దేహమే ‘నేను’ (ఆత్మ) అనుకోవడమే దేహాధ్యాస. ఈ అధ్యాస అక్కడ ఆగదు. ఈ దేహానికి గుణ ధర్మములు కల్పించి, వాటిని ఈ ‘నేను’ కి ఆపాదిస్తాం. ‘నేను పొట్టివాడిని’,’నేను పొడుగు వాడిని’ ,’నేను వంటవాడిని’,’నేను పురుషుడుని’, ‘నేను స్త్రీ ని’ లాంటివి. ఇది దేహధర్మాధ్యాస.   

ఈ గుణ, రూప విశేణములు ఈ శరీరానికి సంబంధించినవే కానీ, ‘నేను’ కి వీటికీ ఎటువంటి సంబంధము లేదు. ‘ఆ నల్ల రంగులో ఉన్నది నా కలము’ అని అంటున్నప్పుడు మనం ఆ కలము యొక్క రూప విశేషము చెబుతున్నామే  కానీ, మన విశేషణము కాదు కదా!

ఈ దేహాధ్యాస చాలా గడుసయినది. ఈ దేహమే ‘నేను’ అన్న భ్రాంతి నమలో చాలా లోతుకి పాతుకుని ఉంటుంది. ఎందుకంటే పుట్టినప్పటి నుండి, మన చుట్టూ ఉన్నా ప్రపంచము మనతో అలా ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి. అటువంటి అజ్ఞాన స్థితిలో ఎటు వంటి మార్పు లేకుండా  జ్ఞానము కలుగలేదు.

ఒక ఆవుకి ఇంత గడ్డి వేస్తే, ఆ వేసిన వాడిపై దానికి కొంత నమ్మకం, క్రమముగా మమకారం పెంచుకుంటుంది. ఒక శునకాన్ని  చేరదీస్తే, అది ఆ చేరదీసిన వాడిపై విశ్వాసముగా ఉంటుంది. కర్ర తో అదిలిస్తే, కొడితే అదే జంతువు క్రోధముతో తిరగబడుతుంది. ఈ పశువుల రాగద్వేషాలు, ప్రవర్తన అంతా బయట ప్రపంచం వాటి పై చూపించే వస్తువులపై ఆధారపడి ఉంటుంది. శాస్త్ర విజ్ఞానులు కూడా ధనాది భోగ విషయముల పై, వాటిని కల్పించే వారిపై,  ఈ పశువుల వలనే రాగద్వేషముల చూపించుచున్నారు. ఈ జ్ఞానుల ప్రవర్తన అజ్ఞానమయముగా ఉండటం అఘటిత ఘటనే కదా! ఈ ఘటన మాయ యొక్క బలీయమయిన శక్తి వల్లనే కదా!

వేదవిహితములయిన కర్మాచారణము భగవంతుని పై నిరంతర ధ్యాస కలుగుతుంది. అదియే  భక్తి. ఆ భక్తి ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ పై సర్వస్వ శరణాగతిగా మారుతుందో అదే జ్ఞానము.


ఒక వ్యక్తి యందు సాధన లేని జ్ఞానము ఒక గోడ లా నిలబడి, సత్యము తెలియలేకుండా చేస్తుంది. జ్ఞానము గలవారు మౌనముగా ఉండటం అరుదుగా చూస్తాము. ఆ జ్ఞాన్ని బహిర్గతము చేయాలనే అభిలాష ఉంటుంది. ఆ ప్రవర్తన వారిని ఆత్మావలోకనము నుండి, లోపలి శాంతి భావన నుండి దూరము చేస్తుంది. ఎప్పుడైతే ఆ శాంతి  స్థితి ఉండదో, వారిలో జ్ఞాన సారము క్షయమవుతుంది. వారి జ్ఞానమే వారికి అవరోధముగా నిలుస్తుంది. అందుకే మౌనము, ధ్యానము అలవాటు చేసుకోవాలి.  సర్వ విద్యలకు నిధి అయిన ఆ దక్షిణామూర్తి కూడా చేసేది మౌన వ్యాఖ్యే కదా. 

No comments: