ఇది నిండా రెండు పుటలు ఉన్న కథ.
ఇందులో ఒక తాతగారు తన మనవడు మనవరాళ్లను దగ్గర కూర్చో బెట్టుకొని పెళ్ళయిన కొత్తలో ఒక రోజు తాను వర్షం లో తడిసిన విధానం, అతని ఆస్వాదన, వర్షంలో కృష్ణా నది, పరిసరంలోని వివిధ పొలాలు, ఆ వాసనలు గురించి చెబుతారు. కథ చదువుతూంటే సరిగ్గా అటువంటి వర్షాలలో తడిసిన చిన్ననాటి రోజులు ఎన్నో గుర్తుకొచ్చాయి.
ఆ వర్షం వలన బురదలో ఇరుక్కుపోయిన తన పాత చెప్పులు ఇప్పిన వెంటనే, భూమిపై ప్రవహిస్తున్న ఆ వర్షపు ధారలో చల్లబడిన తన కాళ్ళతో నిలుచొని - 'వరె వరె! అప్పుడనిపించిందిరా ! గంగమ్మ ఈ భూమీనంతటినీ చల్లబరుస్తుంటే, నేను చల్లబడక ఈ పాత చెప్పు లడ్డంపెట్టుకున్నానా' అంటాడు. ఎంత చక్కని, స్వచ్చమైన, అమాయకపు భావన.
పట్నం గుమస్తాగారి కూతురైన తన కొత్త పెళ్ళాం ఆ వర్షం లో ఏ ఇబ్బంది పడుతోందో అనుకుంటూ ఇంటికి చేరిన అతనికి - 'దొడ్డి చివర ఆరుబయట కృష్ణ వైపు తిరిగి నుంచొని కన్పించింది. వర్షం కృష్ణ లో కలుస్తూంటే, కృష్ణ వర్షంలో కలుస్తూంటే, వర్షం లో తాను కలిసిపోయి, చేతులు విప్పార్చి తలమునకలుగా హాయిగా తడుస్తోంది' అన్న వాక్యంతో ముగుస్తుంది.
ఈ ఆఖరి వాక్యం తో వారిద్దరిదీ అన్యోన్య దాంపత్యం అన్నది యవనిక వెనక ఉన్న విషయం ఏమో అని నాకు అనిపించింది. అది శ్రీ రమణ గారి అప్పదాసు, బుచ్చిలక్ష్మిల dynamics అంత అందంగా ఉంటుందేమో!
No comments:
Post a Comment