'సరే బావ.. తిథి వారాలు ఖరారు చేసి చెప్పు' అన్నాను.
ఈ యాత్ర కి పెట్టిన సెలవాలు సరిపోవాయె. సరే. కొన్ని రోజులు సొంత దేశం నుండే పని చేస్తా అని ఉద్యోగ దేశం లో చెప్పాను.
ఈ లోపే ఇంకొక వార్త - ' మనం వెళ్దామనుకున్న సమయానికి కార్తీక మాస ఉత్సవాలు ఉంటాయి. అరుణాచలం చాలామంది భక్తులతో కిక్కిరిసి ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో అక్కడ బస, దర్శనం ఏర్పాట్లు చేయడం కుదరదు' అని.
గాలి తీసేసిన బుడగలా ఐపోయాను.
అమ్మ, నాన్న కొన్ని సంవత్సరాల ముందు అరుణాచలం వెళ్లారు. అరుణాచలం గుడిలో దర్శనం అయిన తరవాత 'నేనింక బయటకి రాలేను' అని అమ్మ గదిలో నీరసించి పడుకుండిపోతే, ఎవరో వచ్చి 'పడుకోవడం ఏమిటి. బయటకి పద' అని గద్దించినట్టు అనిపించిందంట. ఎక్కడ లేని శక్తి వచ్చి లేచి, తయారయి, గిరి ప్రదక్షిణ చేసి, రమణాశ్రమం, విరూపాక్ష గుహ అన్నీ చూసుకొని, ఆశ్రమంలో కొంత సేపు ధ్యానం చేసుకొని తిరిగి వచ్చారు అంట ఇద్దరూ.
"వంశీ, నువ్వు అరుణాచలం చూడాలి రా" అని అమ్మ అంటూ ఉండేది. అమ్మతో ఆ యాత్ర భౌతికంగా చేసే అదృష్టానికి నన్ను దూరం చేసి ఆ గౌరీ లోకానికే ళ్ళిపోయింది 2019 లో.
2017 నుండి తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవాలి అని నా కోరిక. కోరిక ఒక్కటి ఉంటే సరిపోదు. ఆయన ఆజ్ఞ, అనుగ్రహం కూడా ఉండాలి కదా. గత సంవత్సరంగా ఈ తపన బాగా ఎక్కువయ్యింది. ఇంటి దగ్గర ఉన్న కోవెల్లో స్వామి వారి నిలువెత్తు విగ్రహం చూసిన ప్రతీసారి కొండ మీద ఆయన మూల విరాట్టుని చూసినంత ఉపశమనం కలిగేది. ఎన్నిసార్లు మానసికంగా తిరుమల యాత్ర చేసినా, ఆ దర్శన కాంక్ష పెరుగుతూనే ఉంది.
అరుణాచలం వెళ్ళడం అవదు అని తెలిసిన తరవాత, రవి బావ తో 'సరే నవంబరులో ఎప్పుడైనా నీకు తిరుమల వెళ్ళే ఉద్దేశం ఉంటే, నాకు కూడా చెప్పు' అన్నాను, covid కారణం గా ఏమైనా ఆంక్షలు, నిషేధాలు ఉంటే వాటిని స్వామి వారే చూసుకుంటారులే అనుకుంటూ.
'నవంబరు 23న అరుణాచల కార్తీక దీపోత్సవం అంట, కాబట్టి 24న అరుణాచలం వెళ్ళి, తరవాత రోజు తిరుమలలో నిజ రూప దర్శనం అవుతుందేమో చూస్తాను' అన్నాడు.
ఆ మాట వినగానే నాకు ప్రాణం లేచి వచ్చింది.
ఈ లోపు ఇంకొక మార్పు 'COVID నిబంధనలు తమిళ నాడులో సడలించారు. శని, ఆదివారాలు కూడా కోవెలలు తెరిచి ఉంచుతారు. కాబట్టి ముందు 25 Nov నిజరూప దర్శనం, 26 Nov అరుణాచలం, 27 Nov తిరుగు ప్రయాణం. మొత్తం యాత్రకి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసేశాను'.
మరింకెటువంటి మార్పులు లేకుండా అనుకున్న తేదీకి రేణిగుంటలో తెల్లవారే దిగి, తిరుమలకి బండి మాట్లాడుకొని, కొండ మీదకి చేరుకున్నాం.
కొండమీద భక్తుల రద్దీ తక్కువగా, వాతావరణం చాలా ఆహ్లాదంగా, నా మనస్సు స్వామి వారి దర్శనం ఎప్పుడా అన్న ఉత్సుకతతోను ఉన్నాయి.
రాత్రి 8కి దర్శనం. తిరుమల మాడ వీధులలో నడుస్తూ 'స్వామీ! ఇంత దగ్గరలో ఉన్నా, నీ దర్శనం కోసం ఇంకా కొన్ని గంటలు ఆగాలి కదా' అని అనుకున్నా.
బేడీ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని, ఆయన ఎదురుగా కొబ్బరి కాయ కొట్టి, మిగిలిన భక్తులు సమర్పించిన కర్పూర కానుకలతో నిలువెత్తు దీపాపుసమ్మెల లో వెలుగుతున్న హారతిలో నా కర్పూరం కూడా కలిపాను.
'త్రిగుణాత్మకమయిన మాయా ప్రభావం చేత, వివిధ నామ రూపములతో ఈ జగన్నాటకం నడుస్తున్నా, అందులో ఉన్నది ఒకే పరబ్రహ్మ స్వరూపం. నామరూపగుణభేధాలు అన్నీ ఆయన ముందు ఒకటైపోతాయి.'
స్వామివారి దర్శనం కోసం రాత్రి వరకు 8 వరకు ఆగలేక, సాయంత్రం నాలుగింటికే వైకుంఠం q లోకి వెళ్లిపోయాం. నామస్మరణ చేసుకుంటూ, ప్రతిమా మండపం దాటి, ధ్వజ స్తంభం, బలి పీఠం పక్క నుండి వెళ్తూ, ఆ రెండిటికీ ప్రదక్షిణం చేసుకొని, గరుడ సన్నిధి లోనికి వెళ్ళాం. నిజరూపం లో ఉన్న స్వామి వారికి దివ్య నామాలు కానీ, నల్లటి శరీరం కానీ, కట్టుకున్న పట్టు పుట్టం కానీ కనిపించలేదు. ఆయన అభయ హస్తం ఒక్కటే దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించి, నా మనో ఫలకంలో ముద్రితమైంది. ఆయన సన్నిధిలో ఉన్నది కొద్ది క్షణాలైనా, సముద్రం లో ఉవ్వెత్తున ఎగుస్తున్న కెరటాలు ఒక్కసారిగా ఆగిపోయిన ప్రశాంతత. ఆయన తప్ప ఇంకేమీ లేదు నాలో అప్పుడు.
చంచలమయిన, పాశబంధమైన మనస్సులో ఆయన అభయ హస్త ముద్ర ఎంత సేపు ఉంటుంది! విమాన ప్రదక్షిణం చేసుకొని, స్వామి వారి హుండీ దగ్గరకి వచ్చేసరికి అది అస్పష్ట రూపమయి, యోగ నరసింహ స్వామి వారి ఆలయం దాటే టప్పటికి ఒక వెలుగు ముద్దగా మాత్రమే మిగిలింది. ఆనంతాన్ని అరచేతిలో పట్టడం ఎవరికి సాధ్యం? బయటకి వస్తున్న దారిలో అర్చక స్వామి ఇచ్చిన ప్రసాదం తీసుకొని, కొంచం ముందుకు వచ్చిన తరవాత దానిని కళ్లకద్దుకొని తీసుకున్నాం.
మాకు ప్రసాదం ఇచ్చిన అర్చక స్వామి మా వైపు ధనాశతో చూస్తుంటే, ఆ బ్రహ్మాండనాయకుని సేవకుడు ఒక సామాన్యుడిని అడుగుతున్నాడేంటి అని మనస్సు చివుక్కుమన్న నేను, స్వామి వారి దర్శనం టిక్కెట్ల కోసం ప్రాబల్యం వాడి, ధ్వజస్తంభం ప్రదక్షిణ కోసం సిబ్బందికి డబ్బులు ఇచ్చిన మా మిథ్యాచారం గుర్తొచ్చి నవ్వుకున్నా!
పిండంతే నిప్పటి! బావి వద్దకి ఎంత పెద్ద పాత్ర తీసుకొని వెళ్తే, అన్ని నీళ్ళు తెచ్చుకోవచ్చు. పాత్ర ఎంత శుద్ధం గా ఉంటే, ఆ తెచ్చుకున్న నీళ్ళు అంటే శుభ్రంగా ఉంటాయి.
నేను తపించిన స్వామివారి దర్శనం తృప్తినిచ్చిందా? ఎన్నిసార్లు తోడితే సముద్రం ఎండుతుంది? ఎన్ని సార్లు, ఎంత సేపు ఆయన సన్నిధిలో ఉంటే ఆ తృప్తి లభిస్తుంది? ఆలయంలో ఉన్న అర్చక స్వాములు, అక్కడ పని చేస్తున్న స్వచ్చంద కార్యకర్తలు, పోలీసు సిబ్బంది ఎన్నెన్ని జన్మల పుణ్యం చేశారో!
క్షణకాల దర్శనానికి ఎన్ని నెలల, సంవత్సరాల నిరీక్షణో. ఈ జన్మకి ఈ క్షణ కాల దర్శనమే ప్రాప్తం. పోనీ అదైనా కలుగుతోంది. మళ్ళీ వచ్చే జన్మలో ఎక్కడో, ఏ రూపం లోనో! ఈ లోపే ఇంకో 'పునర్దర్శనం' కోసం దిగులు పడుతూ కొండ దిగుతూ ఉంటే, 'అలాగే! ప్రాప్తిరస్తు ' అని దీవిస్తున్నాడా అన్నట్టు దాసాంజనేయ విగ్రహం. తిరుపతి చేరుకొని, అక్కడ నుండి వెళ్ళిన అరుణాచలం విశేషాలు ఇంకెప్పుడైనా!

No comments:
Post a Comment