Saturday, March 24, 2018

Jai Sri Ram!




బోల్డంత నిజం లో కొన్ని ఊహలు కలిసిన జ్ఞాపకాల దొంతర 

"ఒక పని చెయ్యడానికి అనుమతి అడగవద్దు , అవసరం ఐతే తరవాత క్షమాపణ అడుగు" అని ఈ మధ్య చదివిన ఒక పుస్తకం లో ఒక వాక్యం.

"ఈ సమస్త సృష్టిని నాశనం చేసి , యధా ప్రకారం మళ్ళీ సృష్టి చెయ్యగలను " అని శ్రీ రాముల వారి ఉవాచ, రామాయణం లో ఒక చోట.

ఇంక చదవండి.

గతం

అనగనగనగా ఒక పెద్ద పట్టణం. ఆ పట్టణానికి ఒక్క ఇరవై మైళ్ళ అవతల  ఒక చిన్న పల్లె గా మారుతున్న ఒక అడివి. ఎక్కడెక్కడి పక్షుల్లో తూఫానులు తరుముకుంటూ రాగా, ఆ చిన్న పల్లె లో కాందిశీకులు గా  గుడిసెలలోకి చేరాయి. ఆ పక్షులు తమ తో పాటూ తమ తమ దేవతలని తెచ్చుకొని , వాళ్ళని ఏకం చేసి గ్రామ దేవత గా ఒక్క చెట్టు కింద పెట్టి, జ్వరాలకి, జలుబులకీ , కరువులకీ, వరదలకీ, పాము కాట్లకీ, వానల మోతలకి , ఆఖరికి  మొగుడు పెళ్ళాల దెబ్బలాటలకీ  ఆ శక్తి కే పూజలు చేసేవి. ఎప్పుడో వచ్ఛే సర్కారు రేషను సామాను, అక్కడక్కడా వచ్ఛే కూలి పనులు కడుపులు నింపగా, ఎప్పుడూ దొరికే వారుణి వాహిని ఒంటిని , ఇంటికి పీల్చి పిప్పి చేసేది. అక్కడి నేల సారవంతం అవడం వలన, ఏ మొక్క వేసినా అది విరగ కాసేది.

ఆ గుడిసెల లో ఒక పెద్ద గుడిసె కట్టి, దాని మీద సిమెంట్ తో  చేసి వెల్లవేసిన సిలువ ఒకటి పెట్టి, పిల్లలకి బయటి నుండి వచ్చిన బట్టలు ఇచ్చి , పెద్దవారికి ఒక్క గుప్పెడు బియ్యపు గింజలు మూట కట్టి , ప్రతీ రోజు సాయంత్రం ప్రార్థనలు చేసేవాడు తూ గో  జిల్లా నుండి వచ్చిన శామ్యూల్. అలసిన కొన్ని వలస పక్షులకి ఆ చర్చి కడుపు నింపింది. నిండిన కడుపు మనస్సు మార్చింది -  కొందరి పూజలు చెట్టు కింద అనాది గా నమ్మిన శక్తి ని కాదని నుండి ఖండాలు దాటి వచ్చ్చిన కొత్త దేవుడి కి  మారాయి. దేవుళ్ళు వేరైనా ఆ పక్షులను వారి పేదరికం, పడుతున్న కష్టాలు, కుటుంబ  నేపధ్యాలు కలిపి ఉంచాయి.

సర్కారు వారి ఆలోచన ఆ అటవీ ప్రాంతాన్ని తగ్గిస్తూ, ఒక పెద్ద గృహ సముదాయాన్నితెచ్చింది.  కట్టిన ఇళ్లలోకి మధ్య తరగతి కుటుంబాలు దిగాయి.వారి సామాన్లతో పాటు, వారి వారి కష్టాలు, సుఖాలు, భయాలు, నమ్మకాలు, ఆచారాలు, వ్యవహారాలు, నెలవారీ ఖాతాలు తెరిచేందుకు కిరాణా కొట్లు కూడా అక్కడ చేరాయి. కొత్త ప్రదేశం, పైగా అటవీ ప్రాంతం - ఒకే రకం ఐన అవసరాలు వారి మధ్య అనుబంధాల్ని పెంచితే , పలు రకాలైన ఆలోచనా ధోరణలు  అప్పుడప్పుడు చిట్టి తగాదాలని తెచ్చి, మధ్య తరగతి మందహాసాన్ని కలిసి ఆస్వాదించేలా చేసాయి.

అటవీ ప్రాంతం కావడం వలన ప్రతీ ఋతువు స్పష్టం గా తెలిసేది. వింత వింత పువ్వులు, పళ్ళు , పెద్ద పెద్ద సీతాకోక చిలుకలు,వానా కాలం లో దారి అంతా  నింపేసే కప్పలు, వాటి వెనక పాములు. పట్టణం నుండి కొత్తగా అక్కడికి వచ్చిన  వారికి అంతా ఒక విచిత్ర లోకం గా అనిపించేది.

శామ్యూల్ జరిపే ప్రార్థనలు వింతగా ఉండేవి ఈ కొత్త పక్షులకి. ఆ దేవుడు సిలువ మీద చనిపోయాడు అని అందరూ కలిసి ఏడిచేవారు ఆ పెద్ద  గుడిసెలో. వారి కోరికలు, కష్టాలు, సుఖాలు అన్నీ కూడా ఏడుస్తూనే చెప్పుకునే వారు ఆ చర్చి లో.  ఆ మధ్య తరగతి కుటుంబాలకి ఆ వ్యవహారం అర్థం అవకపోయినా , అన్నిటికీ సర్దుకుపోయి  కలిసిపోయే మనస్తత్వాలు, ఆ ప్రార్థనలని పెద్దగా పట్టించుకునేవి కాదు. ఎవరి దారి వారిదే .

రోజులు గడుస్తున్నాయి. ఎండా కాలం. పిల్లలకి పరీక్షా కాలం. అదే సమయం లో కొత్త గా ఒక మైక్ సెట్ వచ్చింది. ప్రార్థనల జోరు, గొంతు  పెరిగాయి. తల్లి తండ్రులు అందరూ కలిసి ఆ నెల రోజులు కొంచం ధ్వని తగ్గించమని అడిగారు. ఏమీ మార్పు లేదు. రేపు పరీక్ష ; ఒక పక్క దుమ్ము లేపుతున్న ప్రార్థనలు. ఈ సారి తల్లుల గొంతు పెరిగింది. శామ్యూల్ మైక్ శబ్దం తగ్గింది.

కొన్ని నెలల తరవాత వచ్చింది వినాయక చవితి. ఆ అడివి లో మొదటి సారి గా చవితి సంబరాలు. పువ్వులకి, పత్రికి లోటు లేదు. ఆ వెంటనే శరన్నవరాత్రులు. పూజలు, లలితా పారాయణలు, భజనలు, ప్రసాదాలు, ఊరేగింపులు, నిమజ్జనాలు  - మహా వైభవం గా చేసుకున్నారు. అయినా ఎదో వెలితి.

కార్తీకం  - ఆ పల్లె కి వెలుపల గా ఉన్న అమ్మవారి కోవెల కి దగ్గరగా చిన్న శివాలయం వెలిసింది. ఇంకెక్కడో , ఎదో తెలియని లోటు.

నెమ్మదిగా ఆ పల్లె కి పట్టణపు వాసనలు తగులు తున్నాయి. కంకర రహదారి, రోజుకి రెండు సార్లు వచ్ఛే ప్రభుత్వ రవాణా వాహనాలు, పెద్ద కొట్లు  గా మారుతున్న చిల్లర కిరాణా కొట్లు. అయినప్పటికీ పూర్ణ చంద్రుడిని మేఘాలు కమ్మేసి, ఆ వెన్నెల పూర్తి గా రానట్టుగా ఉంది ఆ పల్లె పరిస్థితి.

చలి కాలం దాటుతోంది. ప్రార్థనల జోరు పెరిగి, ఉపన్యాసాలు జరుగుతున్నాయి. మైక్ సెట్ కి పని బాగా ఎక్కువ అయ్యింది. ఒక రోజు ఉపన్యాసం లో వక్త హైందవ ఆచార వ్యవహారాలపైనే, దేవతల పైన ఘోరమైన వ్యాఖ్యలు చేస్తే, ఇళ్లల్లో ఉన్న కర్రలు , చీపుర్లు, చేటలు  పట్టుకొని వెళ్లారు వాటిని ఆపడానికి. శామ్యూల్ కి తను  ఒక హద్దు దాటాను అని తెలిసింది. అయినా మేకపోతు గాంభీర్యం తో అందరినీ సర్ది చెప్పి సాగనంపాడు.

శివరాత్రి కి ఇంకా వారం ఉంది అనగా, చలి మంటల పొగ తో పాటు , రోడ్డు  పక్కన ఖాళీ స్థలం లో చర్చి కట్టబోతున్నారు అన్న వార్త (గాలి వార్తా? ఏమో !) పల్లె అంతా  వ్యాపించింది. అప్పటికే మైక్ సెట్ గొడవ వలనా , విపరీత ఉపన్యాసాల వలన చిరాకుతో ఉన్న కుటుంబాలకి దిక్కు తోచలేదు. గట్టి గా ఎదిరించడానికి అడ్డువచ్ఛే మధ్య తరగతి ఆలోచనా ధోరణి. అక్కడ చర్చి పక్కా గా తయారు ఐతే, ఆ గోల ఎక్కువ అవుతుందే కానీ, తగ్గదు. అన్ని మతాలవారు ఉన్న ఆ సముదాయం లో,  వారికి ఉన్న ఇబ్బంది ఆ మతం వాళ్ళ కాదు. ఆ చర్చి నడుస్తున్న తీరు పట్ల. అందరు కలిసి ఆలోచించారు  - అంతంత మాత్రం గా ఉన్న పోలీసులు, అస్సలు పంచాయతీ కూడా కానీ పల్లె,  ప్రభుత్వం వారి గోడు వింటుంది అని కానీ,  ఎవరో వచ్చి ఎదో చేస్తారని కానీ నమ్మకం లేదు.   కిమ్ కర్తవ్యమ్!

ఎవరిలో వచ్చిందో తెలీదు కానీ ఒక  మాట - 'మనమే ముందు గా ఆ స్థలం లో ఏదో ఒకటి కట్టేస్తే ...  ఏదో  ఒక గుడి కట్టేస్తే!?' రాత్రి కి రాత్రి విగ్రహాలు భూమి లో పాతేసి, పగలు తవ్వి తీద్దామా? ఒకరి ఆలోచన, స్వయంభూ ఆలయం కట్టడానికి.  ఎవరో సర్ది చెప్పారు  - మరీ సినీ ఫక్కీ గా ఉంది కానీ మామూలు విగ్రహాలు పెడితే ఎలా ఉంటుంది అని.
కానీ గుడి అంటే మాటలా - అసలే నెల జీతగాళ్ళు, అందులో అప్పుడప్పుడే వారికి కేటాయించిన ఇల్లను బాగు చేయించుకుంటూ ఉన్న డబ్బులు పెట్టేసారు.  గుడి ఎక్కడ కట్టగలరు? అదీ ఆ చాలా తక్కువ సమయం లో!


కలిసి ఆలోచించారు మళ్ళీ. వెలిగింది ఒక దివ్యమైన ఆలోచన - 'రామాలయం!' ప్రతీ పల్లె లోను రామాలయం ఉంటుంది. ఈ ఊరి లో లేదు. అదీ వెలితి. రాముడు అందరి వాడు. సులువుగా అందుతాడు. పెద్దగా హంగు ఆర్భాటం అవసరం లేదు. కొందరు వెళ్లి పట్టణం నుండి తెచ్చేసారు - చక్కగా ఉన్న శ్రీ సీతా రామా లక్ష్మణ హనుమ మట్టి విగ్రహాలని. మరి కొందరు వెళ్లి ఇటుకలు, సిమెంట్, ఇసుక దండారు. కొందరు సరుగుడు కర్రలు ఇచ్చ్చారు. మంచి పని చెయ్యడానికి ముహుర్తాలు అవసరం లేదు అని - మరుసటి రోజు రాత్రి ఆ ఖాళీ స్థలం లో 5 X 4  దిమ్మ కట్టి , దాని మీద రాముల వారి విగ్రహాలు పెట్టేసారు. ఉదయానికి అక్కడ రెండు వెలుగు తున్న దీపపు సమ్మెలు, అగరు ధూపాలు. "రామాలయం! మా రామాలయం!" అని పొంగిపోయాయి అక్కడి వారి మనసులు, పౌర్ణమి నాటి సముద్రం లా. అక్కడే  రెండు ఆవులు కాసుకుంటూ, జంధ్యాలు వొడుకుతున్న బ్రాహ్మణుడికి రోజు పూజలు చెయ్యమని చెప్పారు. జీతం భత్యం ఏమీ లేదు.

రాత్రికి రాత్రి వఛ్చిన ఆ కోవెల కోసం తెలిసిన వారు ఆ రోజూ అంతా చాలా ధైర్యం తో , కొంచం భయం తో గడిపారు. గృహ సముదాయం చూసే ఆఫీసర్ వఛ్చి, అక్కడ కట్టిన దిమ్మని చూసి వెళ్ళిపోయాడు. రోజులు వారాలు అయ్యాయి. రాములవారిని కదిపే ఆలోచన ఎవ్వరికి రాలేదు.

నెమ్మది గా దిమ్మకి , పైన చిన్న స్లాబ్ పడింది, చిన్న గేట్ వచ్చింది. మొదటి శ్రీ రామ నవమి కి దాని ముందుకి ఒక నాలుగు స్తంభాలు, పైన తాటి పందిరి. ఆ కళ్యాణం అయిన సాయంత్రం, అడ్డంగా కట్టిన షామియానాల వలన ఆ స్తంభాలు పడిపోయాయి. కార్యక్రమం అయిపోయిన తరవాత కాబట్టి ఎటు వంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగ లేదు. జై శ్రీ రామ్!

ఈ లోపు ఆ పల్లె కి కొంచం లోపలగా చర్చి కట్టారు. శామ్యూల్ పిల్లలు బడి కి వెళ్లడం మొదలు అవ్వడం తో , మైక్ సెట్ కి గొంతు బాగా తగ్గిపోయింది. ఒక్క ఆదివారాలు తప్ప.

కోవెల కట్టాలి అని ఆలోచన వెలిగించింది మనిషా, లేక రాముడా? అక్కడ ఏ బడో , ఇంకేదో కట్టే ఆలోచన రావొచ్చూ గా?

తమ కుటుంబాలకి ఏమీ కానంతవరకు బయట పడని మనుషులు, ఒక్క త్రాటి మీద నిలిచి కోవెల కట్టారు అంటే, వారి సంకల్పానికి దైవ ప్రోద్బలం లేదు అంటారా?

ఆకులు నెమరు వేసే  గొంగళి పురుగులు లా బతికే మధ్య తరగతి మనుషుల్లో ధైర్యం నింపి, వారి గుండెల్లో ఉన్న లోటు రామాలయం రూపం లో తీర్చినది  రాముడు కాదు అంటారా?

"పలికెడిది భాగవటమట,
పలికించేది విభుండు రామభద్రుడట, నే
పలికిన భవ హరమగునట,
పలుకగ వేరొండు గాథ, నే పలుకగనేల!"

కాల చక్రం తిరిగింది. పేరు లో పల్లె మిగిలింది కానీ పూర్తి గా పట్టణం లో కలిసిపోసాగింది. రాజకీయ నాయకులూ ఓట్లకోసం వస్తే, కొంతమంది కుటుంబాలు వారిని కోవెల కోసం అడిగాయి. ఆధ్యాత్మికత కొంచం ఉన్న నాయకుడు, సిమెంట్, ఇనుము, ఇసుక ఇస్తాను అన్నాడు గుడి కట్టడానికి. చందాలు వసూలు చేశారు. 5 X 4 దిమ్మ మీద ఉన్న రాముడు , తనకి ఒక చక్కని కోవెల కట్టించుకున్నాడు. మేమే  కట్టామని కొందరు అనుకున్నారు. వారిని చూసి నవ్వుకుంటూ, తన ప్రతిష్టాపన చేయించుకున్నాడు రఘు వీరుడు!

ఇంచుమించు అటువంటి సహకారమే అందిన లోపల చర్చి కూడా పెరిగి , పక్కనే ఒక బడి కట్టుకుంది.


వర్తమానం


వలస పక్షుల పాకలు పక్కా ఇల్లుగా మారాయి.  వారు పూజించే శక్తి చెట్టు కింద నుండి, ఒక చిన్న కోవెల లోకి చేరింది. మధ్య తరగతి మూడు గదుల ఇల్లు, మూడు అంతస్తులు గా మారాయి.   ఇప్పుడు ఆ పల్లె ఒక్క చిన్న పట్టణం. రెండు పెద్ద స్కూళ్ళు , మూడు ఇంజనీరింగ్ కళాశాలలు,  డబల్ రోడ్, అపార్టుమెంట్లు, ఒక సూపర్ స్పెషలిటీ హాస్పిటల్, ఒక పెద్ద  చర్చి ఆర్గనైజషన్  - పోల్చ లేనంతగా మారింది ఊరు.

జనాలు మారారు, కొత్త నీరు వచ్చింది, పాత నీరు కొంత ఆ రాముణ్ణి నమ్ముకొని అక్కడే ఉండిపోయింది.  రామాలయం లో భక్తి తో పాటు, రాజకీయం కూడా చేరింది. మాయ కమ్మింది. అహంకారాలు పెరిగాయి. నీటి బుగ్గ లాంటి జీవితాలు గడుపుతూ "అంతా మాదే, అన్నీ మేమే"అంటున్నారు,  సాంప్రదాయానికి నీళ్లొదిలి. 


సృష్టి , స్థితి , లయ కారకుడు ,  ఆది మధ్యాంత రహితుడు అయిన శ్రీ రాముడు ఈ మార్పులు అన్నింటిని చిద్విలాసంగా నవ్వుతూ చూస్తున్నాడు.  ధర్మ సంస్థాపన కి ఇంకా సమయం ఉంది కదా !




ప్రతీ సంవత్సరం ఉగాది, వసంత నవరాత్రులు. పెద్ద ఎత్తున జరిగే శ్రీ రామ కళ్యాణం. అంతవరకూ రాని భక్తులు, రామ నవమి కి మాత్రం తండోపతండాలుగా వచ్చి , తలా ఒక చేయి వేసి, అంగరంగ వైభవం గా జరుపుతున్నారు.

సత్సంకల్పం తో పాటు దైవ శక్తి తోడు ఐతే, మనిషి ఏదైనా సాధిస్తాడు అన్నది నాకు గుర్తు చేస్తూనే వుంటుంది ఆ కోవెల నేను ఆ 'పల్లె' కి వెళ్లిన ప్రతీ సారి!

"తన్మే మనః శివ సంకల్పమస్తు !"

1 comment:

Satya ani said...

చాలా బాగుంది. ఆద్యంతం చదవాలన్న కుతూహలం కలిగింది. రచయిత భాష పటిమ మరియు అవగాహనా కప్రశంసనీయం.కళ్ల కి కట్టి నట్లు రాసారు.