"వేద మూలమిదం బ్రాహ్మ్యం
భార్యా మూలమిదం గృహం
కృషి మూలమిదం ధాన్యం
ధనమూలం ఇదం జగత్ !"
ఒక వేద పండితుడు కన్న కొడుకుని విప్లవ భావజాలానికి , ఆస్తిని సాటి వారి దురాశ కి కోల్పోయి, గర్భవతి అయిన కోడలితో పల్లె నుండి పట్టణానికి వస్తాడు. మిడి మిడి జ్ఞానం ఉన్నవారు, ధనార్జనే ధ్యేయం గా ఉన్నవారు అక్కడ రాజ్యం ఏలుతుంటారు. ధనం లేని అతని వద్ద ఉన్న జ్ఞానం, శాస్త్రం, ఆ పట్టణం లో ప్రకాశించవు.
ఎవ్వరూ తీసుకోని తిల దానాన్ని పుచ్చూకుంటూ, శవ వాహకుడిగా, దశ దిన కర్మల్లో దానం పుచ్చూకునే వాడి గా జీవనం సాగిస్తూ ఉంటాడు - 'తిలాదానం సుబ్బయ్య'.
ఈసడించే సాటి బ్రాహ్మలు, డాబుని తప్ప పాండిత్యాన్ని గుర్తించలేని సంఘం, రోజూ పలకరించే దరిద్రం - ఆ పట్టణం లో ఆ పండితుడికి చుట్టూ అలుముకున్న చీకట్లు.
మనవడు పుడితే చెయ్యాల్సిన నవ గ్రహ శాంతి ని "నువ్వు అంత ఎక్కడ పెట్టుకోగలవు సుబ్బయ్యా !" అని ఆక్షేపించే వారే గాని, జరగాల్సిన క్రతువు మీద ఎవ్వరూ దృష్టి పెట్టారు. 'తిల దానం సుబ్బయ్య' చెప్పే తిథి వార నక్షాత్రాల లెక్కలకి విలువ ఉండదు. ఆయన చెప్పే 'మెరిక' నిజం గా ఉందా అని ఆరా తీసి (సొంతం గా ఆ లెక్కలు చూసే జ్ఞానం లేక), అప్పుడు కానీ 'సుబ్బయ్య' పాండిత్యం తెలుసుకోలేరు.
సుబ్బయ్య హోమం పూర్తి చేసి, అగ్నిహోత్రానికి దక్షిణలు ఆహుతి ఇవ్వబోగా ఈయన గొప్పదనం తెలుసుకున్న మిగిలిన వారు వఛ్చి, 'సుబ్బయ్య గారు' అని సంభోధించి, దక్షిణ తీసుకోవడం - ఒక మంచి పర్యవర్తనలా అనిపిస్తుంది .
కానీ - పోలీస్ కాల్పులలో కొడుకు మరణించాడు అన్న వార్త సుబ్బయ్య ని బలి తీసుకుంటుంది. ఒక అనుష్టానపరుని పార్థివ కాయాన్ని మునిసిపల్ బండి లో తీసుకొని వెళ్లడం కంట నీరు తెప్పిస్తుంది. సంఘం అతనిని దరిద్రం వల్లన వెలి వేసింది అని ఆ దృశ్యం చెప్పకనే చెబుతుంది.
తీవ్రవాది గా లొంగి పోయిన భర్త కి రావాల్సిన ప్రభుత్వ నజరానా , అతని స్నేహితుడు తీసుకొని పోగా, ఆ సొమ్ములు కోసం ఎదురుచూస్తూఉంటుంది ఆ కోడలు రెండేళ్లు గా!
అగ్ర కులాలు, నిమ్న కులాలు - జన్మ, జాతి రీత్యా ఏర్పడవు అని; ధనం మాత్రమే జాతులని ఇప్పుడు నిర్ణయిస్తోంది. ధనం కోసం మనుషులు ఎటు వంటి పాపానికి అయినా, శాస్త్రోల్లంఘన కి అయినా పాల్పడతారు. ధనం లేని గుణవంతుడు కన్నా, గుణం లేని ధనవంతుడు గౌరవింపబడతాడు.
"యస్యాస్తి విత్తం స నరః కులీనః స పండితః సః శ్రుతవాన్ గుణజ్ఞః
స యేవ వక్తా స చ దర్శనీయః సర్వే గుణాః కాంచన మాశ్రయంతి "
- భర్తృహరి
ఎవని వద్ద ధనం ఉంటుందో , అట్టి వాడే మంచి కులమున పుట్టినవాడు, పండితుడు, శాస్త్రం తెలిసినవాడు, వక్త , చూడ చక్కని వాడు. బంగారాన్ని ఆశ్రయించుకొనే అన్ని మంచి గుణములు ఉంటాయి.
"రాజవత్పుత్ర దారాశ్చ స్వామివన్మిత్రబాంధవాః
ఆచార్యవత్సభా మధ్యే భాగ్యవంతం స్తువంతి హి"
భార్యా పిల్లలు రాజు వలెను, మిత్రులు, బంధువులు అధికారి వలెను, సభామధ్యమున ఆచార్యుని వలెను, భాగ్యవంతుడిని గౌరవిస్తారు.
No comments:
Post a Comment