తెలుగు సాహిత్యం అంటే సినిమా సాహిత్యం, తెలుగు సంప్రదాయం అంటే సినిమాలలో చూపించించే సంప్రదాయం, పురాణేతిహాసాలు అంటే సినిమా కథలు - అన్న భావం గత ఒకటి, రెండు దశాబ్దాలలో పుట్టిన వారికి ఉన్నదేమో అనిపిస్తుంది. ఇది పూర్తిగా నేను, నా చిన్న పరిధి లో చూసిన విషయం మాత్రమే.
ఇప్పటి తెలుగు యువతకు పుస్తకాలు, అందులో తెలుగు పుస్తకాలు చదివే అవకాశం, సావధానం ఎంత వరకు ఉన్నాయో తెలీదు. అచ్చు వేసిన పుస్తకాలు అమ్ముడిపోవడం లేదు అని ఈ మధ్య ఒక పుస్తక ప్రచురణ కర్త రాసిన వ్యాసం లో వాపోయాడు.
దృశ్య శ్రవణ మాధ్యమాలు, రాజకీయ, కుల, ప్రాంత, భావ విభేదాలు దీన్ని మరింత జఠిలం చేసాయేమో అనిపిస్తుంది.
తెలుగు సాహిత్య పూర్ణేందు చంద్రికను అందుకున్న చకోరకమరుగునే సాంద్ర నీహారములకు !!
రాయప్రోలు
ఏ ప్రఫుల్లపుష్పంబుల నీశ్వరునకు
పూజ సల్పితినో యిందు పుట్టినాడ !
కలదయేని పునర్జన్మ కలుగుగాక
మధురమధురంబయిన తెన్గు మాతృభాష.
రాళ్ళపల్లి ఆనంతకృష్ణ శర్మ
పండి తెల్లబాఱు వరితోటలను జూచి
యేల మొగము వంచి యేడ్చెదమ్మ?
చూడు జనుపచేను సొగసెక్కెనరిదళం
బలదుకొన్న యాటవెలది వోలె.
పోతన
అచ్చపుఁ జీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్టులై
చచ్చుచుఁ బుట్టుచున్ మరలఁ జర్వితచర్వణు లైన వారికిం
జెచ్చరఁ బుట్టునే పరులు చెప్పిన నైన నిజేచ్ఛ నైన నే
మిచ్చిన నైనఁ గానలకు నేఁగిన నైన హరిప్రబోధముల్.
నన్నయ్య
అక్కట యమ్మహారణమునందు వియచ్చరకోటితోడ బే
రుక్కున బోరి యేను మృతినొందగ నేరన అట్టులైన నీ
తక్కువబాటు లేక ప్రమదంబున దైవపదంబు నొందెడిన్
మిక్కిలియైన కీర్తియును మేదినియందు వెలుంగు నిత్యమై!
సారపు ధర్మమున్ విమలసత్యము బాపముచేత బొంకుచే
పారము బొందలేక చెడబారినదైన యవస్థ దక్షు లె
వ్వారలుపేక్ష సేసి రది వారల చేటగు గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్
వేటూరి ప్రభాకర శాస్త్రి
ఆటంబాంబుల బీటవారినది బ్రహ్మాండంబు సద్భావమే
మోటైపోయెను పంచశీలపథకమ్ముల్ దుమ్మువట్టెన్ దురా
శాటోపంబులు హద్దుమీరినవి పోరాటమ్మె ఆరాటమై
లూటీచేసిరి మానవత్వమును ఆలోకింపు లోకప్రభూ!
విశ్వనాథ సత్యనారాయణ
కుణుకుణుకుణుకుణుక్వణనమ్ము లొనరింపఁ
గవ్వించు బంగరుమువ్వలగమి
కిణకిణకిణకిణస్వనములు వెలయింప
జిలుగురత్నాల గజ్జియలపేట
ఘణఘణఘణఘణధ్వనులు పంచారింప
నెఱినగిషీల యందియలజంట
ధణధణధణధణ ధ్వానమ్ము లొలయింప
కలుపుకేల్జత హొన్నుగంటలసడి
యదుకులోద్యానకేకి నాట్యమ్ముచేసె
నందగర్భసరోహంస నడలునెఱపె
నెమ్మి నాట్యమాడెను యశోదమ్మకొడుకు
అంచనడకలు నడచెఁ గ్రిష్ణమ్మగారు.
కవియిత్రి మొల్ల
ఈ పద్యాలు శర్మ గారు చక్కగా అభినయించి, ప్రతి పదము పట్టి పట్టి చదివి, చదివిస్తే ఎవరికోసం గుర్తుండవు ఎన్ని దశాబ్దాలయినా! ఆయన మా స్కూల్ లో సోషల్ స్టడీస్ టీచర్ ! :)
కదలకుమీ ధరాతలమ కాశ్యపిబట్టు ఫణీంద్ర భూవిషా
స్పదులనుబట్టు కూర్మమ రసాతల భోగిడులీ కులీశులన్
బెదరక బట్టు ఘృష్టి ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచుపట్టుడీ కరులు భూవరుడీశుని చాప మెక్కిడున్
ఇనవంశోద్భవుడైన రాఘవుడు భూమీశాత్మజుల్ వేడ్కతో
దను వీక్షింప మునీశ్వరుండలర కోదండంబు చేబట్టి చి
వ్వన మోపెట్టి గుణంబుబట్టి పటుబాహాశక్తితో దీసినన్
దునిగెన్ జాపము భూరి ఘోషమున వార్ధుల్ మ్రోయు చందంబునన్
గుఱ్ఱం జాషువా గారి వర్ణించిన భస్మ సింహాసనం!
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని యధికారముద్రిక లంతరించె!
యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూసలసౌరు,గంగలోఁగలిసిపోయె!
యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్నచిత్రలేఖకుని కుంచియ,నశించె!
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె
గదలించి యాడు రంగస్ధలంబు;
ఇది మరణదూత తీక్షమౌ దృష్టులొరయ
నవనిఁ బాలించు భస్మసింహాసనంబు
వేమన
కాశి కాశి యనుచుఁ గడువేడ్కతోఁ బోదు
రందుఁగల్గు దేవుఁడిందు లేఁడె
యిందు నందు గలఁడు హృదయంబు లెస్సైన
విశ్వదాభిరామ వినర వేమ.
శేషప్ప కవి
తల్లిగర్భము నుండి ధనము తేఁ డెవ్వఁడు - వెళ్లిపోయెడినాఁడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్నమె కాని - మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు
విత్త మార్జనఁ జేసి విఱ్ఱవీఁగుటె కాని - కూడఁబెట్టిన సొమ్ము తోడరాదు
పొందుగా మఱుఁగైన భూమిలోపలఁ బెట్టి - దానధర్మము లేక దాఁచి దాఁచి
తుదకు దొంగల కిత్తురో దొరల కవునో - తేనె జుంటీఁగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
శ్రీ శ్రీ
నీ మోవికి కావిని నేనై
నా భావికి దేవివి నీవై
నీ కంకణ నిక్వాణంలో
నా జీవన నిర్వాణంలో
ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
ప్రపంచమును పరిహాసిస్తాం
భవిష్యమును పరిపాలిస్తాం.
నండూరి వేంకట సుబ్బారావు
జాము రేతిరి ఏళ జడుపు గిడుపూ మాని
సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటె
మెల్లంగ వస్తాది నా యెంకీ!
సల్లంగ వస్తాది నా యెంకీ!
పచ్చన్ని సేలోకి పండు యెన్నెలలోన
నీలి సీరాగట్టి నీటు గోస్తావుంటె
వొయ్యోర మొలకించు నా యెంకీ!
వొనలచ్చి మనిపించు నా యెంకీ!
యెంకి వస్తాదాని యెదురూగ నేబోయి
గట్టుమీదా దాని కంటి కాపడగానె
కాలు కదపాలేదు నా యెంకీ!
కరిగి నీరౌతాది నా యెంకీ!
---
యేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి
మల్లీ ఎప్పటల్లె తెల్లారబోతుంటె
సెందురుణ్ణీ తిట్టు నా యెంకీ!
సూరియుణ్ణీ తిట్టు నా యెంకీ!
తెలుగు సాహిత్య క్షీరసాగరం నుండి వెల్లువడిన తుంపర లోని ఒక చిన్న బిందువు లోని అణువు ఇది.
ఇలాంటివి ఎన్నో, ఎన్నెన్నో! ఎంతమంది తమ రచనాపుష్పాలతో తెలుగు భాషని పుష్టిపరిచారో! ఆ సాహిత్య పల్లెరములో నవరసభరిత ఫలాలు ఎన్నో!
సశేషమే, ముగింపు కాదు.
1 comment:
మా పొలం లో నేను చిన్నప్పుడు తిన్నా, చెరుగు గడ లో నీ "ఆ తీపి" మాధుర్యాన్ని గుర్తొచ్చేలా చేసారు..!!
"ఎందరో మహానుబా'వులు - వాళ్లే మా తెలుగు క'వులు"
Post a Comment