Monday, May 17, 2021

దశ పూర్వేషామ్ దశాపరేషామ్

ఇది కేవలం వైదిక సాంప్రదాయాలను పాటించే కుటుంబాల కోసం మాత్రమే. వైదిక సాంప్రదాయాలు అన్నాం కాబట్టి ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కోసం మాత్రమే అని వేరే చెప్పనవసరం లేదు. పిల్లలు తమకు తాముగా  చేసుకున్నపెళ్లిళ్లకు ఇవి వర్తించవు. వాటి కొలమానాలు వేరే ! అలాగే వేద నిందనాస్తికత్వ భావనసాంప్రదాయాలను పాటించని వారికి  కూడా ఇందులో చెప్పిన విషయాలు ఏవీ వర్తించవు.

ఇంటికి కోడలిని కానీ, అల్లుడిని కానీ తెచ్చుకునేటప్పుడు అటు ఏడు తరాలు, ఇటు ఏడు  తరాలు చూడమని తెలుగు నాట నానుడి. తరాలు చూడమంటే కేవలం వారికి ఉన్న ఆస్తులు, అంతస్తులు చూడమనో, లేక వీరి 'తాహత్తు' కు తగిన విధంగా పెళ్లి కార్యక్రమం, దానికి సంబంధిన ముచ్చట్లు  చేయగలరో లేదో, లేకపోతె ఇంకేవో లౌకిక వ్యవహారాలు నప్పుతాయో లేదో  చూడమని మాత్రమే  కాదు. ఇటు వీరికి ఉన్న ఆచార వ్యవహారాలూ, సంస్కృతీ సాంప్రదాయాలు అటు వారికి ఉన్నాయో లేదో కూడా చూడమని.


నిత్యానుష్టానం లో కానీ, ఇతర వైదిక కార్యక్రమములలో ఇంటికి కాబోయే అల్లుడు లేదా కోడలు నిష్ఠ తో పాల్గొనగలరా? ఈ ఇంట్లో జరుగుతున్న వైదిక క్రియలలో వారు పాలలో చక్కర కలిసినట్టు కలుస్తారా, లేకపోతే 'ఆచమనం చెయ్యమంటే స్నానం చేస్తారా'? Do they support your daughter or son in fulfilling their sanatana duties? ఈ విషయాన్ని ఆ పెళ్లి సంబంధం కుదిర్చే మధ్యవర్తులు కానీ, లేక ఇంటి పెద్దలు కానీ ఎంతో ఆలోచించాలి. 

ఒకవేళ ఈ ఇంటి సంతానానికి అటువంటి వాటిలో ఆసక్తి లేక, అటు కూడా అటులనే ఉంటే - వారికి నమో నమః! వారి వారి బ్రతుకులని అలాగే గడవనివ్వండి.  

అలా కాని పరిస్థితిలో చాలా అనర్ధాలు జరుగుతాయి. ఇవి కంటికి కనిపించక పోవచ్చును. కానీ ఇరు కుటుంబాల వారిని ఎంతో మానసిక క్షోభకి గురి చేస్తాయి. ఎందుకంటే వివాహానంతరము, వారిరువురు కలిసి , పరస్పరావగాహన తో పాటించ వలసిన నియమాలు, చేయవలిసిన కార్యక్రమాలు ఉంటాయి. 

అది జరగని నాడు - ఆ వధువు లేక వరుని యొక్క స్వకీయ సాధన సంపత్తి నశిస్తుంది. దాని వలన ఆ ఇంట్లో దైవీ సంపద సన్నగిల్లుతుంది. దైవీ సంపద లేనప్పుడు ఆస్తి పాస్తులు ఏవీ కూడా ఆ ఇంటిలో సంతోషాన్ని నింపలేవు. సంతోషం నిలువని ఇంట ఎంత సమృద్ధి ఉన్నా ఏమి లాభం?

తలంబ్రాలు పోసినప్పుడు వధూవరులు  కోరుకునే  ''ప్రజామే కామ సమృద్ధ్యతాం" , "పశవో మే కామ సమృద్ధ్యతాం", "యజ్ఞోమే  కామ సమృద్ధ్యతాం", "శ్రియోమే కామ సమృద్ధ్యతాం" , "యశోమే కామ సమృద్ధ్యతాం" ఇంకెక్కడ?

"The thought processes of the man and woman who are getting married will not be in sync, the practices of the elders in either of the families will not be in sync which leads to the two families to not be in sync. What purpose does such a marriage achieve? It is not only about the physical needs of two people. How will that marriage achieve the noble intents that get called out in the vaidika vivaaha prakriya?"


ఈ భూమండలము నుండి ....

సప్తర్షి మండలం వరకు ప్రోగుపడిన గంగాతీర ఇసుక రేణువుల రాశి నుండి (సంవత్సరమునకు) ఒకొక్క రేణువు చప్పున  తగ్గగా , ఆ రాశి అయిపోవడానికి ఎన్ని వేల సంవత్సరములు పడతాయో  

సూర్య మండలం వరకు ప్రోగుపడిన నువ్వుల గింజల నుండి (ప్రతీ సంవత్సరమునకు) ఒకొక్క నువ్వుల గింజ చప్పున  తగ్గగా , ఆ రాశి అయిపోవడానికి ఎన్ని వేల సంవత్సరములు పడతాయో  

గ్రహ మండలం వరకు ప్రోగుపడిన యవలు (బార్లీ లాంటి / వడ్ల గింజలు కూడా కావొచ్చు) నుండి ఆ ధాన్యపు గింజలు (సంవత్సరానికి ) ఒకొక్కటిగా  తగ్గగా, ఆ రాశి అయిపోవడానికి ఎన్ని వేల సంవత్సరములు పడతాయో 

ధ్రువ మండలం వరకు ప్రోగుపడిన మినప గింజలు సంవత్సరానికి ఒక్కొక్కటి గా తగ్గగా, ఆ రాశి అయిపోవడానికి ఎన్ని వేల సంవత్సరములు పడతాయో 

నూరు క్రోశల దూర దేశము నందు ఎద్దు వెంట్రుకల ప్రోగు నక్షత్ర మండలం వరకు ఉండగా, ఆ రాశి నుండి సంవత్సరానికి ఒకొక్క వెంట్రుక తగ్గి, అది అయిపోవడానికి ఎన్ని వేల సంవత్సరములు పడతాయో 

అన్ని వేల సంవత్సరములు నాకు బ్రహ్మ లోక నివాసం సిద్దించాలి అని,

అగ్నిష్టోమ , అతిరాత్ర, సాంతవన, వాజపేయి, పౌండరీక, అశ్వమేధాది శతక్రతుపుణ్యఫలముల కంటే మూడు రేట్లు ఫలము కలగాలి అని ,

నాతో కూడి ముందు ఉన్న పది తరాలు, నా తదుపరి పది తరాలలోని  పితురులు నరకం నుండి ఉద్ధరింపబడి, 

శాశ్వత బ్రహ్మ లోక నివాసం సిద్ధించాలి అని, 

నా గృహములో ఉన్న సాంప్రదాయం ప్రకారం, బాగుగా అలంకరింపబడిన ఈ కన్య ను, హిరణ్య , ఉదకములతో గూడి దానం చేయుచున్నాను.

ఎంత మహత్త్వపూర్ణమయిన కన్యాదాన  సంకల్పం అది.

“… గంగా వాలుకాభి  సప్తర్షి మండల పర్యంతం కృతరాశే ర్వర్ష సహస్రావసానే ఏకైక వాలుకాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సమ్మితకాలే బ్రహ్మలోకే నివాస  సిద్ధ్యర్ధం

తిలై సూర్య మండల పర్యంతం  కృతరాశే ర్వర్ష  సహస్రావసానే  ఏకైక తిలాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సమ్మిత కాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం

యవైర్ గ్రహ మండల పర్యంతం  కృతరాశే ర్వర్ష  సహస్రావసానే  ఏకైక యవాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సమ్మిత కాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం

మాషై ధ్రువ మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక మాషాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సమ్మిత కాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం

పంచాశద్గవ్యూతి  గణనా సమ్మిత దేశే వృషలోమభిర్నక్షత్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక లోమాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ  సమ్మిత కాలే  బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం

త్రిగుణీకృతాగ్నిష్టోమాతిరాత్రాప్తోర్యామ సాంతవన  వాజపేయ పౌండరీకాశ్వమేధాది                           శతక్రతుపుణ్య ఫలావాప్యర్థం

మయా సహ దశ పూర్వేషామ్ దశాపరేషామ్ మద్ వంశ్యానాం సర్వేషామ్ పితౄణాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మ లోక నివాస సిద్ధ్యర్థంస్వగృహోక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యామహాదానం కరిష్యే 

వివాహ సమయంలో ఈ సంకల్పం విని, అర్థం చేసుకునే తీరిక ఎక్కడ ఉంటుంది ఈనాటి కన్యాదాతకి? ఆయన దృష్టి పెళ్ళికి వచ్చిన వారి మర్యాదలు మీదనో, పక్కన జరుగుతున్న విందు భోజన ఏర్పాట్లమీదనో, వియ్యాలవారిలో ఎవరు ఎందుకు అలుగుతారో అన్న బెంగ లోనో! 

చెప్పి, వివరించే ఓపిక ఎక్కడ ఆ వివాహం జరిపించే పురోహితులకి? ముహూర్త సమయం ముంచుకొస్తోందనో, ఇంకోచోట రేపు జరగవలసిన కార్యక్రమం కోసం ఫోన్లో ఏర్పాటలో చేయడం లోనో, లేదా ఈనాటి పెళ్ళికి అతి ముఖ్యమైన ఫొటోగ్రాఫర్ అనే శక్తి  నుండి వధూవరుల దృష్టి తిప్పడానికో ఆయన కృషి!

మంగళ సూత్ర ధారణ సమయం లో ముడికి ఏడు తరాలు చప్పున, మూడు ముళ్ళు అంటే 21 తరాలు తరిస్తాయి. అటు వంటి మంగళ సూత్ర ధారణ , అంతకు ముందు కన్యాదాత చేసిన మహాసంకల్పాన్ని నిజం చేస్తుంది - మయా సహ దశ పూర్వేషామ్ దశ పరేషామ్!

ఇటువంటి  సంకల్పం తో జరుగుతున్న కార్యక్రమములో పాల్గొనే ముఖ్య పాత్రధారులయిన వధూవరుల అలవాట్లు, అభిరుచులు, సంస్కృతీ, సాంప్రదాయాలు కలవాలి కదా! ఆ మనోవాక్కాయకర్మలలో వారిరువురూ మమేకమయినప్పుడే కదా ఆ సంకల్పం సిద్ధించేది.  

కన్యాదానం, సమీక్షణ, యోక్త్ర మరియు మంగళసూత్ర ధారణ,  అక్షతారోపణము వంటి వివాహ ఘట్టాల్లో వధూవరులు చేసే సంకల్పాలు, ప్రతిఙ్ఞలు నిలవాలి అంటే వారి వైవాహిక జీవనం, వారిని, వారి ముందు మరియు తదుపరి తరాలను ఉద్ధరించే అంతటి ఉన్నతం గా ఉండాలి. అందుకు వారు ఆ సంస్కృతి  కి వారసులై ఉండాలి.  దీనికి పునాది చిన్ననాటి నుండే పడాలి.

ఇందుకు బాధ్యత పెద్దల పైన ఉంది. పిల్లల పెంపకం లో మార్పు రావాలి. స్వశక్తి, ధీశక్తి తో కూడి ఉన్న దైవ భక్తి, సత్సంప్రదాయాలు కలిగిన వారిగా తీర్చి దిద్దండి. వారిలో జిజ్ఞాస పెంచండి. ఉపనిషద్ సారాన్ని నేర్పండి. వేద, వేదాంగాలను పరిచయం చెయ్యండి. భగవద్గీతని వారికి దగ్గర గా చేర్చండి.  మీకు తెలియక పోతే, చదివి, తెలుసుకొని వారికి చెప్పండి.

మీ ఇంట్లో పాటించే క్రతువులు, నోములు, ఆచార వ్యవహారాలపై పిల్లలకి చిన్నపటి నుండే అవగాహన కలిగించండి. వారిని కూడా వాటి నిర్వహణ లో భాగస్వాములను చెయ్యండి. ఇవి వారి చదువులకి ఎటువంటి ఆటంకం రాకుండా కూడా నేర్పవచ్చు. 

దేవుడు అంటే మట్టితోనో, రాతితోనో చేసిన శిల్పం కాదని చెప్పండి. 'న మృత్ శిలా మయా దేవాః, న ఆపోమయం తీర్థం'. మహావాక్యాలను వివరించండి. అప్పటికీ వారి పూర్వ జన్మ కర్మల వలన వారికి ఆ పట్టు దొరకకపోతే, కర్పూరం ఉంచిన పేటికలో కర్పూరం తీసేసినా ఆ వాసన పోనట్టు, మీరు ఇచ్చిన జ్ఞానం వారి వెంట ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ఆ కణం రాజుకొని వారిలో జ్ఞానాగ్ని పుడుతుంది.

ఒక సవినయ విన్నపం - పెళ్లిళ్లు కుదిర్చే పెద్ద మనుషులు, మధ్యవర్తులు కూడా వారి బాధ్యత తెలిసి మసుకోవాలి. కేవలం బాహ్య వాస్తు విశేషాలు మాత్రమే కాదు. ఇతర గుణ విశేషాలు కూడా చూడండి. మీ బాధ్యత 'తాంబూలాలు ఇచ్చేశాం, ఇక తన్నుకు చావండి' అనడం కాదు. వధూవరుల గుణ విశేషాలను క్షుణ్ణంగా తెలుసుకోండి. తెలుసుకొని సంబంధాలను కలపండి. మీకు ఉన్న పవిత్రమయిన బాధ్యత ఇది. మీ పై ఆ ఇరు కుటుంబాలు పెట్టుకున్న నమ్మకం. 

A marriage is not only a mere merger of two bodies and two families. It is the merger of two noble souls with an aim to provide salvation to the previous generations and inspiration to the future ones. It forms the rock bed of Sanatana Dharma. Please do not let it weaken any further.

ఒక వివాహం వలన ఇటు పది తరాలు, అటు పది తరాలు తరించాలి. గుర్తుంచుకోండి "దశ పూర్వేషామ్ దశాపరేషామ్".

Ref: ఉపనయన వివాహావీధి (మూల మంత్ర తాత్పర్యములతో కూడిన) - శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారు, 1993.

No comments: