Tuesday, March 30, 2010

వంశీ కతలు - భూతాలంటే భయం పోయింది

చిన్నప్పుడు నాకు చీకటి అంటే చాలా భయం. ఇంచుమించు కాలేజీ కి వెళ్ళే వయస్సు వరకు ఆ భయం ఉండేది. ఐతే భయం దేనికంటే చీకటి లో ఏవో తెలీయని భయానక జీవులు, భూతాలూ, దెయ్యాలు ఉంటాయి అని. జీ హర్రోర్ షో పుణ్యమా అని ఈ భయం పెరిగింది. పెరుగుట విరుగుట కొరకే అని సామెత. మరి నాకు భూతాలంటే భయం ఎలా పోయింది?

పూర్ణమ్మ తన జీవితం లో చాలా ఆటుపోటులు తిని రాటుదేలి పోయిన మనిషి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు పుట్టిన తరవాత, ఆ పెద్ద కుటుంబాన్ని దిక్కు లేనిది గా చేసి వెళ్ళిపోయాడు ఆ పెనిమిటి. గొప్పింటి కోడలు గా ఉండాల్సిన ఆమె దాయాదుల వాళ్ళ ఆస్తి పోగొట్టుకొని వీధిన పడింది. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చివరికి విశాఖపట్నం చేరి,  పెళ్ళిళ్ళలో వంటలు చేసే పనిలో దూరింది. అప్పటికి ఇంకా కేటరింగ్ పోరు మొదలు అవ్వలేదు వంట వాళ్లకి. పెద్ద పెద్ద వాల్లిల్లలో పెల్లిలకి వంట వాళ్ళని పిలిపించుకొని వంటలు చేయించుకోవటం, కార్యక్రమాలు అయ్యినంత వరకు వారి ఇళ్లలోనే ఉండటం ఉండేది. వంటలలో చెయ్యితిరిగిన మనిషి కావటం తో పూర్ణమ్మ కి పెళ్లి పిలుపులు బాగానే వచ్చేవి. పెళ్ళిళ్ళ సీజన్లో అయిపోయినా ఉన్న కాసింత డబ్బు తో సాగిపోయేది ఇల్లు. అలానే పిల్లలని చదివించింది. అందరు పిల్లల కన్నా చిన్న వాడు రామం అంటే చాలా ప్రేమ ఆ తల్లి కి. ఆ ప్రేమ వల్లనేమో వాడికి చదువు అబ్బలేదు, అపారామైన తెలివి తేటలు. చదువులలో సున్నా. పది దాటటానికి మూడేళ్ళు పట్టింది.

పూర్ణమ్మ కి వయస్సు మీదకి రావటం తో చూపు తగ్గింది. కేటరింగ్ కొత్త వింతలూ రావటం తో పాత వంట రోత అయ్యింది జనాలకి. రామం తప్ప కొడుకులు అందరు మంచి ఉద్యోగాల్లో స్తిరపడ్డారు వారి సంసారాలతో. కూతుర్లకి కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది. ఎవరికి వారు జీవితాలలో busy అయ్యారు. అమ్మని మర్చి పోయారు.
మిగిలిన డబ్బు, కొడుకు రామం తో తను కొనుకున్న ఊరు చివరి పెంకుటింటి కి మారింది పూర్ణమ్మ. రామం కి వయస్సు తో బాటే వ్యసనాలు ఎక్కువయ్యాయి. వాటికి డబ్బులు అమ్మ నుండి రాక పోవటం తో ఒక రోజు  దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీ లో ఉద్యోగం సంపాదించుకొని వచ్చాడు. పూర్ణమ్మ కూడా కొడుకు ప్రయోజుకుడు కావటం తో కొంచం కుదుట పడింది. తీర్థయాత్రలకి బయలేదేరి  సంపూర్ణ భారత దేశ యాత్ర ముగించింది.ఇల్లు అమ్మి తన దగ్గరకి వచ్చేయ్యమన్న  పెద్ద కొడుకు ని, చిన్న కూతురుని  కాదని, తన ఆఖరి కొడుకు బాగోగులు చూసుకోవటం కోసం వాడి దగ్గరే ఉంది పోయింది.


పది సంవత్సరాలు గడిచాయి. క్రమంగా విశాఖపట్నం విస్తరించింది. ఊరు చివర ఉన్న మధురవాడ పట్నం హోదా ని పొందింది. కిరాన కొట్లు పోయి  షాపింగ్ మాల్స్ వచ్చాయి. ఎలెమెంటరీ స్కూల్స్ కన్నా ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువయ్యాయి. ఒక్క రోడ్డు ఉండే NH 5, నాలుగు రోడ్డులు గా పెరిగింది. రియల్ ఎస్టేట్ లావాదేవీల తో ఇళ్ళ ధరలకి రెక్కలు వచ్చాయి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు తాగుడు కి బలిఅవటం తో ఒంటరిగా మిగిలి పోయింది చూపు బాగా తగ్గిన పూర్ణమ్మ.

కొడుకు మరణించిన సంవత్సారానికి ఒక్కసారిగా పూర్ణమ్మ ఇంటికి హడావిడి పెరిగింది. పది సంవత్సరాలు గా రాని కొడుకులు కూతుర్లు రాసాగారు. ఇంటి చుట్టూ పక్కల వాళ్లకి పరిచయం చేసింది వాళ్ళని. పెళ్ళి కుదిరిన  కూతురు కూతురుని, మనవరాలి ని పెళ్లి చేసుకుంటున్న కొడుకు కొడుకు ని  చూసుకొని మురిసిపోయింది పూర్ణమ్మ. పెళ్లికి అని విజయవాడ లో కూతురి ఇంటికి వెళ్ళింది. పెళ్లి ఘనం గా అయ్యింది. విజయవాడ ఎండలకి పూర్ణమ్మ ఆరోగ్యం పాడయింది. పెళ్ళైన ఇంట్లో ఆవిడకి ఏమైనా జరిగితే మంచిది కాదు అని చిన్న కూతురు తల్లి ని తీసుకొని బయల్దేరింది వైజాగ్ కి. గోదావరి ట్రైన్ లో  ఆ రాత్రి  గోకవరం దాటిన తరవాత బాత్ రూం కి వెళ్ళిన పూర్ణమ్మ తిరిగి రాలేదు.

ఒంటరిగా వైజాగ్ వచ్చిన కూతురు  మళ్లీ  సాయంత్రం గోదావరి కి బయలుదేరి వెళ్ళిపోయింది. మరుసటి రోజు పేపర్ లో 'గోదావరి బ్రిడ్జి మీద గుర్తు తెలీని వృద్దురాలి శవం' అని వార్త. ఈ వార్తా వచ్చిన వారం రోజుల లోపలే దిక్కు మొక్కు లేని పూర్ణమ్మ ఇల్లు పుంజుకున్న రియల్ ఎస్టేట్ పుణ్యమా అని  10 లక్షలకి అమ్ముడి పోయింది. కోడలి మెడలో కొత్త నెక్లేసు చూసుకొని మురిసి పోయింది  పెద్ద కోడలు, పూర్ణమ్మ దశ దిన కర్మలు ఆ  గోదావరి బ్రిడ్జి కింద అవుతుండగా.



ఒక మనిషి కి అపకారం చెయ్యటానికి దెయ్యాలు, భూతాలూ, అదృశ్య శక్తుల అవసరం లేదు. మనిషి కి మనిషే భూతం. కనీసం భూతాలూ ఒక్కసారి అయినా గతం లో మనుషులు గా ప్రవర్తించాయి ఏమో. అందుకే నాకు భూతాలంటే భయం పోయింది. ఇప్పుడు కొందరు మనుషులని చూసి పట్టపగలే  జడుసుకుంటున్నా.

2 comments:

james said...

finally chadivanu...sry 4 d delay...

coming to the comments...
its simple,concept is good and can be narrated in a better way for sure...u might have added one or more paras to bring in more feel (which is more essential for stories like these)...as a first attempt its a nice try, but im sure u can do more better in penning down these stuff...i understood tht u wanna put it briefly n so shortened the things...next time im expecting much better one from you...

Unknown said...

Loved the way the story(reality) is presented..human emotions put across in a touching way..plz keep writing.